బావ హత్యకు బావమరిదే సూత్రధారి | Police Solve Murder Case in Guntur District | Sakshi
Sakshi News home page

బావ హత్యకు బావమరిదే సూత్రధారి

Sep 4 2026 12:56 PM | Updated on Sep 4 2026 1:00 PM

Police Solve Murder Case in Guntur District

గుంటూరు: కిడ్నాప్‌నకు గురైన పాలిష్‌ వ్యాపారి హత్య కేసులో బావమరిదే ప్రధాన సూత్రధారి అని తేలింది. కేసును తెనాలి రూరల్‌ పోలీసులు ఛేదించారు. బావ హత్యకు సుపారి ఇచ్చిన బావమరిదిని, కిరాయి ముఠాను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... తెనాలికి చెందిన చుక్క కోటినాగవీరయ్య (53) అలియాస్‌ నాగ మహేష్‌ పాలిష్‌ వ్యాపారం చేసేవాడు. అతనికి 2006లో విజయవాడ వాసి సంధ్యారాణితో పెళ్లై, ఇద్దరు పిల్లలు. అతనికి 35 ఏళ్ల అట్టలూరి దీప్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రెండేళ్లుగా సరిగా ఇంటికెళ్లడం లేదు. 

తెనాలి నందులపేటలో దీప్తితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు.  గత నెల 29న అతను సాయంత్రం ఇంటి నుంచి వెళ్లగా, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో దీప్తి వెతుకుంటూ 30న ఆటోనగర్‌ వెళ్తుండగా సోమసుందరపాలెం శివారులో స్కూటీ, చెప్పులు కనిపించాయి. దీనిపై తెనాలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అతడిని కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలించారు. 

విచారణలో విజయవాడ రాజీవ్‌నగర్‌లో ఉంటున్న నాగమహేష్‌ బావమరిది పగడాల రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బావ హత్యకు బావమరిది కీలక సూత్రధారి అని గుర్తించామని చెప్పారు. బుధవారం రాత్రి రాజేష్‌ను, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరుకి చెందిన కొమరబత్తిని సందీప్, బుస్సా సంజయ్, కొప్పుల అపర్ణ అలియాస్‌ బుజ్జి, దేవరకొండ మారుతీవరప్రసాద్‌ అలియాస్‌ మారుతీని అరెస్ట్‌ చేశామన్నారు. 
 
ఇసుక క్వారీ వద్ద మృతదేహం   
నాగమహేష్‌ దీప్తితో సహజీవనం చేస్తూ, ఆస్తి మొత్తం ఆమెకు రాసిస్తాడని రాజేష్‌ కక్ష పెంచుకున్నాడు. ఆస్తిని తన సోదరి, ఆమె పిల్లల పేరిట రాయకపోవడంతో బావ హత్యకు పథకం రూపొందించాడు. సందీప్‌కు రూ.4 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సందీప్‌ తన అనుచరులతో తెనాలిలోని ఓ హోటల్‌లో పది రోజులు బస చేసి, నాగమహేష్‌ కదలికలపై రెక్కీ నిర్వహించాడు. గత నెల 29న సోమసుందరపాలెం వద్ద బైక్‌పై వెళ్తున్న అతన్ని గుంటూరు నుంచి అద్దెకు తెచ్చిన కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు.

 తేలప్రోలు, అత్తోట, తుములూరు మీదుగా కరకట్టపై రేపల్లె వైపు వెళ్తూ కారులోనే గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. గురువారం ఓలేరు ఇసుక క్వారీ వద్ద మతదేహాన్ని గుర్తించారు. భట్టిప్రోలు తహసీల్దార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్దన్, తెనాలి గ్రామీణ సర్కిల్‌ సీఐ నాయబ్‌ రసూల్, ఎస్‌ఐ ఆనంద్, కొల్లిపర పీఎస్‌ ఎస్‌ఐ ప్రసాద్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు.     

చదవండి: ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement