చదువు.. ఉపాధి | Career counseling starting from the school level | Sakshi
Sakshi News home page

చదువు.. ఉపాధి

Oct 2 2026 4:44 AM | Updated on Oct 2 2026 4:44 AM

Career counseling starting from the school level

పాఠశాల స్థాయి నుంచే కెరీర్‌ కౌన్సెలింగ్‌ 

ఇంటర్‌ స్థాయిలో నైపుణ్యంపై మెళకువలు 

డిజిటల్‌ అకడమిక్‌ ఫ్రేం వర్క్‌పై కేంద్రం దృష్టి 

సరికొత్త ప్రతిపాదనలు రాష్ట్రాల ముందుకు  

అందరూ కలిసొస్తే ప్రత్యేక కార్యక్రమం

ప్రత్యేక నిధులు ఇవ్వాలంటున్న రాష్ట్రాలు

విద్యార్థి దశలోనే ఉద్యోగంపై అవగాహన కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాల విద్యాశాఖను కోరింది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ)లోనూ ఈ తరహా ప్రతిపాదనలు ఉన్నాయి. మార్పునకు తాము సిద్ధమేనని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల కౌన్సెలింగ్‌కు అవసరమైన అధ్యాపకులపైనే స్పష్టత ఉండాలని తెలంగాణ విద్యాశాఖ చెబుతోంది. ఆర్థికపరమైన చేయూత ఇవ్వడానికి కేంద్రం సహకరిస్తే తమ వైపు అభ్యంతరం ఉండబోదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

కార్మిక, విద్యాశాఖల మధ్య సమన్వయం ..: విద్యార్థులను విద్య, నైపుణ్యాభివృద్ధి నుంచి నేరుగా ఉద్యోగాల వైపు తీసుకెళ్లే దిశగా కార్మిక, విద్యా మంత్రిత్వ శాఖలు కలిసి పలు అంశాలను పరిశీలిస్తున్నాయి. విద్యార్థుల విద్యా వివరాలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలను అనుసంధానించడం, పాఠశా­ల స్థాయిలోనే కెరీర్‌ కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఈ విధానంలో ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడీలను ఈ–శ్రమ్, నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ డేటాబేస్‌లతో అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 

11, 12 తరగతుల్లో విద్యార్థులకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక కౌన్సెలింగ్‌ అందించాలని భావిస్తున్నారు. వృత్తి విద్య, శిక్షణ అవకాశాలను విద్యార్థులకు ముందుగానే పరిచయం చేస్తారు. ప్రస్తుతం పాఠశాలల్లో కెరీర్‌ మార్గదర్శకత్వం ప్రధానంగా ఉన్నతవిద్య వైపే కేంద్రీకృతమవుతోంది. దీన్ని విస్తరించి వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 17–18 ఏళ్ల విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే ఉద్యోగ ప్రపంచానికి సంబంధించిన సమాచారం అందించాలని యోచిస్తోంది.

డిజిటల్‌తో అడుగులు
అపార్‌ వంటివి విద్యార్థులకు డిజిటల్‌ అకడమిక్‌ గుర్తింపుగా పనిచేస్తుండగా, ఈ–శ్రమ్‌ అసంఘటిత రంగ కార్మికుల డేటాబేస్‌ను నిర్వహిస్తోంది. దీని ద్వారా ఉద్యోగ ఖాళీ­లు, కెరీర్‌ మార్గదర్శకత్వం వంటి సేవలు అందుతున్నా­యి. ఈ వ్యవస్థలను అనుసంధానించ­డం ద్వారా విద్యార్థుల విద్య, నైపుణ్యా­లు, శిక్షణ, ఉద్యోగ సమాచారాన్ని ఒకే డిజిటల్‌ వ్యవస్థలోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 11, 12 తరగతుల్లో నైపుణ్య ఆధారిత, ఉద్యోగం ఏది సాధించుకోవాలి, దానికి ఎలాంటి విద్య నేర్చుకోవాలనే కౌన్సెలింగ్‌తోపాటు వృత్తి శిక్షణకు విద్యార్థులను పరిచయం చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

విద్య, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవసరాల మధ్య ప్రస్తుతమున్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభు త్వ పరిశోధనలు సూచిస్తున్నాయి. మార్చి 2026లో నీతి ఆయోగ్‌ విడుదల చేసిన పత్రం కూడా పాఠశాలలు, కళాశాలలు, నైపుణ్య శిక్షణ సంస్థల్లో అందించే అభ్యాసానికి ఉద్యోగ మార్కెట్‌ అవసరాలతో తగిన అనుసంధానం లేదని పేర్కొంది. ఉన్నత విద్యలోని 50 శాతం మంది విద్యార్థులు ప్రాక్టికల్‌ అనుభవం, పరిశ్రమతో అనుసంధానం కొరవడటాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. 

అందువల్ల విద్యార్థులకు ముందుగానే వృత్తి మార్గాలను పరిచయం చేయడం, నైపుణ్య శిక్షణతోపాటు అపార్‌ వంటి వ్యవస్థల ద్వారా వారి విద్యా, నైపుణ్య, పని అనుభవ వివరాలను అనుసంధానించడం ప్రతిపాదనలో కీలక అంశాలుగా ఉన్నాయి. పాఠశాల దశలోనే విద్యార్థులకు వృత్తి రంగాలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్‌లో ఉద్యోగ ఎంపికలకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్లంబింగ్, ఎలక్ట్రికల్‌ పనులు వంటి వృత్తి నైపుణ్యాలను కూడా విద్యార్థులకు పరిచయం చేయాలని యోచిస్తున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లాలా, లేక నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించాలా అనే విషయంపై ముందుగానే అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement