పాడి కోసం పాటుపడినా..! | Zero priority for working women farmers in the dairy industry | Sakshi
Sakshi News home page

పాడి కోసం పాటుపడినా..!

Sep 29 2026 4:25 AM | Updated on Sep 29 2026 4:25 AM

Zero priority for working women farmers in the dairy industry

పాడి పరిశ్రమలో 70% శ్రమ మహిళా రైతులదే అయినా నిర్ణయాధికారం సున్నా 

మహిళల శ్రమకు తగిన గౌరవం,  ఆర్థిక స్వాతంత్య్రం దక్కినప్పుడే నిజమైన సాధికారత సాధ్యం 

ఆహార వ్యవసాయ సంస్థ (ఐరాస–ఎఫ్‌ఏఓ) తాజా నివేదిక విశ్లేషణ

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమే వెన్నెముక. మహిళలే అసలైన చోదకశక్తి. అయితే పశువుల పోషణ మొదలు పాలు పితకటం వరకు శ్రమంతా మహిళలదే అవుతున్నా.. ఆదాయంపైన, పశువుల అమ్మకం కొనుగోళ్లపై నిర్ణయాధికారంలో మాత్రం వారి మాటకు తగిన ప్రాధాన్యం దక్కటం లేదని ఆహార వ్యవసాయ సంస్థ (ఐరాస–ఎఫ్‌ఏఓ) తాజా పరిశోధనా నివేదికలో స్పష్టం చేసింది.

 ముఖ్యంగా భారత్‌ సహా అత్యల్ప–మధ్యస్థ ఆదాయ దేశాల్లో పరిస్థితి ఇదే. పాడి రంగం విస్తరిస్తున్నంత మాత్రాన మహిళా సాధికారత దానంతట అదే రాదని, సరైన విధానాలు లేకపోతే వారికి గొడ్డు చాకిరీయే మిగులుతుందని ఎఫ్‌ఏఓ స్పష్టం చేసింది. మహిళల శ్రమకు తగిన గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం దక్కినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమని పేర్కొంది.

70% పనులు చేసేది మహిళలే.. 
పాడి పరిశ్రమలో పశువుల పోషణ, మేత సేకరణ, పేడ ఎత్తటం, పాలు పితకటం వంటి శ్రమతో కూడిన పనుల్లో 70 శాతానికి పైగా మహిళలే పాలుపంచుకుంటున్నారు. కానీ మార్కెట్లో పాలు అమ్మటం, వచ్చే ఆదాయాన్ని నిర్వహించటం, పశువుల అమ్మకాలు కొనుగోళ్లు వంటి విషయాల్లో పురుషుల పెత్తనమే అధికంగా ఉంటోంది. 
పాల విక్రయ కేంద్రాల వద్ద నగదు చెల్లింపులు లేదా బ్యాంక్‌ ఖాతాలు పురుషుల పేరిటే జరుగుతుండటం వల్ల, కుటుంబ పోషణకు ఎంతగానో పాటుపడుతున్న మహిళలకు నేరుగా ఆర్థిక స్వాతంత్య్రం దక్కటం లేదు. వ్యాపార స్థాయి పెరిగే కొద్దీ ఆస్తులపై యాజమాన్య హక్కులు, పెద్ద మొత్తంలో వచ్చే రాబడి పురుషుల చేతుల్లోకే వెళ్తుండటంతో లింగవివక్ష మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

పని భారం పెరిగినా సానుకూలతే..
పాడి పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గృహ ఆదాయం, కుటుంబ పోషకాహార స్థాయిలు మెరుగుపడినప్పటికీ, మహిళల రోజువారీ పని గంటలు భారీగా పెరిగాయి. పాల సహకార సంఘంలో మహిళకు సభ్యత్వం ఇచ్చిన తర్వాత పాడి పశువుల పనుల్లో ఆమె నిమగ్నమయ్యే సమయం 3.5 నుంచి 5 గంటలకు పెరిగిందని ఎఫ్‌ఏఓ పేర్కొంది. ఇంటి పని, వ్యవసాయ పనులతో పాటు అదనంగా పశువుల నిర్వహణ తోడవ్వటంతో వారి విశ్రాంతి సమయం గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ, కుటుంబానికి రోజువారీ ఖర్చులకు చేతిలో ఎంతోకొంత ఆసరా లభిస్తుండటంతో మహిళా రైతులు పాడి రంగాన్ని సానుకూల పనిగానే చూస్తున్నారని పరిశోధకులు గుర్తించారు.

మహిళా రైతుల సాధికారతకు ఏం చెయ్యాలి?
ప్రభుత్వాలు, సహకార సంఘాలు కేవలం పాడి పశువులను పంపిణీ చేయటమో లేదా పాల ఉత్పత్తిని పెంచే పథకాలు తేవటమో చేస్తే చాలదు. మహిళా రైతుల చేతుల్లో ఆర్థిక అధికారం ఉండేలా ప్రత్యేక విధానాలు రూపొందించి అమలు చెయ్యాలని ఎఫ్‌ఏఓ సూచించింది 

→ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను విస్తరించి, పాల సేకరణ బాధ్యతలను మహిళలకే అప్పగించాలి. పాల సంఘాల్లో మహిళా రైతులకు క్రియాశీలక సభ్యత్వం, నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి 

→ పాల బోనస్‌లు, రాయితీలు మహిళల పేరిట ఉన్న ఆధార్‌ అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతాలకే బదిలీ చేయాలి 

→ ఛాఫ్‌ కట్టర్లు వంటి గొడ్డు చాకిరీని తగ్గించే యంత్రాలు, చిన్న తరహా మిల్కింగ్‌ యంత్రాలు మహిళా రైతు గ్రూపులకు సబ్సిడీపై అందించాలి 

→ పశుగ్రాసం సాగు, సమతుల్య దాణా తయారీ, ప్రాథమిక పశువైద్యంపై మహిళలకు అనువైన వేళల్లో గ్రామాల్లోనే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి 

→ ఎల్‌నినో సాధారణ పంటలను దెబ్బతీస్తుండగా ఆధారపడదగిన ఆదాయ వనరుగా పాడి రంగం పాత్రను మరింత బలోపేతం చెయ్యటానికి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం నేపథ్యంలో ఎఫ్‌ఏఓ తాజా నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement