మూడు కంపెనీలు హ్యాక్
సెక్యూరిటీ టెస్ట్ అంటున్న గూగుల్
అంతకంతకూ ‘తెలివి మీరిపోతున్న’ ఏఐ మోడళ్ల జాబితాలోకి తాజాగా గూగుల్ జెమినీ ఏఐ చేరింది. సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాల పరీక్షలో ఈ ఏఐ మోడల్ ఏకంగా మూడు కంపెనీలను హ్యాక్ చేసినట్లు మాతృసంస్థ గూగుల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ఇలా స్వతంత్రంగా ఇతర కంపెనీలను హ్యాక్ చేసిన ‘ఘనత’ ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ మోడళ్లకు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.
పరీక్షలో భాగం అనుకుని జెమినీ ఆన్‌లైన్‌లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌ను గమనించి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన క్రెడెన్షియల్స్‌ను (యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వంటివి) ఊహించిందని, కాకపోతే ప్రతి సందర్భంలోనూ ఏఐ మోడల్ ఆగిపోయిందని గూగుల్ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. ఆయా కంపెనీలకు ఈ సెక్యూరిటీ ఉల్లంఘన సమాచారం అందించినట్లు తెలిపారు.
సైబర్ సెక్యూరిటీని మదింపు చేసే స్వతంత్ర సంస్థ మే నెలలో నిర్వహించిన పరీక్షలో జెమినీ ఏఐ హ్యాకింగ్ జరిగినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ మొదట ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ విభాగం ఉపాధ్యక్షురాలు హీదర్ అడ్కిన్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘‘హ్యాకింగ్‌కు గురైన మూడు సంస్థలకు సమాచారం అందించాం. పరీక్ష పద్ధతుల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ట్రెయినింగ్ భాగస్వామికి తెలియజేశాం’’ అని తెలిపారు. శక్తిమంతమైన ఏఐ మోడళ్ల శిక్షణ విషయంలో బాధ్యతగా ఎలా వ్యవహరించాలన్నది ఈ ఘటన తెలుపుతుందన్నారు.
ఏఐ మోడళ్లు అభివృద్ధి చెందుతున్న వేగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో గూగుల్ జెమినీ ఏఐ హ్యాకింగ్ వార్తలు వెలువడటం గుర్తించాల్సిన విషయం. మానవాళికి ముప్పు కాగల ఏఐ మోడళ్ల అభివృద్ధిపై నెమ్మదించాలని ఓపెన్‌ఏఐ, స్పేస్‌ఎక్స్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు పిలుపునిచ్చాయి. జూలై నెలలో ఆంత్రోపిక్ ఏఐ మోడల్ క్లాడ్ తనంతటతానే మూడు కంపెనీలను హ్యాక్ చేయడం తెలిసిందే.
ఇందుకు కొంత సమయం ముందే తమ ఏఐ మోడళ్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది. అయితే ఏఐ మోడళ్లు మానవాళికి ముప్పు అంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లాంటి వాళ్లు ఖండించడం, ఎన్‌విడియా సీఈవో జెన్‌సెన్ హువాంగ్ వంటి వారు అతడికి మద్దతుగా మాట్లాడటం గమనిస్తే ఏఐ మోడళ్ల విషయంలో టెక్ ప్రపంచం రెండుగా విడిపోయినట్లు స్పష్టమవుతుంది. జెన్‌సెన్ హువాంగ్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌లు ఇద్దరూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ఏర్పాటు చేసిన వైట్‌హౌస్ డిన్నర్‌లో కలుసుకోనున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


