విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి.. ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి షాక్ ఇచ్చింది. విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటించింది.
కొత్త ఛార్జీలు అక్టోబర్ 6 నుంచి చేసే అన్ని కొత్త బుకింగ్‌లకు వర్తించనున్నాయని సంస్థ పేర్కొంది. దీంతో ప్రయాణికులు టికెట్ కోసం గతంలో కంటే కొంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవల ఏటీఎఫ్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గత వారంలోనే లీటర్ ఇంధన ధర రూ.16 మేర పెరగగా, అంతకుముందు ఆగస్టులో రూ.5, సెప్టెంబర్‌లో మరో రూ.6.28 చొప్పున పెరిగింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఇంధన వ్యయం దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. దీంతో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారీ విమానయాన సంస్థలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఈ భారాన్ని కొంతవరకు తగ్గించుకునేందుకే ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచుతున్నట్లు ఇండిగో తెలిపింది.
దేశీయ విమానాల విషయానికి వస్తే.. ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జ్ మారుతుంది. 500 కిలోమీటర్ల వరకు ఉన్న మార్గాలకు రూ.375, 1,000 కిలోమీటర్ల వరకు రూ.600, 1,500 కిలోమీటర్ల వరకు రూ.900, 2,000 కిలోమీటర్ల వరకు రూ.1,150 ఛార్జ్ వసూలు చేయనున్నారు. 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటే.. ఒక్కో ప్రయాణికుడిపై రూ.1,300 వరకు ఛార్జ్ పడనుంది. అంటే ప్రయాణ దూరం పెరిగే కొద్దీ టికెట్ ధర పెరుగుతుంది.
అంతర్జాతీయ ప్రయాణికులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సార్క్ దేశాలకు వెళ్లే విమానాలపై రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఛార్జ్ విధించనున్నారు. ఆఫ్రికా మార్గాల్లో రూ.6,000 వరకు, యూరప్ వెళ్లే విమానాలపై ఏకంగా రూ.10,000 వరకు అదనపు ఛార్జ్ ఉంటుంది.
ఇదీ చదవండి: జియో రీచార్జ్: 30 రోజుల ప్లాన్.. 25జీబీ డేటా!


