దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గొంతుకను అణచివేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనధికారిక ఎమర్జెన్సీని అమలు చేస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శించారు. సీజేపీ కోర్ కమిటీ సభ్యుల అరెస్ట్.. రిమాండ్ల నేపథ్యంపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఐదు రోజుల పాటు న్యాయ కస్టడీకి పంపడంపై దీప్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకుంటే ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తోందని ఆరోపించారు.
జాతీయ జెండాను ప్రదర్శించారనే ఆరోపణలతో నేతలను కస్టడీకి పంపడం ఏమిటని ప్రశ్నించారు. నిరసన తెలిపిన వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని సృష్టించాలని చూస్తోందని విమర్శించారు.
ఇండియా కూటమితో కలవం, కానీ..
ఎన్నికల అక్రమాలు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై ప్రశ్నించడంలో ఇండియా కూటమి, సీజేపీ లక్ష్యం ఒక్కటేనని దీప్కే చెప్పారు. అయితే, అందుకోసం తమ పార్టీ ఇండియా కూటమిలో చేరబోదని స్పష్టం చేశారు. సీజేపీ స్వతంత్ర ఒత్తిడి బృందంగా కొనసాగుతుందని, రాజకీయ పార్టీగా మారడం లేదంటే ఇండియా కూటమిలో విలీనం కావడం తమ ఉద్దేశం కాదని తేల్చిచెప్పారు.
Nagpur, Maharashtra: CJP founder Abhijeet Dipke asserted that the Cockroach Janta Party is an independent pressure group and will continue to operate independently. #Nagpur #Maharashtra #AbhijeetDipke #CJP https://t.co/VvZ75pKuLx
— The Guardian Chronicle (@gcnewsindia) October 14, 2026
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ప్రశ్నించడం, ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని కోరడం తమ పోరాటంలో భాగమని పేర్కొన్నారు. ఒక అంశంపై ప్రతిపక్ష కూటమితో అభిప్రాయాలు కలిసినంత మాత్రాన ఆ కూటమిలో చేరినట్లు కాదని ఆయన కుండబద్ధలు కొట్టారు.
‘అర్బన్ నక్సల్స్’పై రియాక్షన్
సీజేపీని అర్బన్ నక్సల్స్ బృందంగా చిత్రీకరించడాన్ని దీప్కే తోసిపుచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసన తెలపడం దేశవ్యతిరేక చర్యలు కావని పేర్కొన్నారు. విమర్శించే వారిపై ముద్రలు వేసి వారి గొంతు నొక్కాలని చూడటం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయకుండా ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు, నిరసనకారులపై చర్యలు, ప్రభుత్వంపై విమర్శలు.. వీటన్నింటిపై బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారాయన.
ఇదీ చదవండి: పోలీస్ బాండ్ బ్రేక్ చేసిన సీజేపీ నేతలు!


