సీజేపీ నేతలకు 5 రోజుల రిమాండ్‌.. మోదీపై దీప్కే ఫైర్‌ | CJP Leaders to Appear Before Magistrate Over Jantar Mantar Protest | Sakshi
Sakshi News home page

సీజేపీ నేతలకు 5 రోజుల రిమాండ్‌.. మోదీపై దీప్కే ఫైర్‌

Oct 14 2026 9:11 AM | Updated on Oct 14 2026 9:20 AM

CJP Leaders to Appear Before Magistrate Over Jantar Mantar Protest

జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు దిగిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతలకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. మరో నేత అజింక్య షిండే మాత్రం వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు నిషేధం ఉండగా.. దానిని ఉల్లంఘించి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వారు నిరసనకు దిగిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు నేతలు పోలీసు బారికేడ్లను దాటి జంతర్‌ మంతర్‌ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ప్రవేశించడం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. గతంలో సమర్పించిన శాంతి బాండ్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలూ ఉన్నాయి.

దాస్‌, రంకా గత శనివారం ఢిల్లీలో నిరసనల సందర్భంగా ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడబోమంటూ పోలీసులకు శాంతి బాండ్‌ సమర్పించారు. తాజాగా జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు దిగడంతో బాండ్‌ నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలు నమోదయ్యాయి. బుధవారం స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ (SEM) ఎదుట హాజరుపరచగా, దాస్‌, రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. షిండే శాంతి బాండ్‌ సమర్పించి విడుదలయ్యారు.

న్యాయవాదులను కలవనివ్వలేదని ఆరోపణలు
సీజేపీ న్యాయ బృందం అధిపతి రత్నా సింగ్‌ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముగ్గురు నేతలను బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రైవేటు వ్యాన్‌లో పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారని, న్యాయవాదులను కలిసేందుకు అనుమతించలేదని ఎక్స్‌లో ఆరోపించారు.

జంతర్‌ మంతర్‌ నిరసనలపై ఆంక్షలు
ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల కోసం రాంలీలా మైదాన్‌, బురారీ గ్రౌండ్‌, సీబీడీ గ్రౌండ్‌లను ప్రత్యామ్నాయ ప్రదేశాలుగా గుర్తిస్తూ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ కుమార్‌ అక్టోబర్‌ 11న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జంతర్‌ మంతర్‌ అధికారిక నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగిపోయింది. ఈ నిర్ణయాన్ని సీజేపీ వ్యతిరేకిస్తోంది. నిరసనలను రాజకీయ కేంద్రానికి దూరంగా తరలిస్తే ప్రజా ఆందోళనలకు లభించే ప్రచారం తగ్గుతుందని ఆ పార్టీ వాదిస్తోంది.

దీప్కే ఫైర్‌
దాస్‌, రంకాలకు కస్టడీ విధించడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పందించారు. జంతర్‌ మంతర్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే వారి తప్పా? అని ప్రశ్నించారు. అసమ్మతి స్వరాలను అణచివేయాలనుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటించాలని ఎక్స్‌లో విమర్శించారు. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సీజేపీ సమావేశం కానుంది.

ఇదీ చదవండి: ఇక ముక్కోణ హోరాహోరీయేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement