ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు ఏడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అనుభవజు్ఞలైన న్యాయాధికారుల కొరతను నివారించడం, ప్రజలకు న్యాయం అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని తెలిపింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన, ఆతర్వాత రిటైరైన న్యాయాధికారులకు తిరిగి విధుల్లో జాయినయ్యే అవకాశం కల్పించాలని కోరింది.
వారు ఇతర విధుల్లో చేరని పక్షంలో ఈ వెసులుబాటు వర్తింపజేయాలని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళనాడు, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా సర్వీసు నిబంధనల్లో మార్పులు చేపట్టాలి.
రెండు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈలోగా ఆయా రాష్ట్రాల్లో 60 ఏళ్ల వయస్సు పూర్తయిన న్యాయాధికారులు 62 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరు పదవీ విరమణ పొందరు. అయితే ఇది సంబంధిత హైకోర్టు వారి అర్హత, పనితీరును సమీక్షించి ఇచ్చే ఆమోదానికి లోబడి ఉంటుంది’అని ధర్మాసనం వివరించింది.
ఆ రాష్ట్రాలు పునరాలోచన చేయాలి
అదేవిధంగా, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు పెంపును వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకశీ్మర్‌లు తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ధర్మాసనం కోరింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుని, ఆ మేరకు నివేదిక అందజేయాలంది. ఉన్నత న్యాయవ్యవస్థలో వయోపరిమితిలో వ్యత్యాసం ఉండటం సమర్థనీయమేనని తెలిపింది.
‘అయితే, మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయాధికారుల సంఖ్యకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి, ఖాళీల కారణంగా ప్రజలకు న్యాయం అందని ద్రాక్షగా మిగిలిపోకుండా చూడటానికి అనుభవజు్ఞలైన న్యాయ నిపుణుల కొరతను నివారించడమే ప్రస్తుత తక్షణ అవసరం’అని ధర్మాసనం వివరించింది. ‘జిల్లా న్యాయవ్యవస్థలో పనిచేసే అధికారుల పదవీ విరమణ వయస్సు పెంపుపై, వారి సేవా నిబంధనలకు అనుగుణంగా సిఫార్సులు చేయాల్సిన హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.


