సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విమాన టికెట్ల ధరలను పెంచక తప్పదని ఇండిగో సీఈఓ విల్లీ వాల్ష్ వెల్లడించారు. విమాన ఇంధన ధరల పెరుగుదల వల్ల కంపెనీపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆయన తెలిపారు.
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలను నమోదు చేసింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో సదరు కంపెనీ రూ.1,879 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్టు ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఈ సంస్థ ఆదాయం 26 శాతం పెరిగి రూ.23,364 కోట్లకు చేరింది. అయితే ఇంధన వ్యయాలు ఏడాది క్రితంతో పోలిస్తే 67 శాతం పెరగడంతో లాభదాయకతపై ప్రభావం పడింది.
ఇప్పటికే పెరిగిన ఇంధన ఛార్జీలు
విమాన ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఇండిగో అక్టోబర్ 6 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఛార్జీలను పెంచింది. దేశీయ ప్రయాణాలకు దూరాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1,300 వరకు ఇంధన ఛార్జీలను వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలు అంతర్జాతీయ మార్గాల్లో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉన్నాయి. యూరప్ వెళ్లే విమానాలకు మాత్రం అత్యధికంగా రూ.10,000 ఛార్జీ విధిస్తోంది.
సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండిగో ప్రయాణికుల సంఖ్య 4.5 శాతం తగ్గి 2.75 కోట్లకు చేరింది. దాంతో ఈ సంస్థ ఖర్చులను నియంత్రించేందుకు విమాన సర్వీసుల సామర్థ్యాన్ని కూడా తగ్గించింది. డిసెంబర్ త్రైమాసికంలో సర్వీసు సామర్థ్యం స్వల్పంగా పెరుగుతుందని ఇండిగో అంచనా వేస్తోంది.
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా రానున్న రోజుల్లో ఇంధన ఖర్చులు అధికంగానే ఉండే అవకాశం ఉందని వాల్ష్ తెలిపారు. పెరుగుతున్న వ్యయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటూనే, అవసరమైతే టికెట్ ధరలను పెంచుతామని ఆయన సంకేతాలిచ్చారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో ప్రముఖ జ్యోతిష్యుడి భార్య ఘోర ఓటమి!


