సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నియంత పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కొత్త బిల్లు సరిగ్గా లేదని విమర్శించారు. సీట్ల పెంపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ ఓట్లను దొంగిలిస్తున్నారని దేశ ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కులగణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదని విమర్శించారు.
డీలిమిటేషన్ ప్రక్రియలో సామాజిక న్యాయం పాటించడంతో పాటు అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్న పార్టీల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే డీఎంకే, ఎన్సీపీ, బీఆర్ఎస్ పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. ఈ తాజా పరిణామాలతో ఎన్డీఏ బలం ఇప్పటికే 350కి చేరింది.
ఇదీ చదవండి: డీలిమిటేషన్‌కు పెరుగుతున్న మద్దతు


