సంక్షోభాలపై కొత్త చూపు | Economics Nobel Economic Crisis Solutions | Sakshi
Sakshi News home page

సంక్షోభాలపై కొత్త చూపు

Oct 14 2026 1:20 AM | Updated on Oct 14 2026 1:20 AM

Economics Nobel Economic Crisis Solutions

ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిపడే సమస్యల పర్యవసానంగా ఏర్పడే సంక్షోభాలనూ, ఆర్థిక వ్యవస్థలకు ఎదురయ్యే విపత్తులనూ ఎదుర్కొనడానికి మెరుగైన పరిష్కారాలనూ, నమూనాలనూ సూచించిన అమెరికా ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్‌ రాబర్ట్‌ ఈ హాల్, ప్రొఫెసర్‌ మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటించారు.

దేన్నయినా అత్యంత సంక్లిష్టమైనదని చెప్పడానికి రాకెట్‌ సైన్స్‌తో పోలుస్తారు. కానీ సామాజిక శాస్త్రాలూ, మరీ ముఖ్యంగా అర్థశాస్త్రం రాకెట్‌ సైన్స్‌ను మించి క్లిష్టమైనవి. వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు... దేని ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటారు... ఒక సమూహంగా వారు ఎలాంటి పరిశీలనలు చేస్తారు... స్పందిస్తారు అనేది తెలుసుకోవటం చిన్న విషయం కాదు. సమాజాల ఎదుగుదల, వాటి ఆలోచనల తీరుతెన్నులూ, అక్కడుండే అసమానతలూ, వాటిని నియంత్రిస్తున్న వ్యవస్థలూ వ్యక్తుల ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి.

నోబెల్‌ పురస్కారాల ప్రదానం మొదలైన 1901నాటికి కేవలం భౌతిక, రసాయన, వైద్య, సాహిత్య, ప్రపంచ శాంతి రంగాల్లో కృషిచేసినవారికే పరిమితమై ఉండేది. 1968లో ఆర్థిక శాస్త్రాన్ని కూడా చేర్చారు. 1974లో ఆర్థికరంగ నోబెల్‌ సంయుక్తంగా అందుకున్న ఆర్థికరంగ నిపుణులు గున్నార్‌ మిర్డాల్, ఫ్రెడరిక్‌ వాన్‌ హయక్‌లిద్దరూ భిన్న దృక్పథాలకు చెందినవారు. గున్నార్‌ మిర్డాల్‌ ఉదారవాది, హయక్‌ సంప్రదాయవాది. కానీ ఇద్దరూ ఈ పురస్కారాన్ని రద్దు చేయటమే ఉత్తమమని సూచించారు. అందుకు వారు చెప్పిన కారణాలు కొంత వింతగానే ఉన్నాయి.

విజ్ఞాన శాస్త్రాల్లో కృషిచేసే నిపుణుడి పరిధినీ, పరిమితులనూ గుర్తుచేయటానికి నిరంతరం సహ నిపుణులుంటారుగానీ... ఆర్థికవేత్తల ప్రభావం వెనువెంటనే ప్రభుత్వాలతోపాటు సమాజంలోని వ్యక్తులపైనా, వర్గాలపైనా పడుతుందనీ వాన్‌ హయక్‌ వాదన. అనంతరకాలంలో గున్నార్‌ది కూడా ఇదే రకమైన వాదన. ఇద్దరం  పరిశోధనల్లో కలిసి పనిచేయనప్పుడు కేవలం తమ నిష్పాక్షికతను చాటుకోవటానికే నోబెల్‌ కమిటీ వేర్వేరు దృక్పథాలున్న తమను లౌక్యంగా ఎంపిక చేసిందన్నది ఆయన విమర్శ.

ఇప్పుడు నోబెల్‌ పురస్కారం పొందిన రాబర్ట్, వుడ్‌ఫోర్డ్‌లిద్దరూ వేర్వేరుగా చేసిన పరిశీలనలు ఎన్నదగినవి. వీటిని ఇప్పటికే చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, వినియోగం, ఉత్పత్తి మధ్య ఉన్న సంబంధాలను స్థూల దృష్టితో చూడటంకాక సూక్ష్మ స్థాయిలో కుటుంబాలు, వ్యాపారసంస్థలు ఏయే అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయో, ఎలా వ్యవహరిస్తాయో అంచనా వేయటం ఉత్తమమని వారు సూచించారు. అమెరికాను ముంచెత్తిన 2008నాటి ఆర్థిక మాంద్యం రెండో మహా మాంద్యంగా మారకుండా ఈ నిపుణులిద్దరి సూచనలూ... ముఖ్యంగా ఆర్థికవేత్త కీన్స్‌ విధానాన్ని వుడ్‌ఫోర్డ్‌ మరింత అభివృద్ధి చేసిన నమూనా తోడ్పడ్డాయి. అయితే వీరు సూచించిన నమూనాల పాత్ర పరిమితంగానే... అది కూడా సాధారణ సమయాల్లో మాత్రమే ఉంటుందన్న విమర్శ కూడా లేకపోలేదు.

మొన్నీమధ్య మన రిజర్వ్‌ బ్యాంకు రెపో రేటును 0.25 శాతం పెంచి వడ్డీరేటును 5.5 శాతానికి ఖరారు చేసింది. చమురు ధరలు పెరగటంవల్ల ఉత్పత్తి, రవాణా ఖర్చులు పెరిగి వ్యాపారాలపై భారం పడి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ధరలు పెరుగుతాయి. జనంలో ఆందోళన మొదలవుతుంది. వెనువెంటనే రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లను పెంచుతుంది. దాంతో రుణాలు ప్రియమై, జనం వాటి జోలికిపోరు. పైగా ఖర్చు తగ్గించుకుంటారు. వ్యాపారులు కూడా తక్కువ రుణాలతో సరిపెడతారు.

ఈ స్థితి డిమాండును తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తుంది. కానీ వడ్డీరేటు పెంపు మరీ ఎక్కువైతే ఆర్థిక మందగమనానికి... తక్కువైతే ద్రవ్యోల్బణ విజృంభణకూ దారితీయొచ్చు. కుటుంబాల నిర్ణయాలు, వ్యాపారవేత్తల ధరల నిర్ణయాలు, రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్ల నిర్ణయాలు పరస్పరం అనుసంధానించి ఉంటాయని, వీటిని పరిగణనలోకి తీసుకుంటేనే సరైన అంచనా సాధ్యపడుతుందని ఈ నిపుణులిద్దరూ నిరూపించారు. సంక్షోభాలను అధిగమించేందుకు మెరుగైన నమూనాల అన్వేషణ నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియను కొనసాగించటమే రాబర్ట్, వుడ్‌ఫోర్డ్‌ల ప్రత్యేకత.

ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌పై నిరసన సక్సెస్‌.. జ్ఞానేశ్‌ కుమార్‌పై ఎందుకు తడబాటు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement