టీసీఎస్‌ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌ల్లో కొత్త టూల్ | TCS Laptop Monitoring Tool Cybersecurity Essential or Privacy Nightmare | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌ల్లో కొత్త టూల్

Aug 21 2026 4:25 PM | Updated on Aug 21 2026 4:29 PM

TCS Laptop Monitoring Tool Cybersecurity Essential or Privacy Nightmare

భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగులకు కేటాయించిన ల్యాప్‌టాప్‌ల్లో ‘డిజిటల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మానిటరింగ్’ (డీఈఎం) టూల్‌ను ఏర్పాటు చేయడం ఐటీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీనిపై కంపెనీ, ఉద్యోగుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగింది?

ఉద్యోగులు ఏయే అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు, వాటిపై ఎంత సమయం వెచ్చిస్తున్నారు అనే వివరాలను ఈ కొత్త సాఫ్ట్‌వేర్ సేకరిస్తుందని సమాచారం. డేటా లీకేజీలను అరికట్టడం, ఐటీ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడం, సాంకేతిక సమస్యలను వేగంగా గుర్తించడమే లక్ష్యంగా సంస్థ ఈ చర్యలు చేపట్టినట్లు భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇటీవల ‘జీస్కేలర్’ భాగస్వామ్యాన్ని విస్తరించి డిజిటల్-మానిటరింగ్ పరిష్కారాలను ప్రారంభించినప్పటికీ అదే సాంకేతికతను ఇక్కడ వాడుతున్నారా లేదా అనేది అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ఉద్యోగులలో పెరుగుతున్న ఆందోళన

ఈ నిర్ణయంపై టీసీఎస్ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఐటీ భద్రతకే పరిమితం కాకుండా తమ వ్యక్తిగత పనితీరు, దైనందిన కార్యకలాపాలను పర్యవేక్షించే సర్వైలెన్స్ టూల్‌గా మారుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ఈ సాఫ్ట్‌వేర్ పేరు, దాని వెండర్ వివరాలు, అది ఎలాంటి డేటా సేకరిస్తుంది, ఆ సమాచారాన్ని ఎవరు చూడగలరనే అంశాలపై టీసీఎస్ స్పష్టత ఇవ్వలేదు. ఈ డేటాను వ్యక్తిగత ఉద్యోగి ఐడీతో అనుసంధానిస్తున్నారా లేదా భద్రతా బృందాల విశ్లేషణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.

డేటా నిర్వహణ సవాలు

ప్రస్తుతం టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంత భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగుల ల్యాప్‌టాప్‌ల నుంచి నిరంతరం వచ్చే కార్యకలాపాల సమాచారాన్ని క్రోడీకరించడం, భద్రపరచడం, విశ్లేషించడం ఐటీ బృందాలకు పెద్ద సాంకేతిక సవాలుగా మారనుంది. యాజమాన్యం తమ స్పష్టమైన విధివిధానాలను వెల్లడించి పారదర్శకతను పాటిస్తేనే సంస్థ భద్రతతో పాటు ఉద్యోగుల విశ్వాసాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని కొందరు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: సైబర్ ముఠాల ఆన్‌లైన్ దోపిడీకి కేంద్రం చెక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement