స్నేహితుడితో కలిసి హత్య
పోలీసుల కళ్లుకప్పి పరార్!
ఎట్టకేలకు సొంతూరు దగ్గర అరెస్ట్
న్యూఢిల్లీ: ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా నలభై రెండేళ్లు పోలీసుల కళ్లుకప్పాడు ఆ వ్యక్తి. ఎప్పుడో 1984లో ఢిల్లీలో హత్య చేసి పారిపోయిన నత్తూ అలియాస్ నథూలాల్ చివరకు 2026 ఆగస్టు 18న ఉత్తరప్రదేశ్‌లో పోలీసులకు చిక్కాడు. పోలీసులిచ్చిన వివరాల ప్రకారం...
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయికి చెందిన నత్తూలాల్ ఢిల్లీలో ఉండేవాడు. 1984 మే 23వ తేదీ సీతాపూర్‌కు చెందిన మిత్రుడు బభూతి ప్రసాద్‌తో కలిసి ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో అశోక్ కుమార్ అనే వ్యక్తిని చంపాడు. అశోక్ కుమార్ ఒంటిపై బోలెడన్ని కత్తిపోట్లు కనిపించాయి. ఈ విషయమై జనక్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది కూడా. కేసు విచారించిన పోలీసులు బభూతి ప్రసాద్‌ను అరెస్ట్ చేసి నేరం చేసేందుకు వాడిన కత్తిని కూడా స్వాదీనం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి నత్తూ మాత్రం కనిపించకుండా పోయాడు.
ఎలాగైనా ఈ పాత కేసును పరిష్కరించలని అనుకున్నారో ఏమో కానీ... నత్తూ అరెస్ట్ కోసం పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పాత కేసు రికార్డులను నెలలకొద్దీ పరిశీలించి... సీతాపూర్, హర్దోయి ప్రాంతాల్లో తనిఖీలు చేసి నత్తూ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల హర్దోయిలోని పాలి ప్రాంతంలో వెరిఫికేషన్ జరుగుతూండగా నత్తూ బతికే ఉన్నట్లు, అప్పుడప్పుడూ సొంతూరుకు వచ్చిపోతున్నట్లు పోలీసులకు తెలిసింది. నత్తూ పోలికలతో ఉన్న వ్యక్తి గురించి ఆగస్టు 17న సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెంచారు. ఆ మరుసటి రోజే నత్తూ తన ఊరి నుంచి ఫరూకాబాద్ వెళ్లేందుకు ప్రయతి్నస్తూండగా పట్టుబడ్డాడు.


