ఒక్క క్లిక్‌.. ఖాతా ఖాళీ : ఆన్‌లైన్‌ ఆఫర్‌లు..మోసాలకు పండుగే | Beware of festive Online offers are a field day for scams | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌.. ఖాతా ఖాళీ : ఆన్‌లైన్‌ ఆఫర్‌లు..మోసాలకు పండుగే

Oct 3 2026 2:39 PM | Updated on Oct 3 2026 2:45 PM

Beware of festive Online offers are a field day for scams

దసరా, దీపావళి పండుగలు దగ్గరికొచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటి నుంచి  ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్‌ సేల్స్, ప్రత్యేక ఆఫర్లు హోరెత్తుతుంటాయి. అయితే తక్కువ ధరకే ఖరీదైన వస్తువులు లభిస్తున్నాయనే ఆశతో చాలామంది ఆర్డర్‌లు చేసేస్తుంటారు. అయితే ఇదే సమయంలో సైబర్‌ మోసగాళ్లు కూడా రంగంలోకి దిగుతారు. నమ్మకమైన ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్లు, మోసపూరిత యూపీఐ రిక్వెస్టులు, నకిలీ డెలివరీ మెసేజ్‌లు, ఓటీపీల పేరుతో పలు మార్గాల్లో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటారు. ఆదమరిస్తే ఉన్నదంతా ఊడ్చేసుకొని పోతారు. ఇలాంటి సందర్భాల్లోనే  జాగ్రత్తగా ఉండటం మంచిది. 

సోషల్‌ మీడియాలో నకిలీ షాపింగ్‌ ప్రకటనలు
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా  ప్లాట్‌ఫామ్‌లలో ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తుంటాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే వస్తువులు, బ్రాండెడ్‌ ఉత్పత్తులు, భారీ డిస్కౌంట్లు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తారు. కానీ డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువు రాక పోవచ్చు. కొన్నిసార్లు ఆ అకౌంట్‌ కూడా కనిపించకుండా పోవచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందు ఆ అకౌంట్‌ ఎంతకాలంగా ఉందో,  పాత  పోస్టులు ఉన్నాయో, నిజమైన కస్టమర్‌ రివ్యూలు ఉన్నాయో ఖచ్చితంగా పరిశీలించాలి.

భారీ ‘రిఫండ్‌’ పేరుతో యూపీఐ మోసం
‘మీ ఆర్డర్‌లో సమస్య వచ్చింది.. రిఫండ్‌ ఇస్తున్నాం.. ఈ యూపీఐ రిక్వెస్ట్‌ను అప్రూవ్‌ చేయండి’ అంటూ ఫోన్‌ లేదా మెసేజ్‌ రావచ్చు. ఇక్కడే అసలు మోసం దాగి ఉంటుంది. యూపీఐ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే మీ ఖాతాలోకి డబ్బు రావడం కాదు.. మీ ఖాతా నుంచి డబ్బు వెళ్లే ప్రమాదం ఉంటుంది. రిఫండ్‌  పొందడానికి యూపీఐ పిన్‌ నమోదు చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. 

ఇదీ చదవండి: ఈజీగా బరువు తగ్గాలంటే : ఉప్మా-పోహా ఏది బెస్ట్‌

కాల్‌ కట్‌ చేయడం మంచిది!
‘మీ అకౌంట్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తున్నాయి’ అంటూ సైబర్‌ మోసగాళ్లు కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులుగా ఫోన్‌ చేయొచ్చు. కొన్నిసార్లు మీరు ఇటీవల చేసిన ఆర్డర్‌ వివరాలను కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కస్టమర్‌ కేర్‌ పేరుతో ఎవరైనా ఓటీపీ అడిగితే ఎలాంటి వివరాలు ఇవ్వకుండా కాల్‌ కట్‌ చేయడం సురక్షితం. 

