పొలిటికల్‌ హైడ్రామా.. హోటల్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్‌డౌన్! | Jharkhand Rajya Sabha Elections, NDA Shifts MLAs To Hotel Amid Cross Voting Fears As INDIA Bloc Ramps Up Strategy | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ హైడ్రామా.. హోటల్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్‌డౌన్!

Jun 17 2026 7:24 AM | Updated on Jun 17 2026 10:20 AM

Rajya Sabha polls Jharkhand NDA MLAs camp At hotel in Ranchi

రాంచీ: జార్ఖండ్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేపు (జూన్ 18న) జరగనున్న ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తమ ఎమ్మెల్యేలను రాంచీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు తరలించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రాస్‌ ఓటింగ్‌, ఫిరాయింపుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

జార్ఖండ్ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు రేపు ఎన్నిక జరగనుంది. అధికార ఇండియా కూటమి తరఫున జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత బైజ్‌నాథ్ రామ్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా బరిలో ఉండగా.. ఎన్డీయే మద్దతుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో రెండో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారింది. ఓటింగ్ ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరిగినప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించే అవకాశం ఉందనే అనుమానాలు ఇరు కూటముల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే తమ ఎమ్మెల్యేలందరినీ ఒకేచోట ఉంచి, ఎన్నిక పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని నిర్ణయించింది.

ఇండియా కూటమి అలర్ట్‌.. 
సమాచారం మేరకు.. బీజేపీ, ఏజేఎస్‌యూ (AJSU), లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తదితర ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు రాంచీలోని విలాసవంతమైన హోటల్‌లో బస చేస్తున్నారు. అక్కడే సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ, బ్యాలెట్ నిర్వహణ, పార్టీ విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సిన విధానంపై ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార ఇండియా కూటమి కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) తదితర పార్టీల ఎమ్మెల్యేలను ఒకే వేదికపై ఉంచి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఓటింగ్ విధానంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం.

సంఖ్యా బలమే..
ఈ ఎన్నికలో పరిమల్ నత్వానీ అభ్యర్థిత్వం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయనకు అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోనూ మంచి పరిచయాలు ఉండటంతో ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. దీంతో ఏ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూసుకోవడానికి కూటములు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను రిసార్ట్‌లు, హోటళ్లకు తరలించడం దేశ రాజకీయాల్లో కొత్త విషయం కాకపోయినా, జార్ఖండ్‌లో ఈసారి జరుగుతున్న పరిణామాలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార ఇండియా కూటమి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 18న జరిగే ఓటింగ్‌తో ఈ రాజకీయ హైడ్రామాకు తెరపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement