ఐదారు రాష్ట్రాలకు కొత్తవారిని నియమించడానికి కేంద్రం కసరత్తు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సహా ఐదారు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలోఉంచుకుని విపక్ష పారీ్టలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరింత ‘క్రియాశీలకంగా’వ్యవహరించాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఈ క్రతువుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక గవర్నర్లు అత్యధిక కాలం పదవిలో ఉన్నారు.
ఆనందీబెన్ పటేల్ 2018లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైనప్పటికీ ఆమె లోక్‌భవన్‌లోనే కొనసాగుతున్నారు. మరుసటి సంవత్సరమే ఆమెకు ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2021లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పూర్తి బాధ్యతలు తీసుకున్న ఆమె ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నారు. అయితే, రానున్న అసెంబ్లీ ఎన్నికల కోణంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ మార్పు ఖాయమని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కొత్త గవర్నర్‌గా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించవచ్చనే వాదనలు ఉన్నాయి. కర్ణాటక గవర్నర్‌ను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కర్ణాటక గవర్నర్‌గా 2021 జూలై 11న బాధ్యతలు స్వీకరించిన థావర్‌చంద్ గెహ్లాట్ ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో మరింత క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తించే వారికి అవకాశం కల్పించవచ్చనే చర్చ నడుస్తోంది. సినీనటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉన్న తమిళనాడుకు మళ్లీ ఆర్‌ఎన్ రవి మాదిరిగానే అత్యంత కఠినంగా వ్యవహరించే వ్యక్తినే గవర్నర్‌గా నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


