సాహితీ వినువిహారం | Sakshi Editorial Story On Aircraft History Before Wright Brothers | Sakshi
Sakshi News home page

సాహితీ వినువిహారం

Oct 12 2026 4:16 AM | Updated on Oct 12 2026 4:16 AM

Sakshi Editorial Story On Aircraft History Before Wright Brothers

ఊహలకు హద్దులుండవు. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు దీనికి తార్కాణాలు అనేకం. సాహితీ సృజన చేసే కవులు, రచయితల ఊహలు గిరిగీసుకొని ఉండవు. రైట్‌ సోదరులు విమానాన్ని రూపొందించడానికి శతాబ్దాల ముందే పురాతన సాహితీవేత్తలు విమానాలను ఊహించారు. అనేకానేక ఆధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు పురా కల్పనలే మూలాధారాలు.

నాగరికతలు మొదలై, భాషలు ఊపిరి పోసుకున్న తర్వాత మానవులు తమ ఊహలకు అక్షరరూపమిచ్చారు. పక్షుల మాదిరిగా తమకు రెక్కలు లేకపోయినా, వాటిలా ఆకాశంలో ఎగరడానికి వీలైన సాధనమేదైనా ఉంటే బాగుండని తలచారు. ఇలా ఊహించిన వారిలో ప్రాచీన కవులు కూడా ఉన్నారు. మానవుల వినువిహార కాంక్ష వారి రచనల్లో దివ్యవిమానాలుగా రూపుదిద్దుకుంది.

మన పురాణేతిహాసాల్లో ఇలాంటి దివ్యవిమానాల ప్రస్తావనలు అనేకం ఉన్నాయి. ‘రామాయణం’లోని పుష్పకవిమానం చాలామందికి తెలుసు. భాగవతంలో రెండు దివ్యవిమానాల గాథలు ఉన్నాయి. వాటిలో ఒకటి: కర్దమ మహర్షి తన భార్య దేవహూతి కోసం ముల్లోకాల్లోనూ సంచరించగల దివ్యవిమానాన్ని సృష్టించిన గాథ. మరొకటి: శిశుపాలుడికి మిత్రుడైన సాళ్వుడు శ్రీకృష్ణుడిపై పగ తీర్చుకోవడానికి మయుడి ద్వారా ‘సౌభకం’ అనే దివ్యవిమానాన్ని పొందిన గాథ. ఇలాంటి దివ్యవిమానాల గాథలు మన అష్టాదశ పురాణాల్లోనే కాదు, ప్రాచీన గ్రీకు, రోమన్‌ పురాణాల్లోనూ కనిపిస్తాయి.

పురాణాలకు వెలుపల చరిత్రకెక్కిన కొన్ని గ్రంథాల్లోనూ విమాన ప్రస్తావనలు ఉన్నాయి. భరద్వాజ మహర్షి ప్రోక్తంగా ప్రాచుర్యం పొందిన ‘వైమానిక శాస్త్రం’లో నాలుగు రకాల విమానాల ప్రస్తావన ఉంది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందిన భోజరాజు రచించిన ‘సమరాంగణ సూత్రధార’లో పాదరసం ఇంధనంగా నడిచే విమానాల ప్రస్తావన ఉంది.

పురా సాహిత్యాన్ని అటుంచితే, ఆధునిక సాహిత్యంలోనూ రైట్‌ సోదరుల విమాన రూపకల్పనకు ముందు కూడా వినువిహార కల్పనలు కనిపిస్తాయి. రైట్‌ సోదరులు విమానావిష్కరణకు సమీప గతంలోనే ఫ్రెంచ్‌ రచయిత జూల్స్‌ వెర్న్‌ ‘ఫైవ్‌ వీక్స్‌ ఇన్‌ ఎ బెలూన్‌’ నవలలో గాలి నింపిన బెలూన్‌తో గగనయాన ఘట్టాన్ని ఉత్కంఠభరితంగా రాశాడు. ఇదే రచయిత కొన్నాళ్లకు ‘ది క్లప్పర్‌ ఆఫ్‌ ది క్లౌడ్స్‌’ అనే మరో నవల రాశాడు. ఇందులో ఆయన బ్యాటరీతో ఎగరగలిగే హెలికాప్టర్‌ వంటి లోహవిహంగం గురించి రాశాడు. 
అదేకాలంలో ఇంగ్లిష్‌ రచయిత హెచ్‌.జి.వెల్స్‌ కూడా రెండు నవలలను దాదాపు ఇలాంటి ఊహలతోనే రాశాడు. వాటిలో మొదటిది ‘ది అర్గోనాట్స్‌ ఆఫ్‌ ది ఎయిర్‌’. 

ఇందులో కలపతో నిర్మించిన పట్టాల మీద తీసే పరుగుతో ఊపందుకుని, ఆకాశంలోకి ఎగరగలిగే వాహనం గురించి రాశాడు. ఆ తర్వాత ‘ఫిల్మర్‌’ అనే నవల రాశాడు. 

అందులో అధునాతనమైన ఇంజిన్‌ ద్వారా ఎగరగలిగే వాహనం గురించి రాశాడు. దీని వర్ణన దాదాపు ఆధునిక విమానాన్ని పోలి ఉంటుంది. ‘ఫిల్మర్‌’ నవల వెలువడిన రెండేళ్ల తర్వాత రైట్‌ బ్రదర్స్‌ విమాన రూపకల్పన విజయవంతమైంది. 

వీళ్లదంతా ఒక ఎత్తయితే, విమానాలు ఎగరడం మొదలైన చాలాకాలం తర్వాత స్విస్‌ రచయిత ఎరిక్‌ వాన్‌ డానికెన్‌ ‘చారియట్స్‌ ఆఫ్‌ ది గాడ్స్‌’ నవల రాశాడు. పురాతన కాలంలోనే అత్యధునాతన సాంకేతికత కలిగిన గ్రహాంతర వాసులు భూమ్మీదకు నిప్పులు చిమ్మే అగ్ని రథాలపై వచ్చారని రాశాడు. తన కల్పనకు ఆధారంగా అనేక పురాతన కట్టడాలను ఉదహరించాడు. ఈ నవల రాసినందుకు ఆయనకు ‘ఐజీ నోబెల్‌’ అవార్డు దక్కింది.

నోబెల్‌ బహుమతి తరహాలోనే ఏటా ‘ఐజీ నోబెల్‌’ను ఇవ్వడం ముప్పయి ఐదేళ్ల కిందట మొదలైంది. ఈ అవార్డును మొదలుపెట్టిన ఏడాదే డానికెన్‌ దీనిని దక్కించుకున్నాడు. ఐజీ నోబెల్‌ ఒక వెటకార సత్కారం. అలాగని డానికెన్‌ రచనలను మరీ వెటకారంగా తీసుకోలేం. ఆయనకు ఐజీ నోబెల్‌ తెచ్చిపెట్టిన ‘చారియట్స్‌ ఆఫ్‌ ది గాడ్స్‌’ పలు భాషల్లోకి అనువాదం పొంది, ఏడుకోట్లకు పైగా కాపీలు అమ్ముడైంది. అంతుచిక్కని గ్రహాంతర వాహనాలు కనిపించిన ఉదంతాలపై అమెరికా ఇప్పటికీ రహస్య పరిశోధనలు సాగిస్తున్న నేపథ్యంలో డానికెన్‌ ఊహ ఏదో ఒకనాటికి నిజం కాకుండా పోతుందా!

ఇదీ చదవండి: ‘నోబెల్‌ శాంతి’కి సరైన ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement