ఆధునిక సాంకేతికత సహాయంతో అటవీ విస్తీర్ణానికి, చెట్లను పరిరక్షించడానికి కృషి చేస్తోంది ఫార్మర్స్ ఫర్ ఫారెస్ట్స్ (ఎఫ్4ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ. కృతికా రవిశంకర్ ఈ సంస్థ కో–ఫాండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వ్యవసాయం, ఆహారభద్రత, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన రంగాలలో కృతికకు దశాబ్దకాల అనుభవం ఉంది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్4ఎఫ్... వాతావరణం, జీవవైవిధ్యం, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచే జీవవైవిధ్య క్షేత్రాలు, అడవులను సృష్టించడం లక్ష్యాలుగా పనిచేస్తోంది.
అద్భుత మార్పు
కాలేజీ రోజుల్లో...రాలెగావ్ సిద్ధిలో అన్నాహజారే చేస్తున్న సామాజిక సేవకు సంబంధించిన విషయాలు వింటూ ఉండేది కృతిక. 25 సంవత్సరాల నిరంతర కృషితో నీటి పరీవాహక ప్రాంతాల నిర్వహణ, అటవీకరణ ద్వారా తన గ్రామం తలరాత మారేలా చేయగలిగారు హజారే.
చెట్లు వాతావరణ పరిరక్షకులు. గాలిలోని కార్బన్‌ను గ్రహించడమే కాకుండా భూగర్భ జలాలు పెరిగేలా, నేల సారవంతం అయ్యేలా చేస్తాయి. నీటి మట్టాలు పెరగడంతో, పంటలకు ఎక్కువ నీరు, ఆవులకు ఎక్కువగా గ్రాసం దొరికింది. పంట దిగుబడులు, పాడి ఆదాయం పెరిగింది.
ఒక గ్రామం పూర్తిగా మారిపోయింది!...ఇలాంటి విషయాలెన్నో విన్న కృతికా రవిశంకర్ పర్యావరణహిత మార్గం వైపు అడుగులు వేసింది.
అసలైన బలం
‘మార్పుతో ఏదైనా సాధ్యమే’ అనే మాట కాలేజీ రోజుల్లోనే కృతిక మదిలో బలంగా నాటుకుపోయింది.
‘మనం ఆశించే ఫలితాలు వెంటనే రావు. చాలా ఓపిక కావాలి. ప్రకృతి చాలా సమయం తీసుకుంటుంది. ఈలోపు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని దిద్దుకుంటూ ముందుకుసాగుతాం. ఇదొక నిరంతరప్రక్రియ’ ఎఫ్4ఎఫ్‌ను ఉద్దేశించి అంటుంది కృతిక.
బీడుగా మారిన వ్యవసాయ భూములను జీవవైవిధ్యం గల భూములుగా మారుస్తోంది ఎఫ్4ఎఫ్. మొక్కలు నాటినందుకే కాకుండా వాటిని సంవత్సరాల తరబడి పోషించి కాపాడినందుకు ‘ఎఫ్4ఎఫ్’ ద్వారా రైతులకు ప్రతిఫలం కూడా లభిస్తుంది.
‘మా అసలు సిసలు బలం ఆత్యాధునిక సాంకేతికత కాదు. రైతులు’ అంటుంది కృతిక రవిశంకర్.


