తెలుసుకుందాం
డేటా సెంటర్ అంటే ఇంటర్నెట్‌కి లైబ్రరీ లాంటిది. మీరు మొబైల్‌లో చూసే యూట్యూబ్ వీడియోలు, ఆన్ లైన్ గేమ్స్, ఇన్ స్టా ఫోటోలు అవన్నీ భద్రంగా దాచే రహస్య ప్రదేశమే డేటా సెంటర్! అంటే వేల సంఖ్యలో సూపర్ కంప్యూటర్లు (సర్వర్లు) ఒకే చోట ఉండే పెద్ద భవనం.
డేటా సెంటర్‌లో నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి: 1. సర్వర్లు 2. స్టోరేజ్ సిస్టమ్స్ 3. నెట్‌వర్క్ 4. కూలింగ్ సిస్టమ్స్. మన భారతదేశంలో ప్రస్తుతం 160కి పైగా పెద్ద డేటా సెంటర్లు పని చేస్తున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోసం ప్రత్యేకంగా ఏఐ డేటా సెంటర్లు వస్తున్నాయి. ఈ ఏఐ కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్ల కంటే వందల రెట్లు వేగంగా ఆలోచిస్తాయి.
అంత వేగంగా పని చేయడం వల్ల విపరీతమైన వేడి పుడుతుంది. ఆ వేడిని తగ్గించడానికి ఏసీలతో పాటు చాలా ఎక్కువ నీరు అవసరం అవుతుంది. కేవలం ఒక్క చిన్న 20 మెగావాట్ల డేటా సెంటర్‌ను చల్లబరచడానికి రోజుకు దాదాపు 14 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది మన నగరాల్లోని 27,000 కుటుంబాల రోజువారీ నీటి అవసరంతో సమానం. ప్రస్తుతం మన దేశంలోని డేటా సెంటర్లు అన్నీ కలిపి ఏడాదికి సుమారు 150 బిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నాయి.
ఈ డేటా సెంటర్లు రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలూ, 365 రోజులూ పని చేస్తూనే ఉండాలి. ఒక్క క్షణం ఆగినా ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం స్తంభించిపోతుంది. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు నీటిని వృథా చేయకుండా, వాడిన నీటినే మళ్లీ శుద్ధి చేసి వాడే సరికొత్త కూలింగ్ టెక్నాలజీలను కనిపెడుతున్నారు. మనం ఫోన్ లో ఒక్క క్లిక్ చేయగానే, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డేటా సెంటర్ల నుంచే సమాచారం క్షణాల్లో మన స్క్రీన్ పైకి వస్తుంది!


