సాక్షి,ఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ వివాదాంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాల చోరీ వివాదం కేవలం సాధారణ నేరపూరిత ఘటనగా మాత్రమే చూడాలని, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాలు రాజకీయాలకు వేదికలు కావని పిటిషనర్లకు హితవు పలికింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది.
అయోధ్య రామ మందిరానికి సంబంధించిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత ఆడిట్ చేయించాలని పిటిషనర్లు కోరారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సీబీఐ చేత స్వతంత్ర విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
పిటిషనర్ల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు దర్యాప్తుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మరింత పారదర్శకంగా విచారించేందుకు వీలుగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందాన్ని పునర్‌వ్యవస్థీకరించాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన పురోగతి, నిందితుల అరెస్టులు, రికవరీలపై సమగ్రమైన స్టేటస్ కో రిపోర్టు సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది.
యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి దాదాపు రూ.80 లక్షల నగదును రికవరీ చేసినట్లు సమాచారం. కాగా, ఈ వివాదంలో ప్రముఖ సాధువుల సంస్థ నిర్మోహి అఖారా కూడా అదనపు పిటిషన్ దాఖలు చేసింది. సిట్ పునర్‌వ్యవస్థీకరణ, స్టేటస్ రిపోర్టు సమర్పణకు సమయం ఇస్తూ, సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది.


