దేశంలో నిత్యం విస్తరిస్తున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్‌కు చెందిన ప్రముఖ డెవలపర్ వేదిక ‘ఫైర్‌బేస్’ ఆధారంగా పనిచేస్తున్న వందలాది మోసపూరిత ఖాతాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖ గూగుల్‌ను ఆదేశించింది. లాభదాయకమైన అప్లికేషన్లు, ఆన్‌లైన్ సేవలు, నకిలీ బ్యాంకింగ్ యాప్‌ల పేరుతో సాగుతున్న ఒకే రకమైన స్కామ్ ప్యాటర్న్‌ను భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించిన అనంతరం ఈ చర్యలు వేగవంతమయ్యాయి.
మోసం సాగిందిలా..
సైబర్ నేరగాళ్లు గూగుల్ ఫైర్‌బేస్ అందించే ఉచిత, చవకైన క్లౌడ్ డేటాబేస్ వసతులను ఆసరాగా చేసుకున్నారు. నిజమైన యాప్‌లుగా నమ్మించేలా డిజైన్ చేసి అమాయక వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్, ఓటీపీలను సేకరించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించారు. అధునాతన విశ్లేషణ ద్వారా ఒకే నెట్‌వర్క్ లేదా ఒకే రీతిలో పంపుతున్న డేటా ట్రాఫిక్‌ను గుర్తించిన ప్రభుత్వ విభాగాలు, ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఉన్న వందలాది ఫైర్‌బేస్ ప్రాజెక్ట్‌లను, డెవలపర్ ఖాతాలను నిలిపేయాలని ఆదేశించాయి.
ప్రభుత్వ ఆదేశాలు.. గూగుల్ స్పందన
దేశ ప్రజల డిజిటల్ భద్రత, ఆర్థిక డేటా రక్షణ నేపథ్యంలో మోసపూరిత ప్రాజెక్టులతో సంబంధం ఉన్న అన్ని ఖాతాలను, వాటి సర్వర్ లింకులను వెంటనే బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై స్పందించిన గూగుల్ తమ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని ఎంతమాత్రం సహించేది లేదని, భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాలను ఇప్పటికే తొలగించే ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించింది. డిజిటల్ విప్లవంతో పాటు పెరుగుతున్న సైబర్ బెదిరింపులను తిప్పికొట్టేందుకు గూగుల్, మెటా.. వంటి టెక్ దిగ్గజాలు తమ వేదికలపై మరింత కఠినమైన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర..


