కులగణన తేల్చేదేమిటి? | Sakshi Editorial On Caste Census | Sakshi
Sakshi News home page

కులగణన తేల్చేదేమిటి?

Aug 18 2026 12:59 AM | Updated on Aug 18 2026 12:59 AM

Sakshi Editorial On Caste Census

జన గణనలో కుల గణన కూడా చేర్చాలన్న డిమాండ్‌ను నిరుడు ఏప్రిల్‌లో కేంద్రం అంగీకరించగా, అందుకు అనుసరించబోయే విధానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పౌరులనుంచి రాబట్టే సమాచారానికి సంబంధించిన 40 ప్రశ్నల్లో కులం కూడా ఒకటిగా ఉండబోతోందని కేంద్రం నోటిఫికేషన్‌ వెల్లడించింది. అయితే దీనివల్ల ఏ మేరకు ప్రయోజం ఉంటుందన్న సందేహం తలెత్తుతుంది. వివిధ కులాల పేర్లు ఇచ్చి దాన్లో దేనికి చెందుతారో తెలపాలని పౌరుల్ని అడిగితే నిర్దిష్టమైన డేటా వెల్లడవుతుంది. అందుకు బదులుగా వారు చెప్పిన కుల వివరాలు నమోదు చేయటం వల్ల ప్రయోజనం ఉంటుందా? 2011లో యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణన అంటూ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసింది. ఎన్నడో 1931లో వలస పాలకుల హయాం తర్వాత దేశంలో కులాలను గణించటం అదే మొదటిసారని అందరూ సంతోషించారు. కానీ ఆ గణనవల్ల ఏ ప్రయోజనమూ కలగలేదు. పౌరులు చెప్పిన వివరాల తర్వాత కులాలు, ఉపకులాలు, అక్షరక్రమంలో తేడాలు తదితరాల ఆధారంగా దాదాపు 46 లక్షల 73 వేల రకాలు నమోదయ్యాయి. కులాలవారీగా వాటిని వర్గీకరించటానికి 2015లో అప్పటి నీతి ఆయోగ్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. తీరా కులాల పేర్లలో ఉన్న అనేక వ్యత్యాసాల కారణంగా అయోమయం ఏర్పడి, ఆ డేటాను అధికారికంగా విడుదల చేయలేదు. 

ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తగలదన్న సందేహం చాలామందిలో ఉంది. ఏ కులానికి చెందుతారన్నది తెలియజేసేలా జాబితా రూపొందించి ప్రశ్నించటంవల్ల సమాధానం సులభమవుతుంది. అర్థవంతమైన డేటా లభిస్తుంది. ఒక రాష్ట్రంలో ఉన్న కులం వేరే రాష్ట్రంలో ఉండదు. అలాగే ఒకచోట బీసీగా పరిగణించే కులం మరోచోట ఎస్సీగానో, ఎస్టీగానో ఉండే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కులాల సేకరణకు అనువైన పద్ధతుల్ని ఎంచుకోవాలి. పార్లమెంటులో ఇందుకు సంబంధించి లోతైన చర్చ జరిగివున్నా, రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి, ఆ యా ప్రాంతాల్లో ఉండే కులాలు, వర్గాల గురించిన జాబితా ఖరారుచేసివున్నా జాతీయ స్థాయిలో ఏ కులాలు ఏ కేటగిరీ కిందకు వస్తాయో, తీసుకురావాలో ఒక అంచనా వచ్చేది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో మన దేశం కులం నిర్వహించే పాత్ర తక్కువేమీ కాదు.

అణగారిన కులాలు స్వాతంత్య్రానంతరం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించటంవంటివి సాధ్యమయ్యాయి. ఆ మేరకు చైతన్యం పెరిగి జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటంలేదన్న అసంతృప్తి ఎక్కువైంది. కులగణన డిమాండ్‌ వెనక ఈ నేపథ్యం ఉంది. దానికి తగిన  డేటా లభించేలా ఈ కుల గణన ఉండొద్దా? ఇప్పుడు పౌరులు అందజేసిన వివరాల ఆధారంగా ఎన్యూమరేటర్లు వర్గీకరించుకుని అయిందనిపిస్తారు. అప్పుడది విశ్వసించదగ్గ డేటా అవుతుందా? తమకు అన్యాయం జరిగిందనీ, తమ కుల జనాభాను తగ్గించి చూపారనీ ఆరోపణలు వెల్లువెత్తే అవకాశం కూడా లేదా?

ఆ సంగతి అటుంచి ఇతర ప్రశ్నలు గమనిస్తే ఇప్పుడు సేకరిస్తున్నది జనాభా లెక్కలా, పౌర నమోదు చిట్టానా అన్న సందేహం రాకమానదు. 2011 నాటి జనగణనలో 29 ప్రశ్నలుంటే అవి ఈసారి 40కి చేరుకున్నాయి. వీటిలో తల్లిదండ్రుల పేర్లు, వివరాలతో పాటు ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ వగైరాలున్నాయి. ఈ వివరాల వెల్లడి వ్యక్తిగత గోప్యతకు మంచిదేనా? ఇప్పటికే వివిధ విభాగాలవద్ద ఈ వివరాలుంటాయి. మళ్లీ అవసరమా? 2020 ఏప్రిల్‌నుంచి మొదలుకావాల్సిన జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) ప్రక్రియకు కూడా ఈ మాదిరి ప్రశ్నలే ఉన్నాయి. అది జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్‌ఆర్‌సీ) కోసమేనని విపక్షాలు ఆరోపించాయి కూడా. అయితే కోవిడ్‌ అవరోధం కారణంగా అది మూలనబడటంతో వివాదం సద్దుమణిగింది. హిమపాతం అధికంగా ఉండే జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జనగణనలో కీలకమైన ఈ రెండో దశ సోమవారం లాంఛనంగా మొదలైంది. అందుకే కేంద్రం పారదర్శకంగా వ్యవహరించి అన్ని అంశాలూ తేటతెల్లం చేయాలి. ఈ రాష్ట్రాల్లో ఎదురయ్యే సమస్యల ఆధారంగా తగిన సవరణలు తెస్తే వేరే రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో మొదలయ్యే జనగణన నాటికి ఒక సమగ్రత ఏర్పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement