ఢిల్లీ: దేశ రాజధానిలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. ఉదయం బయటకు అడుగుపెడితే చాలు.. స్వచ్ఛమైన గాలికి బదులు కాలుష్య కారకాలే ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో గాలి పీల్చడం రోజుకు 30 సిగరెట్లు తాగడంతో సమానమని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ కోర్టుకు వివరించారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో వాహన కాలుష్యం ఒకటని ధర్మాసనం పేర్కొంది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ కాలుష్యంపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఢిల్లీ రహదారులపై వాహనాలు బంపర్ టు బంపర్ కదులుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ తగినంతగా లేదని, వాహనాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు.
రైతులకూ కీలక సూచనలు
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కాలుష్యం పెరుగుతున్న అంశంపైనా కోర్టు చర్చించింది. నవంబర్ 5న ఢిల్లీ కాలుష్యంలో పంట వ్యర్థాల దహనం వాటా 14 శాతంగా ఉందని కోర్టుకు వెల్లడించారు. రైతులకు ముందుగానే పంట వ్యర్థాల కొనుగోలు ధర ప్రకటించాలని సీజేఐ సూచించారు. వాటి నిర్వహణకు అవసరమైన యంత్రాలను వ్యక్తిగత రైతులకు కాకుండా గ్రామ పంచాయతీలకు అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌పై అసంతృప్తి
ఢిల్లీ సరిహద్దుల్లో టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా చూడాలన్న గత ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని అమికస్ క్యూరీ పేర్కొన్నారు. వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోవడం వల్ల కాలుష్యం పెరుగుతోందని వివరించారు. ఈ విషయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ కూడా అంగీకరించారు.
కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు
వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తున్నారా? తక్షణమే కాలుష్యాన్ని తగ్గించేందుకు నిపుణుల సూచనలతో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అంటూ కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కాలుష్య నిర్వహణకే పరిమితం కాకుండా సమస్యకు మూలమైన కారణాలను పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది పంట వ్యర్థాల దహనం ఘటనలు గణనీయంగా తగ్గాయని, ముఖ్యంగా హర్యానాలో మెరుగైన ఫలితాలు వచ్చాయని కేంద్రం తెలిపింది. రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, ప్రజా రవాణా మెరుగుదలకు చర్యలు చేపడుతున్నామని వివరించింది. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికను కోర్టుకు సమర్పిస్తామని కేంద్రం వెల్లడించింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 400 స్థాయికి చేరుతున్న వేళ.. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ఇదీ చదవండి: బెంగళూరులో దారుణం.. క్యాబ్ డ్రైవర్ కిరాతకం


