ముమ్మాటికి అది నీటి సమస్యేనా..? పరిశోధకులు సైతం.. | Caste Discrimination Water Crisis Bundelkhand Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ముమ్మాటికి అది నీటి సమస్యేనా..? పరిశోధకులు సైతం..

Aug 25 2026 10:12 AM | Updated on Aug 25 2026 12:46 PM

Caste Discrimination Water Crisis Bundelkhand Uttar Pradesh

అది కేవలం నీటి సమస్యేనా.. అంతకుమించి మరేదైనానా..!? టెక్నాలజీ పెరిగింది.. అంతరిక్షానికి చేరువయ్యే మేథస్సుని అందిపుచ్చుకుంటున్నా.. ఇంకా కులం  కోరల్లో మగ్గిపోతున్నారు చాలచోట్ల. వీచే గాలి, ప్రసరించే ఎండకు లేని భేదం మనిషికి మనిషికి మధ్య కులం అనే అడ్డుగోడ సృష్టించే సమస్యలకు నిలువెత్తు నిదర్శనం ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ ఖండ్‌లో కనిపించే సమస్య. శాస్త్రవేత్తలను సైతం దిగ్బ్రాంతికి గురిచేసే మానవీయ సమస్య.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఎండలు మండిపోతుండటంతో నీటి కష్టాలు తీవ్రంగా మారుతున్నాయి. కరువు, తక్కువ వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. దీంతో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి కోసం ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికే ఉన్న కుల వివక్షను మరింత తీవ్రం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

జలౌన్‌ జిల్లాకు చెందిన 40 ఏళ్ల మమత పరిస్థితి ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దళితురాలైన ఆమె.. కుటుంబ సభ్యులు, పశువుల అవసరాల కోసం ప్రతిరోజూ హ్యాండ్‌పంప్‌(బోరింగ్‌) వద్దకు వెళ్లి నీటిని తీసుకువస్తోంది. గ్రామంలో ప్రభుత్వ పథకం కింద ఏర్పాటు చేసిన నల్లాలు రెండేళ్లుగా పనిచేయకపోవడంతో సుమారు వెయ్యి మంది ప్రజలు కొద్దిపాటి హ్యాండ్‌పంపులపైనే ఆధారపడుతున్నారు. దీంతో మమత రోజుకు 8 నుంచి 10 సార్లు నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది.

అయితే నీటి కోసం వెళ్లే మమతకు ఎండలతో పాటు కుల వివక్ష కూడా ఇబ్బందిగా మారిందని ఆమె ఆరోపిస్తోంది. ఆధిపత్య కులాలకు చెందినవారు హ్యాండ్‌పంప్‌ వద్ద ఉన్నప్పుడు తాము నీటిని పట్టుకోలేమని, వారు వెళ్లే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని చెబుతోంది. అంతేకాకుండా నిమ్నకులాలు తాకిన హ్యాండ్‌పంప్‌ని వారు వెళ్లిన తర్వాత నీటిని పోసి శుద్ధి చేస్తారని ఆరోపించింది. ఇదే తరహా అనుభవాన్ని షాజహాన్‌పూర్‌కు చెందిన శివ్‌ కూడా ఎదుర్కొంటున్నాడు. ఆధిపత్య కులాల వారు నీటిని తీసుకుంటున్నప్పుడు తమ వర్గానికి చెందినవారు హ్యాండ్‌పంప్‌ వద్దకు వెళ్లరని, ఎంత ఎండగా ఉన్నా వేచి ఉండాల్సిందేనని తెలిపాడు. కుటుంబ సభ్యులు ఎంత దాహంగా ఉన్నాసరే.. అగ్ర కులాలవారు అక్కడినుంచి వెళ్లే వరకు గంటల తరబడి వేచి ఉండాలని, గతంలో నీటి విషయంలో జరిగిన గొడవలో తన తల్లిపై దాడి కూడా జరిగిందని ఆరోపించాడు.

వేసవి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఈ క్రమంలో చలికాలంలో రోజుకు 2, 3 సార్లు మాత్రమే నీటి కోసం వెళ్లే మమత.. వేసవిలో ఏకంగా 8 నుంచి 10 సార్లు నీటికోసం వెళ్లాల్సి వస్తోందని చెబుతోంది. మరోవైపు బుందేల్‌ఖండ్‌లో ఇటీవలి వేసవిలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. ఆ ప్రాంతం రాతి నేల కారణంగా భూగర్భ జలాలను ఎక్కువగా నిల్వ చేసుకోలేకపోవడం, వర్షపాతం తక్కువగా ఉండటం కూడా నీటి సమస్యను అధికం చేస్తున్నాయి. అయితే నీటి వనరుల వద్ద కుల వివక్ష జరుగుతోందన్న ఆరోపణలను స్థానిక అధికారులు కొట్టివేస్తున్నారు. నీటి కొరతను ఎదుర్కొనేందుకు పైపుల ద్వారా తాగునీరు అందించడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచే చర్యలు చేపడుతున్నామని వారు చెబుతున్నారు.

అయితే నీటి వనరులను పెంచడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఎండలు ఇప్పటికే ఉన్న సామాజిక అసమానతలను మరింత తీవ్రం చేస్తున్నాయని వారు చెబుతున్నారు. నీరు కొరతగా మారిన కొద్దీ నీటికై పోటీ పెరుగుతోందని, ఈ క్రమంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష మరింత స్పష్టంగా బయటపడుతోందని అంటున్నారు. అందరికీ సమానంగా నీరు అందేలా చూడటంతో పాటు కుల వివక్షను తొలగించేందుకు చర్యలు తీసుకున్నప్పుడే బుందేల్‌ఖండ్‌ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి చదవండి: పర్యావరణ హిత జీవన సేద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement