నలుగురు ముఖ్యమంత్రులకు చోటు దక్కే అవకాశం
రేసులో యోగి, ఫడ్నవీస్, హిమంత, సువేందు
దక్షిణాది నుంచి కె.లక్ష్మణ్‌ను కొనసాగించే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. మొత్తం 12 మంది సభ్యులుండే ఈ బోర్డును ఆగస్టు 30 నాటికి పునర్ వ్యవస్థీకరించే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. యువ నాయకులతో పాటు ముగ్గరు లేక నలుగురు ప్రస్తుత ముఖ్యమంత్రులకు ఇందులో చోటు కల్పించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 12 మంది సభ్యుల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మరో 8 మంది ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టి పెట్టుకొని పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త బోర్డులో మార్పులు చేపట్టనున్నారు. బోర్డు లో అవకాశం దక్కనున్న వారిలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఈయన కు ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు ఒక కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా జాతీయ రాజకీయాల్లో ఫడ్నవీస్ పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈయనతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బెంగాల్ సీఎం సువేందు అధికారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ముగ్గురు లేక నలుగురు సీఎంలను బోర్డులోకి తీసుకుంటే ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను తప్పించే అవకాశం ఉందంటున్నారు.
పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణలో ప్రాంతాలు, వివిధ సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించడంపైనా దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన ఇద్దరు నేతలు బీఎస్ యడ్యూరప్ప, తెలంగాణకు చెందిన ఎంపీ కె.లక్ష్మణ్ ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వీరిలో తిరిగి ఒక్కరికే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మొన్నటి బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఎవరికీ ప్రాతినిథ్యం దక్కని దృష్ట్యా లక్ష్మణ్‌ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
బోర్డు తర్వాత సీఈసీ..
బోర్డు పునర్‌వ్యవస్థీకరణ తర్వాత బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీలో పార్లమెంటరీ బోర్డు సభ్యులందరితో పాటు ఇతర ముఖ్య నా యకులు కూడా ఉంటారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న రూప్ కుమారి చౌదరి, కేంద్ర ఎన్నికల కమిటీలో పదవీ రీత్యా సభ్యురాలిగా మారనున్నారు. నితిన్ గడ్కరీ ఫడ్నవిస్, యాదవ్‌లను సభ్యులుగా కొనసాగిస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.


