భారత పౌర అణు విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరుస్తూ కేంద్ర అణుశక్తి శాఖ (డీఏఈ) ఇటీవల విడుదల చేసిన చారిత్రాత్మక ‘శాంతి’ (SHANTI - Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) చట్టం ముసాయిదా నిబంధనలపై అమెరికా అణు పారిశ్రామిక రంగాలు సమగ్ర సమర్పణలు (ఫైనల్ సబ్మిషన్స్) చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా-ఇండియా స్ట్రాటెజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) నేతృత్వంలో అమెరికాలోని న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఈఐ), ప్రముఖ న్యాయ నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు కలిసి భారత ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను అందించేందుకు కసరత్తు పూర్తి చేస్తున్నాయి.
సెప్టెంబర్ 4వ తేదీ నాటికి డీఏఈకి సమర్పించాల్సిన ఈ స్పందనల కోసం యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ ఇటీవల ఒక ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. భారత పౌర అణు రంగంలో లైసెన్సింగ్ ప్రక్రియ, పరిమితులు, ఇన్సూరెన్స్ ఫ్రేమ్‌వర్క్, ప్రైవేట్ పెట్టుబడుల భద్రత, ప్రాజెక్ట్ నిర్మాణం వంటి కీలక అంశాలపై అమెరికా కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
‘శాంతి’ నిబంధనల ప్రకారం ప్రైవేట్ సంస్థలు, జాయింట్ వెంచర్లు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడం, వాటిని నిర్వహించడం, పరిశోధనలు చేపట్టడానికి తొలిసారిగా అనుమతి లభించింది. అంతేకాకుండా డేటా సెంటర్లు, సెమీకండక్టర్ తయారీ, వైద్య రంగం, వ్యవసాయం వంటి విద్యుతేతర వినియోగానికి కూడా రేడియేషన్ సాంకేతికతను అనుమతిస్తుండడం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తోంది.
2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సాధించాలని, అలాగే 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి నిబంధనలలో స్పష్టత, సరళమైన లైసెన్సింగ్ విధానం ఉన్నప్పటికీ నష్టపరిహార నిబంధనలపై అంతర్జాతీయ కంపెనీల సూచనలు భారత నిర్ణయంలో కీలకం కానున్నాయి. ఈ సవరణలు భారత్-అమెరికా అణు వాణిజ్య సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంతోపాటు భారత గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారనున్నాయని పారిశ్రామిక నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌ల్లో కొత్త టూల్


