నాటి ట్రిపుల్ టెస్ట్‌కు సవరణల ప్రతిపాదన
పారిశ్రామిక వివాదాల చట్టం పెండింగ్ కేసులకు మాత్రమే ట్రిపుల్ టెస్ట్
భవిష్యత్తు కేసులకు సవరణల వర్తింపు
ట్రిపుల్ టెస్ట్ ఇప్పటికీ చెల్లుబాటవుతుందని మెజార్టీ తీర్పు
న్యూఢిల్లీ: ‘పరిశ్రమ’అన్న పదానికి 1978 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని 2020 నాటి పారిశ్రామిక సంబంధాల కోడ్‌ను అర్థం చేసుకునేందుకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు తొమ్మిది సభ్యుల విస్తృత ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌సహా ఆరుగురు న్యాయ మూర్తులు ఈ తీర్పు ఇవ్వగా ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. ఈ తీర్పు 6:3 మోజార్టీతో వెలువడినట్లు అయ్యింది.
1978లో ఏడుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పునఃపరిశీలించాలని చేసిన రిఫరెన్స్ చెల్లుబాటైనట్టు తాజా తీర్పులో స్పష్టం చేశారు. 1978 ఫిబ్రవరి 21న బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు సంబంధించిన కేసులో ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ‘పరిశ్రమ’అన్న పదం నిర్వచనాన్ని విస్తరించింది. ఈ తీర్పును రాసిన జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఏది పరిశ్రమ అన్నది తేల్చేందుకు ట్రిపుల్ టెస్ట్ ఒకటి రూపొందించారు. దాని ప్రకారం పరిశ్రమ అంటే...
1. వస్తువులు లేదా సేవల ఉత్పత్తి, పంపిణీ జరగాలి.
2. ఇందుకోసం యజమాని – ఉద్యోగుల మధ్య సహకారం ఉండాలి.
3. కార్యకలాపాలన్నీ వ్యవస్థీకృతమై ఉండాలి.
ఈ తీర్పుతో ఆసుపత్రులు, విద్యాసంస్థలు, క్లబ్‌లు, ప్రభుత్వ సంక్షేమ శాఖల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు 1947 పారిశ్రామిక వివాదాల (ఐడీ) చట్టం పరిధిలోకి వచ్చారు. అయితే తాజాగా తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన మెజార్టీ తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని చెబుతూనే దానికి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఇప్పటికే రద్దయిన 1947 నాటి ఐడీ చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులకు మాత్రమే ట్రిపుల్ టెస్ట్‌ను వర్తిస్తుందని తెలిపారు.
అంతేకాకుండా... ట్రిపుల్ టెస్ట్ మౌలికంగా చెల్లుబాటు అయ్యేదనని, కాకపోతే పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2(జే) వంటి కొన్ని విషయాల్లో స్పష్టత అవసరమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తాజా తీర్పు 2020 నాటి పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో పరిశ్రమకు ఉన్న నిర్వచనాన్ని ఏ రకంగానూ ప్రభావితం చేయదని స్పష్టం చేశారు. ఈ సవరణల తాలూకూ వివరాలను న్యాయమూర్తులు వెల్లడించాల్సి ఉంది.
ఆరుగురు న్యాయమూర్తుల ఓకే...
జస్టిస్ సూర్యకాంత్ తనతోపాటు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలీల తరఫున మెజార్టీ తీర్పును రాశారు. సీజేఐ మెజార్టీ తీర్పుతో జస్టిస్ పీ.ఎస్. నరసింహ, జస్టిస్ జోయ్ మాల్యా బాగీ్చలు దాదాపుగా అంగీకరించినప్పటికీ వేర్వేరు తీర్పులు రాశారు. 1978 తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ చేసిన రిఫరెన్స్ చెల్లుబాటైందని వీరిద్దరు తేల్చారు. జస్టిస్ బీ.వీ. నాగరత్న, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లు మాత్రం మెజారిటీ తీర్పుతో విభేదించారు. తొమ్మిది మంది ధర్మాసనానికి చేసిన రిఫరెన్స్ చెల్లుబాటు అంశంలో వ్యతిరేక తీర్పు ఇచ్చారు.
2020 పారిశ్రామిక సంబంధాల కోడ్‌ను అర్థం చేసుకునేందుకు మాత్రం పరిశ్రమ అన్న పదానికి 1978లో ఇచ్చిన విస్తృత నిర్వచనం వర్తించదని మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది. 1947 నాటి ఐడీ చట్టం రద్దై కొత్త చట్టం అమల్లోకి వచ్చినందున 1978 నాటి తీర్పు అంశం కేవలం సిద్ధాంతపరమైన అభ్యాసంగా మారిందన్న విషయమై తొమ్మిది మంది న్యాయమూర్తులో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ‘‘రిఫరెన్స్ చెల్లుబాటైందని మెజారిటీ తీర్పు తేల్చింది. అయితే ఇది భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుంది,
1947 ఐడీ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న అంశాలు 1978 తీర్పులోని ట్రిపుల్ టెస్ట్ నిర్వచనం ప్రకారం విచారిస్తారు’’అని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. అదే సమయంలో 1978 తీర్పులోని సూత్రాల ఆధారంగా 2020 చట్టాన్ని అర్థం చేసుకోరాదని, దాని అర్థం, వివరణలపై స్వతంత్ర పరిశీలన జరుపుతామని తెలిపారు. 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టం కింద తమకు రక్షణ లభించే అవకాశముండటంతో ఈ కేసు విషయమై కారి్మక, పారిశ్రామిక రంగాల్లో ఆసక్తి నెలకొని ఉంది. తొమ్మిది మంది ధర్మాసనం ముందు పెట్టాల్సిన ప్రధాన అంశాలను సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 16న రూపొందించింది.


