లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కౌన్సిలర్లు లంచాల ద్వారా వచ్చిన డబ్బును తమలో తాము నిజాయితీగా పంచుకుంటామని ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో మున్సిపల్ సంస్థ విచారణకు ఆదేశించింది.
వీడియోలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ గంగాజలం ఉన్న పాత్రను పట్టుకుని, లంచాల ద్వారా వచ్చిన డబ్బును 60 మందికి సమానంగా పంచుకుంటామని ప్రమాణం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి ప్రమాణం చేయిస్తుండగా.. చేతుల్లో నీటితో కొంతమంది నిలబడి ఆయన చెప్పిన మాటలను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వారిని మున్సిపల్ కౌన్సిలర్లుగా గుర్తించారు. అయితే వీడియో నిజమైనదా, అందులో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు అనే విషయాలను స్వతంత్రంగా ఏ వార్తా సంస్థా ధ్రువీకరించలేదు.
ఆ వీడియోలో ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చిన డబ్బును 60 మంది కౌన్సిలర్లకు సమానంగా పంచుకోవాలని పేర్కొన్నారు. తమలో ఎవరైనా ఇబ్బందుల్లో పడితే అందరూ ఐక్యంగా నిలబడతామని కూడా ఆ బృందం ప్రమాణం చేసినట్లు చెబుతున్నారు. ప్రమాణాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని ద్రోహిగా పేర్కొంటూ వీడియోలో అభ్యంతరకరమైన వ్యాఖ్య కూడా ఉంది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో కౌన్సిలర్లపై అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఒక కౌన్సిలర్ ఆస్తులు పెరిగినట్లు కొంతమంది వినియోగదారులు చెప్పారు. 3 ఏళ్ల క్రితం ఆ వ్యక్తికి ఒక ఇల్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు అనేక ఇళ్లు, విలాసవంతమైన వాహనాలు సంపాదించారని వారు ఆరోపించారు.
మున్సిపల్ కమిషనర్ సౌమ్య గురురాణి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వీడియోను 2025 నవంబర్‌లో, మరో మున్సిపల్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్న సమయంలో చిత్రీకరించినట్లు సమాచారం అందిందని తెలిపారు. “అయినప్పటికీ, మేము విచారణకు ఆదేశించాం” అని ఆమె చెప్పారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
UP councillors in Shahjahanpur reportedly took a Gangajal oath to equally share the municipal corporation’s earnings, sparking allegations of corruption and questions over public money. pic.twitter.com/P4dt07sFw4
— Ground Eye 🇮🇳 (@TapasyaYaa83081) August 25, 2026


