ఇక ముక్కోణ హోరాహోరీయేనా! | CJP Party Third Political Force Youth Democracy | Sakshi
Sakshi News home page

ఇక ముక్కోణ హోరాహోరీయేనా!

Oct 14 2026 1:36 AM | Updated on Oct 14 2026 1:36 AM

CJP Party Third Political Force Youth Democracy

అభిప్రాయం

యువతరంతో పాటు పౌరసమాజపు విశ్వాసం సీజేపీ చుట్టూ కేంద్రీకృతమవుతున్నట్లు కనిపిస్తున్నది. అధికార, ప్రతిపక్షాలు కాక సీజేపీ ఒక మూడవ ధ్రువంగా కొనసాగుతుందనే అభిప్రాయం కలుగుతున్నది.

దేశం ఫాసిజంలోకి ప్రవేశించిందా లేక అంతకన్నా ముందటి దశలో ఉందా అనే చర్చ కొద్ది సంవత్సరాల క్రితం జరిగి ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి ముందుకు వస్తున్నది. అయితే ఫాసిజం అన్నది చాలా పెద్ద మాట గనుక మేధావులకు పరిమితం కాగా, సామాన్యుల నోట నియంతృత్వమన్నది ఇప్పుడు విరివిగా  వినవస్తున్నది. జెన్‌–జీ పరిధిని దాటి పౌరులు, జర్నలిస్టులు 1975 నాటి ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ, ప్రస్తుత ప్రభుత్వ చర్యలు కొన్ని అంతకు మించి పోతున్నాయని చెప్తున్నారు. చివరకు సుప్రీంకోర్టు కూడా చిన్న ఈగను పెద్ద సుత్తితో ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా, మానవహక్కుల హరణ తగదని ఐక్యరాజ్యసమితి హితవు చెప్పింది.

అధికారంలో ఉన్నా... అభద్రతాభావం!
ఎవరు ఏ మాటలు ఉపయోగిస్తున్నా ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రస్తుత ప్రభుత్వ చర్యలు దేశ విదేశాలలో ప్రజాస్వామ్యం అన్న మాటను వెక్కిరింతగా మార్చాయంటున్నారు. దేశంలో ఎన్నెన్ని సమస్యలు, ఎన్నెన్ని లోటుపాట్లయినా ఉండవచ్చుగాక. కానీ ఇంతటి మహా వైవిధ్యత గల ఒక బడుగు దేశం స్వాతంత్య్రం సిద్ధించిన రోజు నుంచే అతి పెద్ద ఆధునిక ప్రజాస్వామ్యంగా అవతరించటం, ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒకే వ్యవస్థగా కొనసాగటాన్ని ప్రపంచ మేధావులు ఒక అద్భుతంగా గుర్తించి కొనియాడారు. అందుకే అటువంటి స్థితిలో 1975 నాటి ఎమర్జెన్సీ ఎంతటి దిగ్భ్రాంతిని కలిగించిందో, ప్రస్తుతం గత కొద్ది మాసాల పరిణామాలు అంతే స్థాయిలో తోస్తున్నాయి. స్వతంత్ర భారతదేశపు 80 సంవత్సరాల చరిత్రలో ఇవి రెండూ అసాధారణ అనుభవాలుగా మిగులుతున్నాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్‌ సృష్టించినది కాగా, రెండవది బీజేపీ చేస్తున్న పని.

ఇంతకూ ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం ఇట్లా ఎందుకు వ్యవహరిస్తున్నదనేది ప్రశ్న. 1975లో ఇందిరాగాంధీకి వలె ఇప్పటికిప్పుడు వారి అధికారానికి వచ్చిన ముప్పేమీ లేదు. తదుపరి లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. గత ఎన్నికలలో మెజారిటీ తగ్గినా ఇతరుల మద్దతు ఉండటం, ప్రతిపక్షాల బలహీనతలు కొనసాగటం, వాటితో పాటు అవసరమైతే కొత్తవారిని చేర్చుకోగల సమర్థతలు ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేస్తోందన్నది బోధపడని విషయం. ప్రజలలో అసంతృప్తి పెరుగుతున్నట్లు భావించిన పక్షంలో రాగల మూడేళ్లలో మెరుగైన పాలన ద్వారా వారిని మెప్పించే అవకాశమూ ఉంది. అయినా ఎందుకిది?

మనకు అర్థం కానిదేదో భయం నాయకత్వపు మనస్సులలో తిరిగి భయపెడుతున్నది. ఆ భయం వారితో తొందరపాటు అడుగులు వేయిస్తున్నది. వర్తమానానికి వస్తే, అటువంటి మొదటి పెద్ద తప్పు నీట్‌ పేపర్‌ లీక్‌ విషయంలో జరగగా, రెండవది ఓటర్‌ జాబితాల సవరణకు (సర్‌) సంబంధించి కనిపిస్తున్నది. వీటిలో మొదటిది కొద్దిపాటి చాకచక్యంతో తేలికగా పరిష్కరించగలదే. పరీక్షాపత్రం లీక్‌ కాగానే ఆ పరీక్షను రద్దు చేసి, అభ్యర్థులకు భరోసానిచ్చి, బాధ్యులపై సత్వర చర్యలు తీసుకుని, ఇకపై లీక్స్‌ లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రకటించి ఉంటే తదనంతర సమస్యలు తలెత్తేవి కావు. బహుశా కాక్రోచ్‌లన్నవి ఉనికిలోకి వచ్చేవే కావు.

‘సర్‌’ అన్నది పూర్తిగా భిన్నమైనది. అధికార పక్షం, ఎన్నికల సంఘం ఎన్నెన్నో వివరణలు ఇస్తూ వచ్చినా అవేవీ నిలిచేవి కాదని ఇప్పటికే తేలిపోయింది. నీట్‌ లీకేజీ సంఘర్షణ యువతరానికి, వారి కుటుంబాలకు పరిమితమై సాగగా; ‘సర్‌’ సంఘర్షణ యావత్‌ సమాజంతో మొదలైంది. సీజేపీ పుట్టుకకు ముందే సర్‌ సందేహాలు ప్రతి కుటుంబాన్నీ ఆందోళన పరిచాయి. ఈ రెండు ఉదంతాలు వెంటవెంటనే తలెత్తడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతున్నది.

అయితే నీట్‌ విషయంలో పైన చెప్పుకున్నట్లు ఒక ఎస్కేప్‌ రూట్‌ ఉండగా, ‘సర్‌’ విషయంలో లేకపోవటమన్నది సంకటస్థితి. ఇందుకు సంబంధించి ఇన్నిన్ని అనేక మార్గాలను ఒకే పద్ధతి ప్రకారం అనుసరించిన తర్వాత, వెనుకకు పోవడమంటే తమ పొరపాట్లను తామే అంగీకరించడమవుతుంది. అట్లాగని ఇదే మార్గంతో ముందుకు పోవటం కూడా అసాధ్యంగా మారిపోయింది.

ఎమర్జెన్సీ ఛాయల్లో నేటి పాలన
కాక్రోచ్‌ ఆందోళనలు కానీ, ప్రతిపక్షాల ఆందోళనలు గానీ, ఇతర ఆందోళనలు గానీ పూర్తిగా శాంతియుతంగా జరుగుతున్నా ప్రభుత్వం ఇంత అసహనంగా వ్యవహరిస్తూ దేశవిదేశాలలోని వారికి 1975 ఎమర్జెన్సీని, ఫాసిజాన్ని, నియంతృత్వాన్ని ఎందుకు గుర్తుకు తెస్తున్నదనే ప్రశ్న ఒకటి పలువురిని వేధిస్తున్నది. మొదటిసారి కాక్రోచ్‌ ఒత్తిడిని తట్టుకోలేక విద్యామంత్రి విషయంలో రాజీపడ్డారు. కానీ రెండవసారి ఎట్టి పరిస్థితులలోనూ రాజీపడరాదనే దృఢ నిర్ణయంతో ఉన్నారన్నది ఒక నిర్వచనం.

జ్ఞానేశ్‌ కుమార్‌ కొనసాగుదల తమ అధికార పరిరక్షణకు కీలకం కావటం (ఇది కాక్రోచ్‌ల మాట) అన్నది మరొక నిర్వచనం. మే నెల మధ్యలో ఏర్పడినప్పటి నుంచి ప్రతి విషయంలో, అడుగడుగునా ఎంతో వివేకంగా ఉద్యమాన్ని నిర్వహిస్తూ వస్తున్న సీజేపీ నాయకత్వం ‘సర్‌’కు సంబంధించి కూడా వేసిన వ్యూహాన్ని ఎవరూ గుర్తించినట్లు లేరు. మామూలుగానైతే ఓటుహక్కు పోవటమన్నది పౌరులు, పార్టీలు ఆందోళన చెందే విషయం. కానీ ఆ సమయంలో ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ (పాఠశాలలను బాగు చేయండి) కార్యక్రమంలో ఉండిన సంస్థ నాయకత్వం, యువతరంతో.. మన సమస్యలు లేవనెత్తాలంటే చట్టసభలకు మంచివారిని ఎన్నుకోవాలి.

అట్లా ఎన్నుకోవాలంటే మనకు ఓటు హక్కుంటూ ఉండాలి. కానీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మనకు ఆ హక్కు లేకుండా చేస్తున్నారంటూ లింక్‌ చేయటం యువతరాన్ని ఒక్కసారిగా కదిలించింది. వారితోపాటు, రాజకీయ పార్టీల పట్ల విశ్వాసాన్ని చాలావరకు కోల్పోయిన పౌరసమాజం కూడా సీజేపీ నాయకత్వంతో నిలిచింది. వారికి ఇంత అపూర్వ స్పందనలు రావడం అందువల్లనే.

ఆవిర్భవించనున్న మూడో ధ్రువం
ఇక ముందువైపు దృష్టిసారిస్తే కనిపించేది ఈ విధంగా ఉంది. ఒకవైపు బీజేపీ, రెండవవైపు ‘ఇండియా’ కూటమి, మూడవవైపు కాక్రోచ్‌ పార్టీ. మొదటి రెండూ అధికార రాజకీయం చుట్టూ తిరిగే పార్టీలు. మూడవది, సామాజిక సమస్యలు, యువతరం సంబంధిత విషయాలను కేంద్రంగా చేసుకునే ఉద్యమంగా, ప్రెషర్‌ గ్రూపుగా తనను తాను ప్రకటించుకుంది. ఆ విధంగా ఈ మూడు వేదికలు భవిష్యత్తులో కొనసాగుతాయి.

వీటిలో యువతరంతో పాటు పౌరసమాజపు విశ్వాసం సీజేపీ చుట్టూ కేంద్రీకృతమవుతున్నట్లు కనిపిస్తున్నది. అధికార, ప్రతిపక్షాలు కాక (భవిష్యత్తులో ఏ పార్టీ ఎటు మారినా) సీజేపీ ఒక మూడవ ధ్రువంగా కొనసాగుతుందనే అభిప్రాయం కలుగుతున్నది. ఇటువంటి ధ్రువం ఒకటి స్వతంత్రమైన రీతిలో భారతీయ సమాజానికి లేదు. అది కనుక క్రమంగా రూపుతీసుకున్నట్లయితే అప్పుడు ముక్కోణపు హోరాహోరీని ‘సర్‌’ సందర్భంలోనే గాక భవిష్యత్తులోనూ చూడగలం. అది దేశానికి, సమాజానికి మేలు చేయగలదు.
– టంకశాల అశోక్‌, వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

ఇదీ చదవండి: సంక్షోభాలపై కొత్త చూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement