కేంద్ర మంత్రుల పిల్లలు.. ఫారిన్‌లో చదువులు, భారీ కొలువులు! | Where Are Union Ministers Children Studying and Working Abroad | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రుల పిల్లలు.. ఫారిన్‌లో చదువులు, భారీ కొలువులు!

Oct 14 2026 11:35 AM | Updated on Oct 14 2026 11:35 AM

Where Are Union Ministers Children Studying and Working Abroad

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలు, గ్రీన్‌కార్డ్‌ ప్రక్రియపై ఆంక్షలతో విదేశాల్లోని భారతీయ నిపుణుల్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చి దేశ అభివృద్ధికి తోడ్పడాలని శ్రీధర్‌ వెంబులాంటి వాళ్లు పిలుపు ఇస్తున్నారు. దానికి కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా మద్దతు ప్రకటించిన.. స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో రాజకీయ నేతల పిల్లలు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, అక్కడి సంస్థల్లో పనిచేయడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కుమారుడు ధ్రువ్‌ గోయల్‌ హార్వర్డ్‌ కాలేజీలో ఎకనామిక్స్‌ చదివారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ముంబై, న్యూయార్క్‌లో కార్యాలయాలున్న ఫోర్‌లయన్‌ క్యాపిటల్‌ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమార్తె రాధిక గోయల్‌ ఆక్స్‌ఫర్డ్‌లో చదివి, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాన్‌ డియాగోలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పరిశోధన చేస్తున్నారు.

విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కుమారుడు అర్జున్‌ జైశంకర్‌ న్యూయార్క్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సెక్యూరిటీలో ఎంఎస్‌ అభ్యసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మరో కుమారుడు ధ్రువ జైశంకర్‌ మకాలెస్టర్‌ కాలేజీలో చరిత్ర, క్లాసిక్స్‌ చదివారు. జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో సెక్యూరిటీ స్టడీస్‌లో మాస్టర్స్‌ చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లోని అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ అమెరికా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కుమార్తె వాంగ్మయి పరాకాలా నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలోని మెడిల్‌ స్కూల్‌లో జర్నలిజంలో మాస్టర్స్‌ చేశారు. జర్నలిస్టుగా, రచయితగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కుమార్తె నైమిషా ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో చదివి, టఫ్ట్స్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ప్రస్తుతం యూఎస్‌–ఇండియా స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరమ్‌లో పనిచేస్తున్నారు. అంతకుముందు నీతి ఆయోగ్‌, సీఎస్‌ఐఎస్‌ వంటి సంస్థల్లో పనిచేశారు.

యేల్‌లో చదివి.. క్రికెట్‌ సంఘానికి అధ్యక్షుడిగా
కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కుమారుడు కార్తికేయ చౌహాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. 2017లో సుందర్‌ ఫుడ్స్‌ అండ్‌ డెయిరీని ప్రారంభించారు. ఈ సంస్థ 7,500కు పైగా రైతు కుటుంబాలతో పనిచేస్తోంది. మరో కుమారుడు కునాల్‌ చౌహాన్‌ న్యూయార్క్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి, మధ్యప్రదేశ్‌లో డెయిరీ తదితర వ్యాపారాల్లో ఉన్నారు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానార్యమన్‌ సింధియా యేల్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌, గవర్నమెంట్‌ చదివారు. 2025 నుంచి మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన కుమార్తె అనన్య రాజే సింధియా రోడ్‌ ఐలాండ్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌లో చదివి, ప్రస్తుతం అమెరికాలోని గూగుల్‌ డీప్‌మైండ్‌లో డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కుమార్తె తన్యా వైష్ణవ్‌ బ్రిటన్‌లోని ఓ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఆమె బ్యూటీ, వెల్‌నెస్‌, హెయిర్‌కేర్‌ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. కుమారుడు రాహుల్‌ వైష్ణవ్‌ అడ్లర్‌ ఇండస్ట్రియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 

స్వదేశంలో అవకాశాలు ఉన్నాయా?
అధికారంలో ఉన్నవాళ్లే కాదు.. ప్రతిపక్ష నేతల పిల్లలు కూడా ఇదే బాటలో ఉన్నారు. కొందరు వ్యాపార రంగంలో, మరికొందరు పరిశోధన, జర్నలిజం, ప్రజా విధానాలు, రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కొందరికి విదేశాల్లో వృత్తిపరమైన అనుబంధాలు ఉండగా, మరికొందరు భారత్‌లోనే వ్యాపార, ప్రజాజీవిత రంగాల్లో పనిచేస్తున్నారు. విదేశాల్లో చదువుకున్నవారు స్వదేశానికి తిరిగిరావాలంటే భారత్‌లోనూ నాణ్యమైన ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు, సాంకేతిక సంస్థలు, వ్యాపారాలకు అనుకూల వాతావరణం ఉండాలి. అందుకే విదేశాల్లో ఉన్న భారతీయ నిపుణులు తిరిగిరావాలన్న పిలుపుల నేపథ్యంలో ఈ అంశం మరోసారి చర్చకు వస్తోంది.

ఇదీ చదవండి: సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement