బీజేపీపైనే మా పోరాటం | Akhilesh Yadav on Saturday said his party would not break alliances | Sakshi
Sakshi News home page

బీజేపీపైనే మా పోరాటం

Aug 23 2026 6:19 AM | Updated on Aug 23 2026 6:19 AM

Akhilesh Yadav on Saturday said his party would not break alliances

 పొత్తులకు కట్టుబడి ఉంటాం

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ వెల్లడి

లక్నో: ఇతర పార్టీలతో చేసుకున్న పొత్తులకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. బీజేపీ విధానాలకు తాము వ్యతిరేకమని, ఆ పార్టీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. బడా వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను అధికార బీజేపీ అనుసరిస్తోందంటూ ఆయన దుయ్యబట్టారు. అఖిలేశ్‌ శనివారం పట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

 ‘సమాజ్‌వాదీ పార్టీ కూటములకు ఎన్నడూ నష్టం కలిగించలేదు. ఇతరులతో కలిసి నడవాలని మేం నిర్ణయించుకుంటే, అందుకు కట్టుబడే ఉంటాం. వెనుకడుగు వేయం. ఎప్పడూ ఇచ్చిన మాటను గౌరవిస్తాం’అని ఆయన చెప్పారు. ‘వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీ(పీడీఏ)లకు సామాజిక న్యాయం అందిస్తాం. ఇదే లక్ష్యానికి కట్టుబడి ఉంటే ప్రభుత్యాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం’అని అఖిలేశ్‌ వివరించారు.

 ‘మా పీడీఏ అజెండాను చూసి అధికార పక్షం భయపడుతోంది. దీనిపై తప్పుడు ప్రచారానికి పూనుకుంది. ఈ మూడు వర్గాల ప్రజలను ఎంతగా ఇబ్బందులకు గురిచేస్తే, అంతగా రాటుదేలుతారు’అని వ్యాఖ్యానించారు. పీడీఏ అజెండాను రంగులు మార్చే ఊసరవెల్లిగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అభివర్ణించిన నేపథ్యంలో అఖిలేశ్‌ ఈ విషయం ప్రకటించారు. ‘పెట్రోల్, డీజిల్‌ మొదలుకొని ఏది కొనాలన్నా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.

 పండుగల సీజన్‌ సమీపిస్తోంది. ధరలు భగ్గుమంటున్నారు. చక్కెర ధర అంతగా ఎందుకు పెరుగుతోందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి’అని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలుపుతూ లాభపడుతున్న బీజేపీ నేతలు, ఇప్పుడు చక్కెర ధరను భారీగా పెంచి మరింత లాభపడుతున్నారంటూ అఖిలేశ్‌ విమర్శించారు. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళుతోందన్నదే అసలైన ప్రశ్న అని చెప్పుకొచ్చారు. 

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అణగారిన వర్గాలకు చెందిన పిల్లలే అత్యధికంగా చదువుకుంటున్నారని, ఈ స్కూళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. జర్నలిస్టులపై బీజేపీ ప్రభుత్వం ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, నిజం చెప్పిన వారిపై దాడులు జరుగుతున్నాయని అఖిలేశ్‌ ఆరోపించారు. ఎస్‌పీ ఎంపీల్లో పలు కుటుంబాలకు చెందిన వారు ఉండటంపై అఖిలేశ్‌...కుటుంబ రాజకీయాలతో కూడా ఒక్కోసారి లాభమేనంటూ నవ్వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement