breaking news
Law graduate
-
ఏడాది ప్రాక్టీస్‌తోనే జ్యుడీషియల్ సర్వీసు ఎగ్జామ్
న్యూఢిల్లీ: న్యాయ శాస్త్ర పట్టభద్రులకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ప్రవేశస్థాయి న్యాయ సేవా పరీక్ష రాయడానికి వారికి ఇంతకుముందు తప్పనిసరిగా ఉండాల్సిన మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవాన్ని ఒక సంవత్సరానికి తగ్గించింది. ఎంట్రీ లెవెల్ జ్యుడీషియల్ సర్వీసు ఎగ్జామ్ రాయడానికి ఒక ఏడాది పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగితే సరిపోతుందని వెల్లడించింది. అయితే, ఎంపికైన అభ్యర్థులు జ్యుడిషి యల్ అకాడమీలో శిక్షణతోపాటు మరో ఏడాది క్లర్క్‌షిప్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.జి.మసీహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2:1 మెజార్టీ తో శుక్రవారం తీర్పునిచి్చంది. గత సంవత్సరం మే 20న అప్పటి సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కనీసం మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవాన్ని ప్రమాణంగా నిర్దేశిస్తూ, కొత్తగా న్యాయశాస్త్రం పూర్తిచేసిన వారిని ప్రవేశ స్థాయి న్యాయ సేవల పరీక్షకు హాజరు కాకుండా నిషేధించింది. తాజాగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గత ఏడాది నాటి తీర్పును సవరించింది. న్యాయాధికారులు కావాలనుకునే న్యాయ పట్టభద్రులకు తప్పనిసరిగా ఉండాల్సిన మూడేళ్ల న్యాయవాద వృత్తి నిబంధనను సడలించింది. ‘మూడేళ్ల ప్రాక్టీస్ (వృత్తిపరమైన అనుభవం) నిబంధనతో సంబంధం లేకుండా న్యాయశాస్త్ర పట్టభద్రులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులేనని తేల్చిచెప్పింది. సమీక్షకు గురైన 2025 నాటి తీర్పు వెలువడి ఏడాదికి పైగా సమయం గడిచింది కాబట్టి అప్పటి అభ్యర్థులు ఒక సంవత్సరంపాటు ప్రాక్టీస్ పూర్తి చేసినట్లుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. వారు ప్రత్యేక ‘సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్’ను సమరి్పంచాల్సిన అవసరం వారికి ఉండదని పేర్కొంది. శిక్షణలో పనితీరు సంతృప్తికరంగా ఉంటే.. ఎంట్రీ లెవెల్ జ్యుడీషియల్ సర్వీసు ఎగ్జామ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరిన తర్వాత ‘ట్రైనీ జ్యుడీషియల్ ఆఫీసర్లు’గా సంబంధిత రాష్ట్ర న్యాయ అకాడమీలో సంవత్సరం పాటు తప్పనిసరిగా సమగ్ర శిక్షణను పొందాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కాలాన్ని ‘బార్’లో ఒక సంవత్సరం ప్రాక్టీస్‌తో సమానంగా పరిగణించాలని వెల్లడించింది. శిక్షణ పొందుతున్న న్యాయాధికారులకు శిక్షణ కాలంలో సంబంధిత రాష్ట్రంలోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్‌కు చెల్లించే వేతనంలో సగ భాగానికి సమానమైన స్థిర భత్యాన్ని చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా సంబంధిత రాష్ట్ర న్యాయ అకాడమీలో శిక్షణార్థులకు సాధారణంగా కల్పించే సదుపాయాలు, ఇతర ప్రయోజనాలను పొందే అర్హత వారికి ఉంటుందని వివరించింది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మరో ఏడాది పాటు నిర్దిష్ట విధానంతో కూడిన ‘లా క్లర్క్‌షిప్’పూర్తిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కాలాన్ని కూడా ‘బార్’లో ఒక సంవత్సరం ప్రాక్టీస్‌తో సమానంగా పరిగణించాలని వెల్లడించింది. శిక్షణలో వారి పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలోని సాధారణ పదవిలో నియమించాలని, ఆ తర్వాత వారు ఆ పదవికి వర్తించే సాధారణ వేతన శ్రేణిని, ఇతర సేవా ప్రయోజనాలను పొందేందుకు అర్హులవుతారని తీర్పునిచ్చింది. 2027 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత జారీ చేసే నోటిఫికేషన్ల విషయంలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) నియామక పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి సంబంధిత వృత్తిలో కనీసం ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ కలిగి ఉండాలని ధర్మాసనం పేర్కొంది. -
ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది
న్యూఢిల్లీ: గత ఎనిమిది దశాబ్దాల్లో మనదేశం అనేక కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే ఇంకా సాధించాల్సింది చాలా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. భవిష్యత్తు బాధ్యతలను స్వీకరించడానికి యువ న్యాయ పట్టభద్రులు, న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ ప్రస్థానం అది సాధించిన విజయాలతోనే ముగిసిపోదని అన్నారు. ప్రతి విజయంతోపాటు నూతన బాధ్యత, కర్తవ్య భావన కూడా కలుగుతుందని వివరించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, మన ముందున్న ప్రయాణంలో ఇంకా ఎన్నో మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ఉద్ఘాటించారు. యువ న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాట రోజుల నుంచి బార్ అసోసియేషన్ మోస్తున్న బాధ్యత త్వరలోనే వారి భుజాలపై పడుతుందని అన్నారు. ముందు తరాల వారు నిర్మించి, బలోపేతం చేసిన న్యాయ సంస్థలను ఇప్పుడు రక్షించి, ముందుకు తీసుకెళ్లాలని యువ లాయర్లకు సూచించారు. తాము మార్గనిర్దేశం చేస్తామని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి, చట్టంతో లోతైన, శాశ్వతమైన సంబంధం ఉందని గుర్తుచేశారు. ఆ తరంలోని అత్యుత్తమ న్యాయ నిపుణుల దార్శనికత, కృషి ద్వారానే చట్టం నిజమైన ఉద్దేశం కేవలం ఆజ్ఞాపించడం లేదా నియంత్రించడం మాత్రమే కాదని.. న్యాయాన్ని అందించడం, స్వేచ్ఛను పరిరక్షించడం, మానవ గౌరవాన్ని నిలబెట్టడం అని మనం తెలుసుకోవడం ప్రారంభించామని వివరించారు. -
అమ్మానాన్నలపై కేసు పెట్టిన పుత్రరత్నం
లండన్: అవకాశం ఇస్తే అమ్మానాన్న మీద పడి బతికేవాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారనిపిస్తోంది ఇది చదివితే. ఏదో కాలో చెయ్యో సరిగ్గా లేదనుకుంటే సరే. కానీ అన్నీ ఉండీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పొంది కూడా తల్లిదండ్రులపైనే భారంమోపాలని భావిస్తున్నారు నాలుగు పదులు దాటిన ఓ పుత్రరత్నం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన 41 ఏళ్ళ దుబాయ్‌కి చెందిన ఫయాజ్ సిద్దిఖీ అనే వ్యక్తి ఇటీవల తన తల్లిదండ్రులపై ఓ విచిత్రమైన దావా వేశారు. తాను జీవించి ఉన్నంత కాలం తన తల్లిదండ్రులే తనకి ఆర్థిక సాయం చేయాలంటూ సదరు కుమారుడు కోర్టుకెక్కారు. ధనవంతులైన తన తల్లిదండ్రులే తన భారాన్ని జీవిత కాలం మోయాలంటూ కేసుపెట్టారు. అందుకు కారణం తన ఆరోగ్య సమస్యలని చెప్పారు సిద్దిఖీ. తన తల్లిదండ్రుల నుంచి డబ్బు రాకపోతే తన మానవ హక్కులు ఉల్లంఘనకు గురైనట్టేనంటారీయన. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన సిద్దిఖీ, కొన్ని చట్టపరమైన సంస్థల్లో పని కూడా చేశారు. అయితే 2011 నుంచి ఈయన నిరుద్యోగిగా ఉన్నారు. అంతేకాదు తనకి ఫస్ట్‌క్లాస్ రాకపోవడానికి ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీయే కారణమంటూ యూనివర్సిటీపై కూడా మూడేళ్ళ క్రితం దావా వేసేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ టీచింగ్ బాగాలేదని, అది తన కెరీర్‌కి నష్టం చేసిందని సిద్దిఖీ వాదించారు. లండన్‌లోని హైడ్ పార్క్‌లో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే తమ ఫ్లాట్‌లో తమ కొడుకుని 20 ఏళ్ళుగా ఎటువంటి అద్దె లేకుండా ఉచితంగా ఉండనిస్తున్నామని సిద్దిఖీ తల్లిదండ్రులు రక్షందా, జావేద్‌లు చెప్పారు. అంతేకాదు సిద్దిఖీ తల్లిదండ్రులు, తమ కొడుకు బిల్లులు కట్టడమే కాకుండా, ప్రతి వారం కొంత అదనంగా పంపిస్తున్నారు. అయితే కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇప్పుడు తమ కొడుకు సిద్దిఖీకి చేస్తోన్న ఆర్థిక తోడ్పాటులో కోత విధించాలని వారు భావిస్తుండడంతో సదరు కుమారుడు తల్లిదండ్రులపై కేసు పెట్టాడు. తాను తన తల్లిదండ్రుల నుంచి జీవితకాలం ఆర్థిక సాయం పొందేందుకు అర్హుడినని ఆయన వాదిస్తున్నారు. మెయింటెనెన్స్ కోరుతూ సిద్దిఖీ దాఖలు చేసిన పిటిషన్‌ని గత ఏడాది ఫామిలీ కోర్టు తోసిపుచ్చింది. యిప్పుడది ఎగువ కోర్టులో విచారణకు వచ్చింది. -
గట్టున ఉంటే ఈత రాదు
మహిళా విజయం రెండు తెలుగు రాష్ట్రాల్లోకి పెయింట్ తయారీ పరిశ్రమలో ఉన్న ఏకైక మహిళ కవితా రాజేశ్. ‘‘పరిశ్రమల రంగం అంటే ప్రతిరోజూ ఓ సవాలే. లాభాల కోసం చూడాల్సింది మూడేళ్లు శ్రమించిన తర్వాతనే. ఇందులో మనగలిగేది టెక్నాలజీ ఒంటబట్టించుకున్నప్పుడే. కొనసాగగలిగేది క్వాలిటీని నిలుపుకున్నప్పుడే’’ అంటున్నారామె. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన కవిత పూర్వీకులది మెదక్. బి.కామ్ చేశాక, న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. ఆమె చదువుకూ, ఆమె నిర్వహిస్తున్న ‘ఓం సాయి ఆంధ్రా పెయింట్స్’ పరిశ్రమకూ పొంతన కుదిరినట్లు అనిపించదు. తండ్రి స్థాపించిన పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోవడాన్ని చూస్తూ ఊరుకోలేక చెన్నైలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని ఈ రంగంలో అడుగుపెట్టిన కవిత అనుభవాలు... ‘‘మా నాన్న పరిశ్రమ నుంచి పాతయంత్రాలను కొనుగోలు చేసి 2002లో 800 చదరపు అడుగుల చిన్న షెడ్లో రంగుల