ఇదీ చదవండి: 12 ఏళ్ల కొడుకు గొంతు నులిమి? కష్టాల్లో ప్రముఖ నటి

లింక్‌పై క్లిక్‌ చేస్తే ప్రమాదమే!
ఫెస్టివల్‌ సీజన్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి. ఇదే విషయాన్ని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ‘మీ  పార్సెల్‌ డెలివరీ కాలేదు. మళ్లీ డెలివరీ కావాలంటే చిన్న మొత్తంలో రీ–డెలివరీ లేదా కస్టమ్స్‌ ఫీజు చెల్లించండి’’ అంటూ ఎస్‌ఎంఎస్‌ పంపవచ్చు. అందులో ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేస్తే అసలైన కొరియర్‌ వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ పేజీ తెరుచుకోవచ్చు. అక్కడ కార్డు నంబర్, వ్యక్తిగత వివరాలు లేదా ఇతర చెల్లింపు సమాచారాన్ని అడగవచ్చు. మీరు నిజంగానే పార్సెల్‌ కోసం ఎదురు చూస్తుంటే..  ఎస్‌ఎంఎస్‌లో వచ్చిన లింక్‌ను ఉపయోగించకుండా మీరు ఆర్డర్‌ చేసిన అధికారిక యాప్‌ లేదా కొరియర్‌ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోనే ట్రాకింగ్‌ నంబర్‌తో స్టేటస్‌ చెక్‌ చేయడం మంచిది. 

నకిలీ వెబ్‌సైట్‌
‘70 శాతం, 80 శాతం డిస్కౌంట్‌’ అంటూ వచ్చే ప్రకటనలు కనిపించగానే వెంటనే క్లిక్‌ చేసేస్తాం. కానీ అసలు షాపింగ్‌ సైట్ల పేర్లను  పోలిన నకిలీ డొమైన్లను సృష్టించి మోసగాళ్లు ప్రకటనలు ఇస్తుంటారు. వెబ్‌సైట్‌ చూడటానికి అచ్చం అసలైనదిలానే కనిపించవచ్చు. వస్తువులు, ధరలు, చిత్రాలు కూడా నిజమైనవిగానే అనిపించొచ్చు. కానీ వెబ్‌ అడ్రస్‌లో చిన్న మార్పు ఉండొచ్చు. అందుకే పేమెంట్‌ చేసే ముందు బ్రౌజర్‌లోని యూఆర్‌ఎల్‌ ను అక్షరం అక్షరం పరిశీలించడం చాలా ముఖ్యం. 

ఒక్క క్లిక్‌.. ఖాతా ఖాళీ 
ఫెస్టివల్‌ సేల్‌లో డిస్కౌంట్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘ఇప్పుడే కొనండి.. చివరి అవకాశం.. మరికొన్ని నిమిషాలే’ వంటి సందేశాలు మనలో తొందరను పెంచుతాయి. ఈ అత్యవసర భావననే సైబర్‌ మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. అందుకే భారీ డిస్కౌంట్‌ కనిపించిన ప్రతిసారీ వెంటనే పేమెంట్‌ చేయకుండా.. వెబ్‌సైట్‌ నిజమైనదేనా? విక్రేత ఎవరు? యూఆర్‌ఎల్‌ సరైనదేనా? చెల్లింపు రిక్వెస్ట్‌ ఎందుకు వచ్చింది? వంటి ప్రశ్నలను ముందుగా పరిశీలించాలి. ఫెస్టివల్‌ సేల్‌లో మంచి డీల్‌ దొరకడం ఆనందమే.. కానీ ఆ డీల్‌ పేరుతో మన డబ్బు, వ్యక్తిగత వివరాలు  పోకుండా అప్రమత్తంగా ఉండటం మరింత ముఖ్యం. 

ఇదీ చదవండి: చాలా భయపడిపోయా.. స్మిట్‌ మచ్చార్‌ భార్య ఎమోషనల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement