న్యూఢిల్లీ: కాక్రోచ్ పార్టీ బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నడ్డాకు సీజేపీ విజ్ఞాపన పత్రాన్ని అందించింది. జేపీ నడ్డాను కలిసిన వారిలో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఉన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, లేదంటే తమ నిరసన కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ తేల్చి చెప్పినట్లు తెలిసింది.
ఢిల్లీలో 'చలో సంసద్' ర్యాలీ జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ప్రతినిధులతో భేటీ కావడం గమనార్హం. తమ డిమాండ్ల జాబితాను లిఖితపూర్వకంగా అందించామని, స్పందించే ముందు బీజేపీ నాయకత్వంతో చర్చించేందుకు సమయం కోరారని సీజేపీ నేతలు చెప్పారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తర్వాత ప్రభుత్వం, ఆందోళనకారుల మధ్య జరిగిన తొలి అధికారిక చర్చ ఇదే.
ఈ భేటీ జరుగుతున్న సమయంలో వేలాది మంది సీజేపీ మద్దతుదారులు పరీక్షల సంస్కరణలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ పార్లమెంట్ వైపు ర్యాలీ చేపట్టారు. ఢిల్లీలో భారీ పోలీసు బందోబస్తు, బ్యారికేడ్లు, లాఠీచార్జ్, అరెస్టులు, ట్రాఫిక్ అంతరాయాలు చోటుచేసుకున్నాయి.
సౌరవ్ దాస్ ఏమన్నారు?
"కాక్‌రోచ్ జనతా పార్టీ తరఫున నేను, ఆశుతోష్ రంకా జేపీ నడ్డాను కలిసేందుకు వెళ్తున్నాం. ఈ ఉదయం చర్చల కోసం ప్రభుత్వం సంప్రదించింది. మా డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. భారీ సంఖ్యలో యువత ఒక్కటయ్యారు" అని దాస్ ఎక్స్‌లో సోమవారం చర్చలు జరగకముందు పేర్కొన్నారు.
భేటీ తర్వాత దాస్ స్పందిస్తూ.. కేంద్ర మంత్రిని కలిసే ముందు ఇద్దరమూ 2 గంటలకు పైగా వేచి చూశామని, చివరకు దాదాపు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం లభించిందని చెప్పారు.

డిమాండ్లు ఇవే
సీజేపీ డిమాండ్లను వివరించే లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశామని దాస్ చెప్పారు. "మా డిమాండ్లతో లిఖితపూర్వక లేఖను అందించాం. ఈలోపు అంతర్గతంగా మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియ కొనసాగుతోంది" అని దాస్ తెలిపారు.
తర్వాత రంకా మాట్లాడుతూ.. చర్చలు కొనసాగుతుండడంతో తాను, దాస్ ఇంకా నడ్డా నివాసంలోనే ఉన్నామని చెప్పారు. పార్టీ ప్రధాన డిమాండ్లపై బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరపాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి మరింత సమయం కోరారని రంకా చెప్పారు. ఆ డిమాండ్లలో ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న అందరు నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వడం ఉన్నాయి.


