కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో పాల్గొన్న డింపుల్ యాదవ్
సీజేపీ ర్యాలీని అడ్డుకోవడాన్ని ఖండించిన విపక్ష నేతలు
పార్లమెంటులో పోరాడతామని ప్రకటన
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం చేపట్టిన చలో సంసద్ ర్యాలీలో పాల్గొన్న యువత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతిపక్ష నాయకులు తప్పుబట్టారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై భాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు. విద్యార్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. పార్లమెంట్ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగడతామని పేర్కొన్నారు.
విద్యార్థులకు న్యాయం జరగాలి: అఖిలేశ్
బీజేపీ ఒక ప్రభుత్వంలా కాకుండా అహంకారంతో వ్యవహరిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నీట్‌లో అంత పెద్ద కుంభకోణం జరిగింది కాబట్టే, ప్రజలు ఇప్పటికీ దాని గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అన్నారు. నీట్ (NEET) విద్యార్థులకు న్యాయం జరగాలన్నారు. చలో సంసద్ ర్యాలీలో పాల్గొన్న వారిపై భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జీలు, అఘాయిత్యాలకు బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అఖిలేశ్ యాదవ్ సతీమణి, ఎంపీ డింపుల్ యాదవ్.. తమ పార్టీ నేతలతో కలిసి స్వయంగా సీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు.
వారిని ఎందుకు కొడుతున్నారు? : ప్రియాంక గాంధీ
విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించడానికి మోదీ సర్కారు ఇష్టపడడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. చర్చలు జరపకుండా విద్యార్థులపై అణచివేతకు పాల్పడుతోందని బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. "మేమంతా చర్చ జరగాలని కోరుతున్నాం. విద్యా విధానంలో సమస్యలు, ప్రధానమైన లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ, మీరు దీనిపై చర్చించడానికి ఇష్టపడటం లేదు; దానికి బదులుగా, విద్యార్థులపై బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు.. వారిని కొడుతున్నారు. దేనికోసం? వారు మన పిల్లలే కదా అని ప్రియాంక వ్యాఖ్యానించారు.
యువత వేదన పడుతోంది: చంద్రశేఖర్ ఆజాద్
నీట్ విద్యార్థులకు న్యాయం చేసే విషయంపై తాము పార్లమెంటులో పోరాడతామని ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. సీజేపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వం తన 'ధర్మాన్ని' పాటిస్తోంది, పోలీసులు తమ 'ధర్మాన్ని' పాటిస్తున్నారు. ఈ నేల పట్ల నా బాధ్యతను నిర్వర్తించే పోరాటంలో నేను ఒక భాగంగా ఉన్నాను. ఈ దేశ యువకుడిగా, యువత పడుతున్న వేదన నాకు అర్థమవుతుంది. వారి గొంతుకగా నిలవడానికి, వారికి అండగా ఉండటానికి నేను ఇక్కడ ఉన్నాను. వారికి అన్యాయం జరుగుతోంది, ప్రభుత్వం దీనిని జరగనిస్తోందని వ్యాఖ్యానించారు.
చదవండి: నిరాహార దీక్ష విరమించిన అభిజిత్ దీప్కే
అహంకారం వద్దు: కేజ్రీవాల్
మోదీ సర్కారు అహంకారాన్ని విడిచిపెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ''న్యాయం కోరుతూ వీధుల్లోకి వచ్చిన వీరు మన సొంత పిల్లలు. మీ అహంకారాన్ని పక్కనపెట్టి వారి మాట వినండి. దేశ యువత లక్షలాదిగా జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు. వారి మాట వినకుండా ప్రభుత్వం లాఠీచార్జికి పాల్పడుతోంది. ఇది సరికాద''ని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
పిరికిపంద చర్య.. ఇదే మొదటిసారి: మహువా మొయిత్రా
ఎన్డీఏ సర్కారు తీరుతో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. సీజేపీ పోరాటంపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఆమె విమర్శించారు. "ఇటువంటి తెల్లవారుజాము దాడులు సాధారణంగా శత్రు దేశాలపై జరుగుతుంటాయి. ప్రజాస్వామ్యంలో, అత్యంత దారుణమైన ఒక అంశంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ సొంత పౌరులపై ప్రభుత్వం ఇలా తెల్లవారుజామున రహస్యంగా, పిరికిపంద చర్యకు పాల్పడటం ఇదే మొదటిసారి. గత 10 ఏళ్లలో 152 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి, అంటే సగటున నెలకు ఒకటి చొప్పున లీక్ అయ్యాయన్నమాట. దీనివల్ల 7-8 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు ప్రభావితమైంద''ని అన్నారు.


