స్కూల్‌కు వెళ్తుండగా నడిరోడ్డులో విద్యార్థినిపై బుల్లెట్ల వర్షం.. మృతి | A girl going to school was chased on a bike then shot at from the front | Sakshi
Sakshi News home page

స్కూల్‌కు వెళ్తుండగా నడిరోడ్డులో విద్యార్థినిపై బుల్లెట్ల వర్షం.. మృతి

Jul 20 2026 7:19 PM | Updated on Jul 20 2026 7:50 PM

A girl going to school was chased on a bike then shot at from the front

పోలీసులతో గొడవపడుతున్న గ్రామస్థులు

పట్నా: బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన దారుణ ఘటన ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలకు వెళ్తున్న 15 ఏళ్ల విద్యార్థినిని రోడ్డుపైనే కాల్చి చంపాడు ఓ యువకుడు. సైకిల్‌పై ఆ అమ్మాయి కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను చంపాక నిందితుడు బైక్‌పై పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బైక్‌పై వెంబడించి.. వరుసగా కాల్పులు
మృతురాలిని పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సోనం కుమారిగా గుర్తించారు. సమాచారం ప్రకారం, సోనం ఎప్పటిలాగే ఉదయం సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరింది. ఆమె మంగళ్ స్థాన్ సమీపానికి చేరుకున్న సమయంలో పల్సర్ బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వెంబడించడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కేజియా వార్డు-13 సమీపంలో నిందితుడు ఆమె సైకిల్‌ను ఓవర్‌టేక్ చేసి ఎదురుగా వచ్చాడు. వెంటనే తుపాకీ తీసి వరుసగా కాల్పులు జరిపాడు. సోనంకు 4 బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఘటన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న వైని పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొద్దిసేపు పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.  

సదర్ డీఎస్‌పీ-1 సంజయ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం లభించిందని చెప్పారు. ఆ సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేస్తున్నామని, నిందితుడిని త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement