ఖుంటి: ఝార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. భగవాన్ జగన్నాథుడి రథయాత్రలో ఉపయోగించిన రథాన్ని టోర్పాలోని మౌసీ బారీ వద్ద నిలిపి ఉంచగా, అది 11,000 వోల్టుల విద్యుత్ తీగను తాకడంతో ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
టోర్పా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 10 మంది బాలురు రథంతో ఆడుకుంటుండగా, వారిలో కొందరు రథంపైకి ఎక్కారు. "రథం 11,000 వోల్టుల విద్యుత్ తీగను తాకడంతో ఏడుగురు బాలురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సదర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి టోర్పా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది" అని ఓ పోలీసు అధికారి చెప్పారు.
ఖుంటి సదర్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ కిశోర్ ఒరావోన్ మాట్లాడుతూ.. దాదాపు 15 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురిని ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. "వారిలో ఇద్దరిని మృతులుగా తీసుకొచ్చారు. మరో బాలుడికి చికిత్స కొనసాగుతోంది" అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఉన్న రథాన్ని టోర్పాలోని మౌసీ బారీ వద్ద నిలిపి ఉంచారని మరో పోలీసు అధికారి తెలిపారు.


