దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారింది. గాలిలో పీఎం2.5 కాలుష్య కణాల సాంద్రత 24 గంటల్లోనే రెండింతలకు పైగా పెరిగి, జాతీయ సురక్షిత ప్రమాణం కంటే నాలుగు రెట్లు అధికంగా నమోదైంది. దట్టమైన పొగమంచు, గాలుల వేగం తగ్గడం, పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాల దహనం నుంచి వెలువడుతున్న పొగ కలిసి నగరాన్ని విషవాయువుల ముసుగులోకి నెట్టాయి. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 400 దాటింది.
నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ నగరాల్లోనూ గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. ఉదయం 5.05 గంటల సమయంలో నమోదైన గణాంకాల ప్రకారం.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో అత్యధికంగా ఏక్యూఐ 414గా నమోదైంది. ఘజియాబాద్‌లో 377, నోయిడాలో 369, గురుగ్రామ్‌లో 349గా గాలి నాణ్యత సూచిక నమోదైంది.
ఐఐటీ ఢిల్లీలో అత్యధికంగా 488 ఏక్యూఐ నమోదైంది. ఇక్కడ పీఎం10 ప్రధాన కాలుష్య కారకంగా ఉంది. ఆ తర్వాత చాందినీ చౌక్‌లో 479 (PM10), ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో 478 (PM2.5), పూసాలో 469 (PM2.5), ఎన్‌ఎస్‌యూటీ జాఫర్‌పూర్‌లో 459 (PM2.5) నమోదయ్యాయి.
రాబోయే కొన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని.. ఆ తర్వాత ఆకాశం పాక్షికంగా మేఘావృతమై లేదా ఎక్కువగా నిర్మలంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత క్రమంగా 29 డిగ్రీల నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీల నుంచి 14 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని అంచనా.


