breaking news
Gallantry Chakra awards
-
వివేక్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకం
న్యూఢిల్లీ: 2003లో ఒక ఆపరేషన్ సందర్భంగా ఇద్దరు బందిపోట్లను కాల్చి చంపిన మాజీ పోలీసు అధికారి వివేక్ సింగ్ చౌహాన్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి ఆమోదం లభించిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. చౌహాన్‌కు అవార్డు ప్రదానం చేయాలన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాన్ని కేంద్రం పాటించకపోవడంపై సుప్రీంకోర్టు గత నెలలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం స్పందించింది. చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. 2003 జూన్ 24 నాటి ఆపరేషన్‌కు గాను చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ఇవ్వడానికి రాష్ట్రపతి ఆమోదించారని, ఈ అవార్డును త్వరలో గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. చౌహాన్ తరఫున హాజరైన న్యాయవాది మాట్లాడుతూ.. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ధిక్కార చర్యలను ఉపసంహరించుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు. 2003లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఘటిగావ్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న చౌహాన్, ఒక గ్రామంలో బందిపోట్లు ఉన్నారనే నిఘా సమాచారం అందడంతో వారిపై ఆపరేషన్ చేపట్టారు. ఎన్కౌంటర్లో ఇద్దరు బందిపోట్లు హతమవ్వగా, చౌహాన్ గాయపడ్డారు. అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఆయనకు పదోన్నతి ఇవ్వాలని, అలాగే రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయాలని పలువురు ప్రముఖులు సిఫార్సులు చేశారు. కేంద్రం అందుకు సముఖత వ్యక్తంచేయలేదు. దీంతో మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2018లో హైకోర్టు, అవార్డు కోసం చౌహాన్ పేరును కేంద్రానికి పంపాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఆయన పేరును సిఫార్సు చేసింది. కానీ, కేంద్ర హోంశాఖ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలయ్యింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది. చౌహాన్‌కు రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి అనుమతి లభించడంతో ఈ వివాదానికి ఇక తెరపడినట్లే. -
78 మందికి శౌర్య పురస్కారాలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిలో 78 మందికి శౌర్య పురస్కారాలు ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. వీటిలో 13 మరణానంతర పురస్కారాలు ఉన్నాయి. 9 కీర్తిచక్రలు, 19 శౌర్యచక్రలు, 5 బార్ టు సేనా మెడల్స్(గ్యాలంట్రీ), 36 సేనా మెడల్స్(గ్యాలంట్రీ)తోపాటు మరికొన్ని అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. అశోక చక్ర తర్వాత ప్రదానం చేసే భారతదేశపు రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తిచక్ర. శౌర్యచక్ర అనేది మూడో అత్యున్నత శౌర్య పురస్కారం. కీర్తిచక్ర అవార్డు గ్రహీతలు 21 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ ఫ్రాన్సిస్, 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన మేజర్ జితేంద్ర రాఠీ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ గజేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు జగ్బీర్ సింగ్, బషీర్ అహ్మద్, కానిస్టేబుళ్లు జశ్వంత్ సింగ్, బల్వీందర్ సింగ్, తారిఖ్ హుస్సేన్, ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్‌కు కూడా కీర్తిచక్ర పురస్కారాలను ప్రకటించారు. మేజర్ పరమ్‌వీర్, మేజర్ తరుణ్ వాసుదేవన్, మనోజ్ కేశవ్ కుమార్, మేజర్ గౌరవ్ సింగ్ బ్రిజ్వాల్, మేజర్ విపీన్ కుమార్, నాయబ్ సుబేదార్ శంకర్ రామ్, నాయబ్ సుబేదార్ దబ్బాల్ సింగ్ బిష్త్ తదితరులకు శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు ఆర్ధిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన మేరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 10 రెట్లు పెంచింది. పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కారానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని కోటి రూపాయలు, మహావీరచక్ర, కీర్తిచక్ర పురస్కారాలకు రూ.8 లక్షల ఆర్ధిక సాయాన్ని రూ.80 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రూ.6లక్షల ఆర్ధిక సాయాన్ని రూ.60 లక్షలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: యోధులారా వందనం : సీఎం జగన్ మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు.. -
మయన్మార్ ఆపరేషన్ వీరులకు శౌర్య పతకాలు
ఇద్దరికి కీర్తిచక్ర, 10 మందికి శౌర్య చక్ర న్యూఢిల్లీ: మణిపూర్‌లో దొంగదెబ్బతో సైనికులను బలితీసుకున్న ఉగ్రమూకలను మయన్మార్‌లోకి వెళ్లి మరీ హతమార్చిన 21 పారా రెజిమెంట్‌కు చెందిన 8 మంది సాహస జవాన్లను శౌర్య పతకాలు వరించాయి. మరో ఇద్దరికి కీర్తిచక్ర, 10 మందికి శౌర్య చక్ర పురస్కారాలు లభించాయి. మయన్మార్‌లో నక్కిన ఉగ్రవాదులను హతమార్చిన భారత బృందానికి నేతృత్వం వహించిన 21 పారాచూట్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత నెక్టార్ శాన్‌జెన్‌బామ్‌ను, జమ్మూకశ్మీర్‌లో గత అక్టోబరులో ఉగ్రవాదులతో వీరోచిత పోరులో నేలకొరిగిన సుబేదార్ రాజేశ్‌కుమార్‌ను(మరణానంతరం) కీర్తిచక్ర వరించింది. 21 పారా రెజిమెంట్‌కు చెందిన 10 మందికి శౌర్య చక్ర పురస్కారాలు లభించాయి. వీరితో సహా విధి నిర్వహణలో అసమాన ధైర్యం ప్రదర్శించిన మొత్తం 67 మంది జవాన్లు గ్యాలంటరీ అవార్డుల(శౌర్య పురస్కారాలు)కు ఎంపికయ్యారు. వీరందరి పేర్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆమోదించారు. ఈ ఏడాది భారత్ తీరం వైపు వచ్చిన పాక్ పడవ మునిగిపోవడంలో కీలక పాత్ర పోషించిన కోస్ట్‌గార్డ్ కమాండెంట్, కమాండర్లను కూడా గ్యాలంటరీ అవార్డులు వరించాయి. అయితే, ఆ పడవను పేల్చేయాలని తానే ఆదేశించినట్లు కోస్ట్‌గార్డ్ డీఐజీ బీకే లోషాలీ చెప్పగా, పాక్ సిబ్బందే తమ పడవను కాల్చేశారని ప్రభుత్వం చెప్పడంతో ఈ అంశం వివాదాస్పదం అయింది. కాగా యెమెన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్‌కు తోడ్పడిన ముగ్గురు నేవీ అధికారులూ సాహస పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తంగా 49 మందికి సేనా పతకాలు, ఇద్దరికి నవో సేనా పతకాలు, ముగ్గురికి వాయు సేనా పతకాలు లభించాయి. ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ గండికోట జగన్ మోహన్‌ను వాయు సేనా పతకం(గ్యాలంటరీ) వరించింది. మరో 20 మంది సేవా పతకాలకు ఎంపికయ్యారు. కాగా, యాంటీ నక్సల్ ఆపరేషన్లలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన జార్ఖండ్ పోలీసు అదనపు ఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారి ప్రకాశ్ రంజన్ మిశ్రా మళ్లీ గ్యాలంటరీ అవార్డు(పోలీసు మెడల్)కు ఎంపికయ్యారు. పోలీసు లేదా పారా మిలటరీ బలగాల నుంచి ఏడోసారి సాహస పురస్కారం పొందిన ఏకైక వ్యక్తిగా రంజన్ నిలిచారు.


