అడవి పండ్ల జాతి –15
Name: Columnar Cactus
శాస్త్రీయ నామం: సెరెస్ ప్టెరొ గోనస్
Scientific Name: Cereus pterogonus Lem
Synonym (s) : Cereus repandus (L.) Mill.
కుటుంబం: క్యాక్టేసి
Family: Cactaceae
కోలజెమ్మెడు పండును వేర్వేరు భాషల్లో ఏమని పిలుస్తారంటే..
ఇంగ్లీష్: సెంటి నేల్ క్యాక్టస్, డాగ్ టేల్ క్యాక్టస్, హెడ్జ్ క్యాక్టస్
తమిళం: సిప్పాల్ కథలై;
మలయాళం: పుచ్చముళ్ళు;
బెంగాలీ: మానస
తెలుగు: కోలజెమ్మెడు, జెమ్మడు, నిటారు జెమ్మెడు.
వేరే భాషల్లో దీనికి గుర్తింపు తక్కువ. గ్రామాల్లో ఉండే జెమ్మెడు రకాలలో కోలజెమ్మెడు ఒకటి. ఊర్లలో చాలామందికి తెలిసిన చెట్టు. ఈ జెమ్మెడులో కూడా డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా మే నుంచి నవంబర్ మాసం వరకు అంచెలంచెలుగా పూత–కాత వస్తుంది. దీన్ని నైట్ బ్లూమింగ్ సెరెస్ అని కూడ అంటారు. దీనిలో దాదాపు 33 జాతులు ఉన్నాయని అంచనా.
ఉనికి:
ఇవి మెట్ట ప్రాంత మైదానాలు, అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి. నిటారుగా గుంపులుగా పెరుగుతాయి. దాదాపు 3–6 మీటర్ల ఎత్తువరకు పెరగగలవు. వీటికి కణుపులు ఉంటాయి. వీటి ఉనికి ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండలపు ప్రాంతాల్లో ఉంది. దీనికి డ్రాగన్ పండు చెట్టుకు అతిదగ్గరి పోలిక ఉంది. దీనికి ముళ్లతో కూడుకున్న ఆరు నుంచి ఎనిమిది భుజాలు ఉంటాయి. వీటి స్వస్థలం, బ్రెజిల్, ఊరుగామ్, అర్జెంటీనా. వీటి ఉనికి దక్షిణ అమెరికా, ఇండియా, చైనా, శ్రీలంక, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా ఉంది. ఇండియాలో చాలా రాష్ట్రాలలో వీటి ఉనికి ఉంది. నల్లమల అడవులతో ΄ాటు మైదానపు ప్రాంతాలు, పొలం గట్లు తదితర చోట్ల పెరుగుతుంది. ఈ చెట్లు వాతావరణ మార్పులను తట్టుకోగలవు.
పోషక ఔషధ నిధులు
కోలజెమ్మెడు చెట్లను పొలం చుట్టూ జీవ కంచెగా పెంచుతారు. వీటిని అందం కోసం కుండీలలో పెంచుకోవచ్చు. పండ్లను తింటారు, చప్పటి రుచి ఉంటాయి. కాని నల్లమల అడవుల్లో ఈ పండ్లను జనం తినరు. ఈ పండ్లు డ్రాగన్ ఫ్రూట్‌ని పోలిన రంగులో ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇతర దేశాల్లో ప్రజలు ఈ పండ్లను బాగా ఇష్టపడతారు. ఇవి అన్నికాలాల్లో వాతావరణ మార్పులను తట్టుకొని నిలువగలవు. తక్కువ నీరు మాత్రమే ఈ చెట్లకు అవసరం.
సమగ్ర పరిశోధనలు జరిపి, పంట పొలాలకు తేగల్గితే, మెట్ట రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుంది. దీనికి మంచి ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఛాతి నొప్పి, మూత్ర సంబంధిత సమస్యలను నయం చేయటానికి వాడతారు. కోలాజెమ్మెడు జన్యువులను ఉపయోగించుకొని డ్రాగన్ ఫ్రూట్, కొలజెమ్ముడు కొత్తరకాలను తీసుకువస్తే వాటిని బంజరు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. కాబట్టి ఈ జీవ వైవిధ్యాన్ని పరిశోధకులు, ఇతరులు ప్రయోగాలకు ఊతమిస్తే, ఈ క్యాక్టేసి కుటుంబంలో ఒక కొత్త ఒరవడి వెలుగు చూడగలదు. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే పోషకాలు ఇందులో కూడా ఉంటాయి. వీటిపైన అధ్యయనం ఎంతో అవసరం.
పోషక విలువల్లో డ్రాగన్ ఫ్రూట్ కు తీసిపోని పండు కోలజెమ్మెడు. టీఎస్‌ఎస్ కూడా డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నంత స్థాయిలో ఉంది.
(ఆధారం: వ్యాసకర్త ప్రత్యేకంగా పోషక విలువల విశ్లేషణ చేశారు. 2023)
- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924
- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


