దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.5,786 కోట్ల విలువైన ముసాయిదా అంచనా ఉత్తర్వులను (డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్) జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది.
వివాదం ఏమిటి?
కంపెనీ తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపిన ఆదాయానికి, ఐటీ శాఖ అంచనాలకు మధ్య తేడాలు రావడమే ఈ నోటీసులకు ప్రధాన కారణం. రిటర్నుల్లో వెల్లడించిన ఆదాయానికి కొన్ని అంశాలను కలపడం లేదా కొన్ని మినహాయింపులను నిరాకరించడం ద్వారా ఈ భారీ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
కంపెనీ స్పందన
ఈ నోటీసులపై మారుతి సుజుకీ స్పందిస్తూ.. ఐటీ శాఖ ప్రతిపాదనలను సవాలు చేస్తూ వివాద పరిష్కార ప్యానెల్ ముందు అభ్యంతరాలను దాఖలు చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆర్డర్ వల్ల కంపెనీ ఆర్థిక స్థితిగతులపై లేదా రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది.
ఎగుమతులకు ‘షిప్పింగ్’ సెగ
మరోవైపు, మిడిల్‌ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఎర్ర సముద్రం, హర్మూజ్ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు కలగడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మారుతి సుజుకీతో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, వోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వాహనాల రవాణాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాయి.
సముద్ర మార్గాల్లో దాడుల భయం వల్ల కంటైనర్ లభ్యత తగ్గింది. దీనికి తోడు కంటైనర్‌కు 2,000 డాలర్ల వరకు ఎమర్జెన్సీ షిప్పింగ్ సర్ఛార్జీలు, యుద్ధ-ప్రమాద భీమా ప్రీమియంలు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించడం ప్రమాదకరమని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో నౌకలు దక్షిణాఫ్రికా మీదుగా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇది రవాణా వ్యయాన్ని అమాంతం పెంచుతోంది. మారుతి సుజుకీ మొత్తం ఎగుమతుల్లో మిడిల్‌ఈస్ట్ దేశాల వాటా దాదాపు 12.5 శాతం. తాజా అంతరాయాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


