కంచె చేను మేసింది | Fake online trading app in Telugu states encourages investment in fraudulent network | Sakshi
Sakshi News home page

కంచె చేను మేసింది

Oct 5 2026 3:33 AM | Updated on Oct 5 2026 3:33 AM

Fake online trading app in Telugu states encourages investment in fraudulent network

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ – క్యూవీఎస్‌ఈ కలకలం

రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారిన వైనం

మోసపూరిత నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రోత్సాహం

తద్వారా కమీషన్ల ద్వారా లక్షలాది రూపాయల ఆర్జన

రూ.100 కోట్ల డిపాజిట్లు పోగొట్టుకున్న సామాన్యులు, ఉద్యోగులు

ద్వారకానగర్‌: విశాఖపట్నం కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ‘క్యూవీఎస్‌ఈ’ (క్వాంట్‌ వెస్ట్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్) నకిలీ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ దారుణానికి పాల్పడిన సైబర్‌ నేరగాళ్లకు కొమ్ముకాస్తూ కమీషన్ల కక్కుర్తితో ప్రజలను నిండా ముంచింది స్వయంగా రక్షణ కల్పించాల్సిన పోలీస్‌ అధికారులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ఆర్టీసీ అధికారులేనన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సదరు అధికారులు మోసపూరిత నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. కెన్యా నుంచి ఆపరేట్‌ అవు­తున్నట్లుగా భావిస్తున్న ఈ సైబర్‌ ముఠా తెలు­గు రాష్ట్రాల్లో సామాన్య ప్రజల నుంచి రూ. 100 కోట్ల వరకు డిపాజిట్ల రూపంలో కొల్లగొట్టింది.  

లక్షల సంపాదనే లక్ష్యంగా అధికారుల అక్రమం
అందుతున్న సమాచారం ప్రకారం  ఒక ఎస్‌ఐ తన హోదాను అడ్డుపెట్టుకుని దాదాపు 200 మందిని ఈ చైన్‌ మార్కెటింగ్‌ వలలోకి లాగారు.  ద్వారకానగర్, కంచరపాలెం, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పలువురు అధికారులు, కానిస్టేబుళ్లు ఈ యాప్‌ను ప్రమోట్‌ చేశారు. ఒకరిని చేర్పిస్తే వచ్చే డైరెక్ట్‌ కమీషన్‌తో పాటు, కింద ఎక్కువ మంది చేరే కొద్దీ ’గోల్డ్‌ మెంబర్‌’, ’మెగా మెంబర్‌’ స్థాయిలకు ఎదిగి నెలకు లక్షలాది రూపాయల అక్రమ ఆదాయం పొందారు. ఒక పోలీస్‌ అధికారి కేవలం కమీషన్ల రూపంలోనే ఏకంగా రూ. 80 లక్షల వరకు పొందారు.

డ్యూటీ వేళల్లో స్టేషన్‌లో ఉండాల్సిన సదరు అధికారులు, రోజంతా ఫోన్లలో యాప్‌లను పరిశీలించడం, బాధితులను పెట్టుబడులు పెట్టమ­ని ప్రోత్సహించడానికే ఎక్కువ సమయం కేటా­యించారు. కొందరు పోలీసు అధికారులు ఒకవైపు ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా కోట్లు దండుకుంటూనే, మరోవైపు తమ పరిధిలోని స్పా సెంటర్లు, బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాల నుంచి బెదిరింపులకు పాల్పడి భారీగా మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇక ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఆర్టీసీ డైరెక్టర్‌ స్థాయి అధికారి ఈ యాప్‌లో ‘మెగా మెంబర్‌’ హోదా సాధించే స్థాయికి వెళ్లి, తమ శాఖలో పనిచేసే సిబ్బందిని, కింది స్థాయి ఉద్యోగులను ఈ యాప్‌లోకి భారీగా చేర్పించారు.  విజయనగరం నుంచి విజయవాడ వరకు ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను టార్గెట్‌ చేసి కోట్ల రూపాయలు డిపాజిట్లు చేయించారు. ఈ క్రమంలో సదరు ఆర్టీసీ అధికారికి రూ. కోటి వరకు కేవలం కమీషన్‌ రూపంలోనే దక్కినట్లు తెలుస్తోంది.

రాజకీయ జోక్యం ఆరోపణలు
ద్వారకానగర్‌ పరిధిలో నమోదైన ఓ దోపిడీ కేసుకు, ఈ క్యూవీఎస్‌ఈ యాప్‌ మోసానికి సంబంధం ఉండగా, పట్టుబడిన ప్రధాన నిందితుడిని కూటమికి చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు రాత్రికి రాత్రే తప్పించారనే వార్తలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు తమపైనే ఎదురు కేసులు పెట్టి వేధిస్తారేమోనన్న భయంతో చాలామంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేకపోతున్నారు.  

రూ. లక్ష డిపాజిట్‌కు నెలకు రూ.20,000!
సామాన్యులు తమ కష్టార్జితాన్ని, పొదుపు చేసుకున్న సొమ్మును ఈ నకిలీ యాప్‌లో కుమ్మరించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి
»  రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే నెల రోజుల్లో రూ. 20,000 లాభం ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు ఎర వేశారు. యాప్‌లో డబ్బులు చెల్లిస్తే అవి డాలర్లలోకి మారి క్రెడిట్‌ అవుతాయని నమ్మించారు. మొద­టి కొన్ని రోజులు చిన్న మొత్తంలో విత్‌డ్రాలు ఇచ్చి నమ్మకం కలిగించడంతో, చాలామంది తమ బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టారు.

» ఇక రెండవది సమాజంలో హోదా ఉన్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు స్వయంగా వచ్చి ‘మేము కూడా పెట్టాం, మాకు లాభాలు వస్తున్నాయి’ అని చెప్పడంతో సామాన్యులు, బంధువులు, స్నేహితులు కళ్లు మూసుకుని ఈ బోనులో చిక్కుకున్నారు.

» ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఈ యాప్‌ అసలు రంగు బయటపడింది. బాధితులు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా,  అకౌంట్లను నేరగాళ్లు బ్లాక్‌ చేశారు. బ్లాక్‌ అయిన ఖాతాలను అన్‌బ్లాక్‌ చేయాలంటే  ‘మరింత డబ్బు చెల్లించాలి’ అని డిమాండ్‌ చేస్తూ అదనంగా దండుకున్నారు. చివరకు యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను పూర్తిగా మూసివేసి, కస్టమర్‌ కేర్‌ నంబర్లను స్విచ్‌ ఆఫ్‌ చేసి సైబర్‌ నేరగాళ్లు పరారయ్యారు. 

» తమ డబ్బులు రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు  నిలదీయడం ప్రారంభించడంతో వారిని ఈ నెట్‌వర్క్‌లో చేర్పించిన అధికారులు సమాధానం చెప్పలేక సిక్‌ లీవ్‌ల పేరుతో ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement