న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలు గుప్పించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ సంజీవ్ అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు మూడు సార్లు లేఖలు రాశారు.
జస్టిస్ సంజీవ్ కోర్టు పరిపాలనా వ్యవహారాల్లో పూర్తిగా విఫలమయ్యారని, బంధు ప్రీతి చూపిస్తున్నారని, తప్పుడు తీర్పులు ఇస్తున్నారని ఆగస్ట్ 2, 10, 17 తేదీల్లో రాసిన లేఖల్లో ఆరోపించారు. సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల, సంపన్నుల జోక్యమున్న కేసులనే తాను విచారణకు తీసుకుంటూ మిగతా కేసులను ఇతర ధర్మాసనాలకు సిఫార్సుచేస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆ లేఖల్లో పేర్కొన్నారు.
యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హోదాలో కేసులను ఏఏ జడ్జీలకు కేటాయించాలనే మాస్టర్ ఆఫ్ రోస్టర్ నిబంధనను ఈయన యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, తక్షణం శాశ్వత ప్రాతిపదికన వేరే రాష్ట్రానికి చెందిన జడ్జీని రాజస్తాన్ హైకోర్టుకు సీజేగా నియమించాలని లేఖల్లో జస్టిస్ మెహతా కోరారు. దీనిపై తగు బలమైన సాక్ష్యాధారాలు ఉంటే సమర్పించాలని ఈయనకు సీజేఐ సూర్యకాంత్ సూచించారు. జస్టిస్ మెహతా గతంలో ఇదే రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా సేవలందించి పదోన్నతితో సుప్రీంకోర్టులో జడ్జి అయ్యారు. పదేళ్ల క్రితం జస్టిస్ సంజీవ్ రాజస్తాన్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పట్నా హైకోర్టుకు, తర్వాత పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీ అయి మళ్లీ చివరకు రాజస్తాన్ హైకోర్టుకే వచ్చారు.


