వినియోగదారులకు చేరకముందే చేజారుతున్న 25% పంట
ధాన్యాలు, పప్పుదినుసులతో పోలిస్తే కూరగాయల వేస్టే 3 రెట్లు అధికం
వృథాను అరికడితే సాగు విస్తీర్ణం పెంచకుండానే 25% ఆహారోత్పత్తి పెంపుదల సాధ్యం
వరల్డ్ వెజిటబుల్ సెంటర్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, సాగుబడి డెస్క్: అదనపు భూమి అవసరం లేదు.. ఎరువులు, విత్తనాలు, సాగునీటి వ్యయం పెరగదు.. కానీ దేశంలో ఆహారోత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచొచ్చు! ఇది వినడానికి వింతగా అనిపించినా, క్షేత్రస్థాయిలో సాధ్యమేనని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సెంటర్ (డబ్ల్యూవీసీ) తాజా అధ్యయనం చెబుతోంది. పంట ఉత్పత్తిని పెంచేందుకు చేసే ప్రయత్నాల కంటే, పండిన పంటను వృథా కాకుండా కాపాడుకోవటం వల్లనే ఎక్కువ మేలు జరుగుతుందని డబ్ల్యూవీసీ పంట కోత అనంతర వ్యవహారాల నిపుణురాలు డాక్టర్ సుజయశ్రీ ఓజే స్పష్టం చేశారు.
ముందే చేజారుతున్న 25% పంట
సాధారణంగా ప్రజలు ఆహార వృథా అంటే ఫ్రిజ్‌లలో లేదా ప్లేట్లలో మిగిలిపోయే ఆహారమేనని భావిస్తారు. కానీ వాస్తవానికి ఉత్పత్తి అయిన ఆహారంలో భారీ భాగం వినియోగదారుడి దగ్గరకు చేరకముందే నేలపాలవుతోంది. ముఖ్యంగా త్వరగా పాడైపోయే స్వభావం ఉన్న కూరగాయలు మరింత ఎక్కువగా వృథా అవుతున్నాయని డబ్ల్యూవీసీ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పండించే పండ్లు, కూరగాయల్లో పొలంలో కోత దగ్గరి నుంచి చిల్లర వ్యాపారుల దగ్గరకు చేరే మధ్యలోనే 25 శాతానికి పైగా నాశనమవుతున్నాయి. ధాన్యాలు, పప్పుదినుసులతో పోలిస్తే కూరగాయల నష్టాల శాతం మూడు రెట్లు అధికం. నెలల తరబడి రైతు పడే శ్రమ, పెట్టుబడి చివరకు ఎవరి ఆకలి తీర్చకుండానే వ్యర్థమవుతోంది.
ఉల్లి వృథాకు అడ్డుకట్ట
దీనికి పరిష్కారం దిశగా ఒడిశాలో వరల్డ్ వెజిట బుల్ సెంటర్ చేపట్టిన సమగ్ర కార్యాచరణ విశేష ఫలితాలనిచ్చింది. ఒడిశా ఏటా దాదాపు 4.47 లక్షల టన్నుల ఉల్లిని ఉత్పత్తి చేస్తుంది. అయితే సరైన సౌకర్యాలు లేక కోత అనంతరం దాదాపు 40 శాతం ఉల్లి మార్కెట్‌కు చేరకుండానే కుళ్లిపోయేది. దీన్ని అరికట్టేందుకు సంస్థ ఆధ్వర్యంలో సమగ్ర పద్ధతులు అమలు చేశారు. కేవలం అధిక దిగుబడిపై మాత్రమే దృష్టి కాకుండా, కోత తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండే నాణ్యమైన విత్తన రకాలను రైతులకు అందించారు. ఉల్లి తవ్విన తర్వాత సమర్థవంతంగా ఆరబెట్టడంలో రైతులకు మెళకువలు నేర్పించారు.
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో కూడిన, గాలి వెలుతురు పారాడే గోదాములను నిర్మించారు. అదనపు నిల్వలను ఉల్లి ఫ్లేక్స్, పొడి వంటి ప్రాసెస్డ్ ఉత్పత్తులుగా మార్చి మార్కెట్‌కు అనుసంధానించారు. ఈ చర్యలతో కోత అనంతర నష్టాలు 40 శాతం వరకు తగ్గాయి. రైతులకు నేరుగా కొనుగోలుదారులతో అనుసంధానం కల్పించడంతో వారి ఆదాయం సగటున 45 శాతం పెరిగింది. పంట నష్టాన్ని తగ్గించటం అనేది విత్తనం నాటే దశ నుంచి మార్కెట్‌కు చేరేవరకు అన్ని దశల్లోనూ సమగ్రంగా జరగాలని ఈ అధ్యయనం తేల్చింది. నిల్వ, ప్రాసెసింగ్, రవాణా వ్యవస్థలను పటిష్టం చేస్తే రైతన్నకు గిట్టుబాటు ధర దక్కడంతో పాటు దేశానికి ఆహార భద్రత చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


