ఢిల్లీ కాలుష్యం: ఆరేళ్ల తర్వాత మళ్లీ అధ్వాన్నం! | Delhi sees most polluted start to October since 2020 | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కాలుష్యం: ఆరేళ్ల తర్వాత మళ్లీ అధ్వాన్నం!

Oct 5 2026 8:08 AM | Updated on Oct 5 2026 8:08 AM

Delhi sees most polluted start to October since 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింతగా క్షీణిస్తోంది. వరుసగా ఐదో రోజు గాలి కాలుష్యం పెరగడంతో అక్టోబర్ ప్రారంభంలోనే 2020 తర్వాత అత్యంత అధ్వాన్నమైన పరిస్థితి నమోదైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ సగటు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 187గా నమోదైంది. ఇది ‘మోస్తరు’ కేటగిరీలో ఉన్నప్పటికీ, గత 82 రోజుల్లో ఇదే అత్యధిక స్థాయి.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం.. శనివారం ఏక్యూఐ 171, శుక్రవారం 174, గురువారం 166గా నమోదైంది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఇది 197కు చేరింది. అనంతరం గాలి వేగం కొంత పెరగడంతో స్వల్పంగా తగ్గింది. ప్రధాన కాలుష్య కారకంగా పీఎం10 గుర్తించారు. రోడ్లపై ధూళి, నిర్మాణ పనులు, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి కారణాలతో పీఎం10 పెరుగుతుంది. ఇటీవల వర్షాలు, అధిక గాలుల కారణంగా కాలుష్య కారకాలు చెదిరిపోవడంతో ఐదు రోజుల పాటు గాలి నాణ్యత ‘సంతృప్తికరంగా’ ఉండగా.. వర్షాలు తగ్గిపోవడం, స్థానికంగా ఉద్గారాలు పెరగడంతో పరిస్థితి మళ్లీ దిగజారింది.

2026 అక్టోబర్ తొలి నాలుగు రోజుల్లో ఢిల్లీ సగటు ఏక్యూఐ 174.5గా నమోదైంది. 2025లో ఇదే కాలానికి 119.75, 2024లో 167.25, 2023లో 155, 2022లో 161.25, 2021లో 107.25, 2020లో 176.25గా నమోదైంది. అంటే 2026లో అక్టోబర్ ప్రారంభం గత ఆరేళ్లలో అత్యంత కాలుష్యంతో కూడిన ప్రారంభాల్లో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్ చివర్లో కురిసిన వర్షాలు కొంతకాలం గాలిలోని కాలుష్య కణాలను తగ్గించాయి. వర్షాలు తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతలు పెరగడం, ఉపరితల గాలులు బలహీనపడటంతో  ధూళి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని నిపుణులు తెలిపారు.

శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా సెప్టెంబర్ మధ్య నుంచి గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభమవుతుంది. పంట వ్యర్థాల దహనం, రవాణా, పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్లు, బయోమాస్ దహనం తదితరాలు శీతాకాలంలో కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఉంటాయి. దీపావళి సమయంలో బాణసంచా కూడా పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, వ్యర్థాల నిర్వహణ, భారీ వాహన రవాణా వంటి రంగాలపై సమగ్ర చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: ఒకే ఏడాదిలో టీఎంసీ నుంచి బీజేపీకి.. ఎవరీ కోయల్ మల్లిక్?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement