వారి అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి
మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రమైన వసతులు కల్పించాలి
కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా ఖైదీలు, వారి పిల్లల మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మహిళా ఖైదీలు, వారి సంరక్షణలో ఉన్న పిల్లలు ఇతర ఖైదీలతో పోలిస్తే మరింత సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నందున, వారి హక్కులు, అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు డైరెక్టర్ జనరల్స్‌కు బుధవారం సూచనలు జారీ చేసింది.
గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించాలి
జైళ్లలో భద్రతా చర్యలకే పరిమితం కాకుండా, మహిళా ఖైదీలకు గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. తల్లులు, పిల్లలకు తగిన వైద్య సేవలు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని సూచించింది. న్యాయ సహాయం పొందే అవకాశాలను మెరుగుపరచడంతోపాటు కుటుంబ సంబంధాలను కాపాడటం, పిల్లల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, విడుదల అనంతరం సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు పునరావాస అవకాశాలు కల్పించడం అవసరమని వెల్లడించింది.
ఇదీ చదవండి: నెక్ట్స్ లెవల్ : దోసె, ఫిల్టర్ కాఫీకి జర్మన్ యువకుడు ఫిదా!
పది కీలక అంశాలపై దృష్టి
మహిళా ఖైదీల హక్కుల పరిరక్షణ కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో పది ప్రధాన అంశాలను చేర్చారు. జైలు ప్రవేశానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు, అరెస్టు ప్రక్రియ, జైలులో ప్రవేశ సమయంలో నమోదు చేయాల్సిన వివరాలు, పిల్లల సమాచార సేకరణ, ఆరోగ్య, మానసిక ఆరోగ్య సేవలు, మహిళా ఖైదీల నివాస పరిస్థితులు, పరిశుభ్రత, సంక్షేమం, సిబ్బందికి అవగాహన కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే, ఖైదీలతో కలిసి జైళ్లలో నివసించే పిల్లల సంరక్షణ, తల్లుల నుంచి వేరుగా ఉన్న పిల్లల సంక్షేమం, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు, కలుసుకునేందుకు అవకాశాలు కల్పించడం, జైలు పరిపాలన, న్యాయ సహాయం, న్యాయాన్ని పొందే హక్కు వంటి అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
ఇదీ చదవండి: షాకిచ్చిన కర్ణాటక : లీటరు పాల ధర రూ. 8 పెంపు
మహిళా ఖైదీలను కోర్టులకు తీసుకెళ్లే సమయంలో వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం, సంక్షేమ చర్యలు చేపట్టడం, విడుదల అనంతరం పునరావాసం, సామాజిక పునరేకీకరణకు అవకాశాలు కల్పించడం, విదేశీ మహిళా ఖైదీల హక్కుల పరిరక్షణపైనా ప్రత్యేక సూచనలు చేసింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న సిఫార్సులను సంబంధిత అధికారులు అమలు చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరింది. ఈ సిఫార్సుల అమలులో ఇప్పటివరకు సాధించిన పురోగతిపై రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా?


