రాష్ట్రపతి ఆమోదం లభించింది
సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: 2003లో ఒక ఆపరేషన్ సందర్భంగా ఇద్దరు బందిపోట్లను కాల్చి చంపిన మాజీ పోలీసు అధికారి వివేక్ సింగ్ చౌహాన్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి ఆమోదం లభించిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. చౌహాన్‌కు అవార్డు ప్రదానం చేయాలన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాన్ని కేంద్రం పాటించకపోవడంపై సుప్రీంకోర్టు గత నెలలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించింది.
చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. 2003 జూన్ 24 నాటి ఆపరేషన్‌కు గాను చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ఇవ్వడానికి రాష్ట్రపతి ఆమోదించారని, ఈ అవార్డును త్వరలో గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. చౌహాన్ తరఫున హాజరైన న్యాయవాది మాట్లాడుతూ.. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ధిక్కార చర్యలను ఉపసంహరించుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు.
2003లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఘటిగావ్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న చౌహాన్, ఒక గ్రామంలో బందిపోట్లు ఉన్నారనే నిఘా సమాచారం అందడంతో వారిపై ఆపరేషన్ చేపట్టారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు బందిపోట్లు హతమవ్వగా, చౌహాన్ గాయపడ్డారు. అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఆయనకు పదోన్నతి ఇవ్వాలని, అలాగే రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయాలని పలువురు ప్రముఖులు సిఫార్సులు చేశారు. కేంద్రం అందుకు సముఖత వ్యక్తంచేయలేదు.
దీంతో మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2018లో హైకోర్టు, అవార్డు కోసం చౌహాన్ పేరును కేంద్రానికి పంపాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఆయన పేరును సిఫార్సు చేసింది. కానీ, కేంద్ర హోంశాఖ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలయ్యింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది. చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి అనుమతి లభించడంతో ఈ వివాదానికి ఇక తెరపడినట్లే.


