యూపీ పీఠంపై అఖిలేష్ కన్ను.. అమల్లోకి 2024 ఫార్ములా! | Akhilesh's Brahmastra is ready Gearing up to conquer UP with the 2024 formula | Sakshi
Sakshi News home page

యూపీ పీఠంపై అఖిలేష్ కన్ను.. అమల్లోకి 2024 ఫార్ములా!

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 11:01 AM

Akhilesh's Brahmastra is ready Gearing up to conquer UP with the 2024 formula

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వచ్చే ఏడాది (2027) జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమకు భారీ విజయాన్ని అందించిన ‘పీడీఏ’ (పిఛ్‌డా, దళిత్‌, అల్పసంఖ్యాక్‌ -వెనుకబడిన, దళిత, మైనారిటీ) ఫార్ములాను మరింత విస్తరిస్తూ, ఈసారి అసెంబ్లీ పోరులో సరికొత్త ‘బ్రహ్మాస్త్రాన్ని’ ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. లీక్‌లకు భిన్నంగా సామాజిక సమీకరణాలను మార్చేస్తూ.. ఈసారి రాష్ట్రంలోని పలు సాధారణ (జనరల్) నియోజకవర్గాల్లో సైతం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యర్థులను బరిలోకి దించేందుకు సమాజ్‌వాదీ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహరచన చేస్తోంది.

ఫైజాబాద్ సూపర్ హిట్ మోడల్
గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చేసిన సాహసోపేతమైన ప్రయోగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయోధ్య పరిధిలోని ఫైజాబాద్ జనరల్ సీటు నుండి దళిత సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత అవధేష్ ప్రసాద్‌ను అఖిలేష్ బరిలోకి దించారు. రామమందిర సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ, ఆయన బీజేపీ అభ్యర్థిపై 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయం సాధించారు. అదేవిధంగా మీరట్ జనరల్ సీట్లో దళిత మహిళా నేత సునీతా వర్మను నిలబెట్టగా, అక్కడ బీజేపీ ఘనపాటి అరుణ్ గోవిల్ కేవలం 10 వేల ఓట్ల స్వల్ప తేడాతో బయటపడ్డారు. ఈ విజయాల స్ఫూర్తితోనే, 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ 'ఫైజాబాద్-మీరట్ మోడల్'ను పెద్ద ఎత్తున అమలు చేయాలని ఎస్పీ నిర్ణయించింది.

పశ్చిమ యూపీపై ప్రత్యేక నజర్
సాధారణ స్థానాల్లో దళిత అభ్యర్థులను నిలబెట్టేందుకు ఎస్పీ ఎంచుకున్న నియోజకవర్గాల్లో ఎక్కువ భాగం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. 2012 తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఓటు బ్యాంక్ నిరంతరం క్షీణిస్తూ వస్తోంది. ఒకప్పుడు మాయావతికి అండగా నిలిచిన పశ్చిమ యూపీ దళిత ఓటర్లు ఇప్పుడు చెల్లాచెదురయ్యారు. ఈ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా తిరుగులేని సామాజిక కూటమిని నిర్మించాలని అఖిలేష్ భావిస్తున్నారు. అలాగే, ఈ ప్రాంతంలో యువ దళితులను ఆకర్షిస్తూ  పుంజుకుంటున్న చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ ప్రభావాన్ని ముందే అడ్డుకోవడం కూడా ఎస్పీ ముఖ్య ఉద్దేశం.

నిపుణుల విశ్లేషణ ఏంటి?
సాధారణ స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులను నిలబెట్టడం వల్ల దళిత ఓటర్లలో ఒక రకమైన భావోద్వేగ, రాజకీయ బంధం ఏర్పడుతుందని లక్నోకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు డాక్టర్ నోమిత పి. కుమార్ అభిప్రాయపడ్డారు. కుల ప్రాతినిధ్యం కీలక పాత్ర పోషించే యూపీ లాంటి రాష్ట్రంలో, దళితులను తమ వైపు తిప్పుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఎస్పీ ఆశించిన విజయం సాధించాలంటే ముస్లింలు, ఓబీసీలు, దళితులను ఒకే వేదికపై ఎంతవరకు సమన్వయం చేస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

సర్వే బాధ్యతల్లో రిటైర్డ్ ఐఏఎస్
ఈసారి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అఖిలేష్ యాదవ్ ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆలోక్ రంజన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక సర్వే బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. నియోజకవర్గాల్లో వ్యతిరేకత లేని ప్రస్తుత ఎస్పీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు దక్కడం దాదాపు ఖాయమే అయినా, కొత్త అభ్యర్థుల ఎంపిక మాత్రం కేవలం సర్వే రిపోర్ట్, మెరిట్ ఆధారంగానే జరుగుతుందని అఖిలేష్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌తో పొత్తు సమీకరణలు
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అనుసరించాల్సిన సీట్ల సర్దుబాటుపై ఆలోక్ రంజన్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. దీని ప్రకారం కాంగ్రెస్‌కు 70 నుండి 75 కి మించి సీట్లు ఇవ్వకూడదని నివేదిక పేర్కొంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 71 స్థానాల్లో కాంగ్రెస్ ప్రదర్శన చాలా పేలవంగా ఉందని, అందుకే ఆ స్థానాలపై ఈసారి ఎస్పీ గట్టి పట్టుబట్టాలని సూచించింది. అయితే పశ్చిమ యూపీలోని సహారన్‌పూర్, అమ్రోహా వంటి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కాస్త క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

రిజర్వ్డ్ స్థానాల్లో మహా సంగ్రామం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 86 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 84 ఎస్సీ స్థానాలు కాగా, 2 ఎస్టీ స్థానాలు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాల్లో ఎస్పీ 7, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ 86 రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో పాటు, సాధారణ స్థానాల్లోనూ దళిత అభ్యర్థులను వ్యూహాత్మకంగా బరిలోకి దించితే 2027 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ మార్కును (202 సీట్లు) సులభంగా దాటవచ్చని సమాజ్‌వాదీ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement