సాగుబడి
చింత
అడవి పండ్ల జాతి –19
English Name: Tamarind
శాస్త్రీయ నామం: ట్యామరిన్దస్ ఇండిక
Scientific Name: Tamarindus indica L.
Synonym (s): Tamarindus occidentalis Gaertn. Tamarindus officinalis Hook.
Tamarindus umbrosa Salisb.
కుటుంబం: ఫ్యాబేసి
Family: Fabaceae
చింత చెట్లు పేర్లు:
అస్సామీస్: టెట్లీ;
ఇంగ్లీష్: ట్యామరిండ్;
ఉర్దూ: ఇమ్లీ;
ఒరియా: టెన్తులి, దాలిమ;
గుజరాతీ: అమ్లీ;
కన్నడ: హునిసేహన్ను, హులి;
తమిళం: పులి;
తెలుగు: చింత;
పంజాబీ: ఇమ్లీ;
బెంగాలీ: తెంన్టుల్, తెటుల్;
మరాఠీ: చిన్చ;
మలయాళం: పులి, వనంపులి;
హిందీ: ఇమ్లీ;
సంస్కృతం: అమ్లీకా, చింతడి;
ఇటాలియన్: ట్యామరిండ్;
ఫిలిప్పెన్స్: టమన్;
నైజీరియా: హశస,
థాయి: మఖ్;
ఫ్రెంచ్: ట్యమరిన్;
ఇండోనేషియా: ఆసాం;
మెక్సికన్: ట్యామరిన్దో
పూత: మే – జులై
పండ్లు : జనవరి – ఏప్రిల్
చింత నాటి–నేటి తరానికి తెలిసిన పండ్ల చెట్లు. ఇది రాబోయే తరాలకు కూడా గుర్తు ఉండగల పండు. దీని స్వస్థలం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతం. కానీ చింత చెట్లు అనాదిగా ఇండియాలో కూడ ఉన్నాయి. ప్రస్తుతం అత్యధికంగా చింతపండును ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. చింత చెట్టు సగటు జీవిత కాలం 200 సంవత్సరాలు. 800 సంవత్సరాల చింత చెట్టు బెంగుళూరు జీవవైవిధ్య పార్కులో ఉంది. ఇది రాజరాజ చోళుల కాలంలో నాటినట్లు చెప్తున్నారు. సౌత్ ఏషియా, ఉత్తర ఆస్ట్రేలియా, ఆసియా, తైవాన్, చైనా కూడా ఉంది. సౌత్ ఇండియాలో దీని ప్రాముఖ్యత అధికం.
ఒకప్పుడు అడవికి పరిమితమైన ఈ చెట్లు రానురాను పంట పొలాలను తాకింది. బ్రిటిష్ కాలంలో రోడ్డుకు ఇరువైపుల నాటారు. కరువు కాలాల్లో పేదలకు ఆసరాగా ఉంటుందని నాటారు. ఉత్తర భారతం చలి ప్రాంతాల్లో చింత లేదు. పక్వ దశకు వచ్చిన చెట్టు నుండి దాదాపు 175 కిలోల పండు పొందవచ్చు. 12– 20 మీటర్ల ఎత్తువరకు పెరగగలదు. నీటి అవసరం తక్కువే. సూర్యరశ్మి ఉన్న చోట్ల చింత చెట్లు ఏపుగా పెరుగుతాయి. ఇవి అన్ని నేలల్లో పెరుగుతాయి. విత్తనం ద్వారా పునరుత్పత్తి జరుగుతుంది. చింత చెట్టు పోషకాలకు పెట్టింది పేరు. చెట్టు బెరుడు, ఆకులు (చిగురు), కాయలు, పండ్లు మొదలైన భాగాలను వినియోగిస్తున్నాం.
చింత చెట్టు ఉపయోగాలు:
చింత చెట్టు అన్ని భాగాలూ ఎంతో ఉపయోగపడతాయి. చింత కలప చాలా గట్టిది. చాలా సంవత్సరాలు మన్నికగా ఉంటుంది. ఫర్నీచర్ తయారీలో వాడతారు. నగిషీలు చెక్కడానికి ఉపయోగిస్తారు. దిమ్మలకు ప్రత్యేకంగా చింతనే వాడుతారు. మాంసం దుకాణదారులు ప్రత్యేకంగా చింత దిమ్మలనే మాంసాన్ని కట్ చేయటానికి వాడతారు.
చింత చిగురు ఆకుకూరగా ఉపయోగపడుతుంది. పచ్చడి చేస్తారు. కొన్ని దేశాలలో చింత ఆకుల ‘టీ’ ని మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు. చింత చిగురు పప్పు చాలా రుచిగా ఉంటుంది.
పూతను పప్పులో వేస్తారు. వగరు, పులుపుతో కూడిన పప్పు విటమిన్ ‘సి’ని ఇస్తుంది.
కాయలతో పచ్చడి పెడతారు. చింతకాయ పులిహోర రుచిగా ఉంటుంది.
చింతపండు పులుసు చాలా ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. చింత పండు పులిహోర ప్రత్యేకం. సాస్ తయారు చేయటానికి, పచ్చళ్ళలో, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడతారు.
కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయటం, మెరుపు తేవడానికి ఉపయోగిస్తారు.
చింత పిక్కల నుండి ΄ûడరు తయారు చేసి టెక్స్‌టైల్, జనుము ప్రాసెసింగ్‌లో వాడతారు. బిస్కెట్లు, జిగురు, మందుల తయారీలోను ఉపయోగిస్తారు.
చింత కొమ్మల బొగ్గును చిత్రలేఖనంలో వాడతారు.
చింతపండు జీర్ణక్రియకు ఉపయోగ పడుతుంది. అజీర్ణానికి విరుగుడుగా చింత ఆకులను ఉపయోగిస్తారు. పెప్టిక్ అల్సర్‌లను తగ్గించడానికి చింత పిక్కలను, చింత బెరడును ఉపయోగిస్తారు.
చింతతో చేసిన మందులు ఇన్సులిన్ స్థాయిని మెరుగుపరచి మధుమేహ లక్షణాలను తగ్గిస్తాయి.
అధిక రక్తపోటును తగ్గించటానికి ఉపయోగపడుతుంది. దురద, వాపు, ఎరుపుదనం, అసౌకర్యం వంటి లక్షణాలను తగ్గించటానికి ఉపయోగ పడుతుంది.
చింతపండును అధిక మొత్తంలో తరుచుగా తీసుకోకుంటే పిత్తాశయంలో రాళ్ళు వస్తాయి. మధుమేహం తగ్గటానికి మందులు వాడుతున్నప్పుడు చింత పండును అధిక మొత్తంలో తరుచుగా వాడుతుంటే చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు వస్తాయి.
దీనిపై అపారమైన పరిశోధనలు జరిగినప్పటికీ, అడవి చింతపై ఇంకా మెరుగైన పరిశోధనలు చెయ్యాల్సి ఉంది. అధిక దిగుబడులతో పాటు ప్రతి సంవత్సరం కాసే విధంగా చేయటం అవసరం.
చింత బాగా కాస్తే కరువుకు సూచన అంటారు.
చింతలో అనేక రకాలను అభివృద్ధి చేశారు. ఉదా: ప్రతిస్థాన్, అనంత రుధిర. నల్లమలలో (కుడి చింత బయలు, కొమ్మనిపెంట, సర్లపల్లి, అప్పాయిపల్లి మొదలగు ప్రాంతాల్లో ఉన్న చింతను వాటిలోని పోషకాలను బట్టి విభజించి పరిశోధనలు చేసి, మంచి వంగడాలను అభివృద్ధి చెయ్యాలి.

- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924ఇదీ చదవండి: మొక్కలకు ఎప్సమ్ సాల్ట్.. ఇలా వాడితే అదిరిపోయే ఫలితాలు!


