వారిలో సంయమనం, కరుణ కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోంది
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆందోళన
బల ప్రయోగానికి తావులేకుండానే విధులు నిర్వహించవచ్చని వెల్లడి
న్యూఢిల్లీ: పోలీసు అధికారుల నుంచి సామాన్య ప్రజలు ఆశించే సంయమనం, కరుణ కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసు సిబ్బంది నిరసనకారులపై దాడి చేశారన్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో మాజీ భద్రతా కార్యదర్శి యశోవర్దన్ ఆజాద్ రచించిన ‘పోలీసింగ్ ది రిపబ్లిక్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ భూయాన్ మాట్లాడారు. ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్)కు చెందిన యువ అధికారులు స్వయంగా నిరసనకారులపై దాడి చేయడం చూసినప్పుడు మనమంతా కలత చెందుతామని అన్నారు.
ఇది చూడటానికి చాలా బాధాకరమైన విషయమని చెప్పారు. ప్రజల పట్ల పోలీసులు సంయమనం పాటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అధిక బలప్రయోగం, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండానే సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చని స్పష్టంచేశారు. వీధిలో విజిల్, లాఠీతో కనిపించే పోలీసు అధికారిని ప్రభుత్వ అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించే వ్యక్తిగా చాలామంది సామాన్యులు భావిస్తుంటారని పేర్కొన్నారు. తమకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు వారు పోలీసుల సహాయం కోరుతారని చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ తమ విశ్వసనీయతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని ఉద్ఘాటించారు.
అధికారులే చట్టాన్ని ఉల్లంఘించేవారిగా మారితే..
దేశంలో కస్టోడియల్ హింస, మరణాల కేసులు పెరుగుతుండటంపై జస్టిస్ భూయాన్ స్పందించారు. ఇలాంటివి నాగరిక సమాజంలో అత్యంత దారుణమైన నేరాలుగా అభివరి్ణంచారు. చట్టబద్ధమైన పాలన సాగే సమాజంలో కస్టడీ మరణం అనేది అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటి అని స్పష్టంచేశారు. విచారణ, ప్రశ్నించడం లేదా మరే ఇతర సందర్భంలోనైనా జరిగే హింస, క్రూరమైన, అమానుషమైన, అవమానకరమైన ప్రవర్తన ఏదైనా ఆర్టీకల్ 29 పరిధిలోకి వస్తుందని వివరించారు.
ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించేవారిగా మారినప్పుడు అది చట్టరాహిత్యాన్ని ప్రోత్సహించవచ్చని నొక్కిచెప్పారు. ఏ నాగరిక దేశమూ దీనిని అనుమతించదని ఉద్ఘాటించారు. ఒక పోలీసు అధికారి అరెస్టు చేసినంత మాత్రాన పౌరుడు తన ప్రాథమిక హక్కులను కోల్పోతాడా? అని ప్రశ్నించారు. అలాగే అరెస్టు సమయంలో జీవించే హక్కును తాత్కాలికంగా నిలిపివేయవచ్చా? అనే ఒక మౌలిక ప్రశ్నను న్యాయస్థానం లేవనెత్తిందని పేర్కొన్నారు. దీనికి సమాధానం కచ్చితంగా ‘కాదు’ అనేదే కావాలని తేలి్చచెప్పారు.
అరెస్టు, విచారణకు సంబంధించి డి.కె.బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో ఇచ్చిన తీర్పులో అనేక నిర్దేశాలను నిర్దేశించిందని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరాన్ని కూడా న్యాయస్థానం గుర్తించిందని జస్టిస్ భూయాన్ వివరించారు. న్యాయపరమైన ప్రక్రియకు వెలుపల జరిగే హత్యలు లేదా నకిలీ ఎన్‌కౌంటర్లను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని తెలియజేశారు. ఎన్‌కౌంటర్ అనేది నేరపూరిత విధానమని, అది పోలీసింగ్‌లో భాగం కాకూడదని అభిప్రాయపడ్డారు. పోలీసు సంస్కరణల ఆవశ్యకతను ప్రస్తావించారు. అలాగే పోలీసుల పనితీరులో రాజకీయ జోక్యం వల్ల కలిగే ప్రమాదాల గురించి మాట్లాడారు.