తయారీ పరిశ్రమను బాలానగర్‌లో ప్రారంభించాను. ఏడు లక్షలకు పైగా ఖర్చయింది. బ్రేక్ ఈవెన్ రావడానికి మూడేళ్లు పట్టింది. దీనిని జస్టేషనల్ పీరియడ్ అంటారు. పారిశ్రామికవేత్తకు కుటుంబం నుంచి మద్దతు ఉండాల్సింది ఈ దశలోనే. అంత పెట్టుబడి పెట్టిన తర్వాత నెలవారీ నిర్వహణ ఖర్చులు భరిస్తూ, అమ్మకాలు ఊపందుకోక గందరగోళంగా ఉంటుంది. చాలా మంది నిరుత్సాహపడి వెనుదిరిగేదిప్పుడే. మంచి ఉద్యోగాన్ని వదులుకుని నాకు మించిన భారాన్ని తలకెత్తుకున్నానేమో అనిపించిన సందర్భాలున్నాయి. పైగా అప్పట్లో నాకు కెమికల్ రంగం గురించి తెలియదు. పరిశ్రమ పెట్టిన తర్వాత కెమికల్స్ గురించి, వాటిని కలపాల్సిన పాళ్లు, మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల గురించి తెలుసుకున్నాను. టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు నా అవగాహనను పెంచుకున్నాను. శాఖాపరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్ వంటి పనులన్నీ స్వయంగా చూసుకున్నాను. మా వారు రమేశ్ మెకానికల్ ఉత్పత్తుల మార్కెటింగ్ నిష్ణాతులు కాబట్టి ఆయన అనుభవం నాకు ఉపకరించింది. మా సేవలే మాకు ప్రచారం! డెకరేటివ్ ఎనామిల్స్తో మొదలు పెట్టిన పరిశ్రమను ఇప్పుడు వినియోగదారులు ఏ రకమైన పెయింట్‌ని అడిగినా సమకూర్చగలిగిన స్థితికి తీసుకొచ్చాను. పెయింట్స్ తయారీలో అగ్రగామి సంస్థలు అనేకం ఉన్నాయి. మాలాంటి చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమల దాటికి తట్టుకుని నిలబడడం పెద్ద చాలెంజ్. పైగా ప్రచారం కోసం పెద్ద సంస్థలు చేసినంత ఖర్చు మేము చేయలేం. దాంతో నేను ఓ మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాను. ఫేస్‌బుక్‌తోపాటు మా కంపెనీ వెబ్సైట్లో అన్ని వివరాలను అందుబాటులో ఉంచాను. నాణ్యమైన సర్వీస్‌తో ఒకరి నుంచి ఒకరికి మౌఖిక ప్రచారం లభిస్తోంది. వ్యక్తి నుంచి వ్యవస్థ దిశగా... అద్దె గదిలో పాత యంత్రాలతో మొదలు పెట్టిన పరిశ్రమను కొత్త యంత్రాలతో, సొంత స్థలంలోకి మార్చగలిగాను. ఇప్పుడు మా దగ్గర గంటకు రెండు వందల లీటర్ల రంగును తయారు చేసే అధునాతన యంత్రాలున్నాయి. నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే... తయారీదారులకు, వినియోగదారులకు మధ్య డీలర్ పాత్ర కీలకమైంది. వినియోగదారు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో తయారీదారులకు అందే శాతాన్ని చూసుకుంటే... తయారీ ఖర్చు, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పోను మిగిలే లాభం చాలా తక్కువ. డీలర్‌కి అందే కమిషనే ఎక్కువ. అందుకే నేను నేరుగా వినియోగదారులను చేరుకోగలిగాను. అలాగే సంస్థను ఒక వ్యక్తి కేంద్రంగా నడిపించే పరిస్థితి నుంచి వ్యవస్థగా మార్చగలిగాను. ఉద్యోగులందరికీ శిక్షణనిచ్చి నిపుణులుగా తయారు చేసుకున్నాను. ఒకరు లేకపోయినా ఆ పనిని మరొకరు నిర్వహించగలుగుతున్నారు.ఇలాంటి మెళకువలన్నీ దిగి ఈదినప్పుడే తెలుస్తాయి. గట్టున ఉండి ఎంతగా అధ్యయనం చేసినా పట్టుబడవు. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: శివ మల్లాల


