దగ్గరవుతారు... దూరమవుతారు... Gen-Z ప్రేమ ధోరణి! | Puffer Fishing Gen-Z Relationship Trend | Sakshi
Sakshi News home page

దగ్గరవుతారు... దూరమవుతారు... Gen-Z ప్రేమ ధోరణి!

Nov 28 2026 11:26 AM | Updated on Nov 28 2026 11:26 AM

Puffer Fishing Gen-Z Relationship Trend

వాళ్లే దగ్గరవుతారు. ప్రేమగా మాట్లాడతారు. సమయం గడపాలని కోరుకుంటారు. అంతా బాగానే ఉందనిపిస్తుంది. కానీ బంధం కాస్త బలపడగానే ఒక్కసారిగా మారిపోతారు. మాట్లాడటం తగ్గిస్తారు. దూరం పెడుతుంటారు. అవతలి వ్యక్తి కూడా వెనక్కి తగ్గితే మళ్లీ దగ్గరవుతారు. ఇదేంటి? ప్రేమిస్తున్నారా? దూరం పెడుతున్నారా? అన్న అయోమయంలో, ఆందోళనలో పడేస్తారు. దగ్గరవ్వాలని కోరుకుంటూనే.. వెనక్కి తగ్గే ఈ ప్రవర్తనకే నేటి యువత పెట్టిన పేరు ‘పఫర్‌ ఫిషింగ్‌’. 

ఇద్దరు యువతీ యువకుల మధ్య ఒకరిపై ఒకరికి ఆసక్తి కలగడం, ప్రేమలో పడటం వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ బంధంలో భావోద్వేగాలు, బాధ్యతలు, నమ్మకం, నిబద్ధత పెరగడం మొదలవగానే వెనక్కి తగ్గుతారు. మళ్లీ కొంతకాలం గ్యాప్‌ రాగానే తిరిగి పలకరిస్తారు. ఇలా దగ్గరవడం, దూరమవడం మధ్య ఊగిసలాడే మానసిక ప్రవర్తనే పఫర్‌ ఫిషింగ్‌.

పాతప్రవర్తనే.. కొత్తపేరు!!
ఇంతకుముందు ఇలాంటి బిహేవియర్‌కి ప్రత్యేక పేర్లు లేకపోయినా.. ఇప్పటి డిజిటల్‌ యువతరం ప్రతి ధోరణికీ ఓ పేరు పెడుతోంది. అలా పెట్టిన పేరే పఫర్‌ –ఫిషింగ్‌. గతంలో వినిపించిన ఘోస్టింగ్‌ .. ‘చె΄్పాపెట్టకుండా బంధాన్ని వదిలేయడం’, బ్రెడ్‌క్రంబింగ్‌ .. ‘అప్పుడప్పుడు ప్రేమ సంకేతాలు పంపుతూ ఆశలు కల్పించడం’, సిట్యుయేషషి షిప్‌.. ‘స్పష్టత లేని బంధం’ వంటి పదాల సరసన ఇప్పుడు ఈ పఫర్‌ ఫిషింగ్‌ పదం కూడా చేరింది. అంటే ప్రవర్తన పాతదే.. కానీ పేరే కొత్తది.

దగ్గరగా.. దూరంగా!
ఈ రకమైన స్థితిలో బంధం లోతుగా వెళ్లే కొద్దీ మొదట్లో ఉండే ఉత్సాహం తగ్గిపోతుంది. అవతలి వ్యక్తిని దూరం పెడుతుంటారు. మాటలూ తగ్గిపోతుంటాయి. అయితే కొందరిలో మాత్రం ప్రేమ కావాలనే కోరికతో పాటు, భయం కూడా ఉంటుంది. తోడు కావాలనిపిస్తుంది, కానీ మనసులోని విషయాలను పంచుకోవడం, ఎదుటివారిని నమ్మడం, వారిపై ఎమోషనల్‌గా ఆధారపడటం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే దూరంగా వెళ్లడాన్నే ఉపశమనంగా భావిస్తారు. ఒత్తిడి తగ్గాక మళ్లీ తిరిగి పలకరిస్తారు. అలా కొంతకాలం బాగానే ఉండి, బంధం బలపడగానే మళ్లీ వెనక్కి తగ్గుతారు.

కొత్త పరిచయాల వైపు..
చేతిలో ఫోషి ఉంటే చాలు.. కొత్త పరిచయాలు చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక బంధంలో చిన్న సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరించుకునే బదులు, మరో వ్యక్తిని వెతుక్కునే ధోరణి పెరుగుతోంది. ఒకరితో బంధం కొనసాగించాలా? వద్దా? అన్న సందేహం వచ్చినప్పుడు మరో పరిచయం వైపు మళ్లిపోతున్నారు. దీనివల్ల ఒకరితో ఒకరు నిజాయితీగా మాట్లాడుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడం తగ్గిపోతోంది.

అదే సమయంలో నేటి సంబంధాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, సొంత సమయానికి కూడా ్రపాధాన్యం పెరిగింది. కొంత సమయం కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఎలాంటి వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండటం, ఎదుటివారిని అయోమయంలో పడేయడం మాత్రం ఆరోగ్యకరమైన బంధానికి సంకేతం కాదు.

స్పష్టత ముఖ్యం!
ఆరోగ్యకరమైన బంధంలో ఇద్దరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో ఒకరిపై మరొకరికి నమ్మకం, భరోసా కూడా ఉండాలి. తమకు ఎదుటివారి పట్ల శ్రద్ధ ఉందని మాటల్లోనే కాకుండా ప్రవర్తనలోనూ చూపించాలి. బంధంపై స్పష్టత ఇవ్వాలి. అవసరమైనప్పుడు మాట్లాడుకోవాలి. అప్పుడే వ్యక్తిగత సమయానికి, ప్రేమకు మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది. దగ్గరగా ఉన్నప్పుడు ఇచ్చే మాటలకంటే, దూరంగా ఉన్నప్పుడు చూపించే బాధ్యతే బంధంలోని నిజాయితీని తెలియజేస్తుంది. కానీ ఎప్పుడొస్తారో.. ఎప్పుడు వెళ్లిపోతారో తెలియని అనిశ్చితి మాత్రం బంధాన్ని బలహీనపరుస్తుంది.

పఫర్‌ ఫిష్‌
పఫర్‌ ఫిష్‌ అనేది సముద్రాల్లో, కొన్ని మంచినీటి ్రపాంతాల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన చేప. ఈ చేపకు ఓ ప్రత్యేక లక్షణం ఉంది. ప్రమాదం ఎదురైనప్పుడు తన శరీరాన్ని ఒక్కసారిగా బెలూషి లా మార్చుకుని పరిమాణంలో ఎన్నోరెట్లు పెద్దదిగా మారుతుంది. అప్పుడు దాని శరీరంపై ఉండే ముళ్లు కూడా బయటకు కనిపించి.. శత్రువులకు ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఇలాగే కొందరు వ్యక్తులు ప్రేమలో దగ్గరితనం పెరిగినప్పుడు తమను తాము కాపాడుకోవడానికి దూరం జరుగుతారు. బంధం బలపడుతుంటే వెనక్కి తగ్గి, దూరం ఏర్పడగానే మళ్లీ దగ్గరవుతారు. ఈ పోలికతోనే ‘పఫర్‌ ఫిషింగ్‌’ అనే పదం వాడుకలోకి వచ్చింది.

ఇదీ చదవండి: మగవాళ్ల సెలవులు పెరుగుతున్నాయి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement